సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలి: చీకటి శ్రీనివాసరావు
ప్రజాశక్తి-ఒంగోలు సిటీ: తౌషిక్ మృతిపై వాస్తవాలను వెలుగులోకి తీసుకురావడానికి సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు చీకటి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు.
తౌషిక్, అతని తల్లి మౌలాబి మృతికి కారణాలను పూర్తిగా విచారించి, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ముస్లిం, దళిత ప్రజాసంఘాల ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన భారీ ధర్నాలో ఆయన మాట్లాడారు. ఘటనపై ప్రభుత్వం, పోలీసుల వ్యవహారశైలిపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. విచారణను పక్కదారి పట్టించేలా వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. మౌలాబికి మతిస్థిమితం లేదంటూ ఎస్‌పి చేసిన వ్యాఖ్యలపైనా ఆయన అభ్యంతరం తెలిపారు.
సింగరాయకొండకు కూతవేటు దూరంలో ఉన్న సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి ఈ ఘటనపై ఎందుకు స్పందించడం లేదని చీకటి శ్రీనివాసరావు ప్రశ్నించారు. ఒక విద్యార్థి మృతి, అనంతరం న్యాయం కోసం పోరాడిన తల్లి మౌలాబి మృతి చెందడం వంటి ఘటనలపై ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు.
తౌషిక్ మృతి తర్వాత విద్యాశాఖ చేపట్టిన విచారణ, పాఠశాలపై తీసుకున్న చర్యలు, అనంతరం న్యాయస్థానం జోక్యంతో పాఠశాల తిరిగి నిర్వహణలోకి వచ్చిన పరిణామాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల భద్రత, విద్యాసంస్థల బాధ్యతపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని కోరారు. తౌషిక్ మృతి, అనంతరం న్యాయం కోసం పోరాడిన తల్లి మౌలాబి మృతి ఘటనలపై ప్రభుత్వం బాధ్యత వహించాలని చీకటి శ్రీనివాసరావు అన్నారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని తెలిపారు. ధర్నాలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు షేక్ సైదా, కేవీపీఎస్, ఎంఆర్‌పీఎస్, వీసీకే, ఎస్‌ఎఫ్‌ఐ, పీడీఎస్‌యూ తదితర సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తౌషిక్, మౌలాబి మృతులపై సమగ్ర విచారణ జరిపి నిజానిజాలను వెలుగులోకి తేవాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

