Dailyhunt
'ఉపాధి' పనుల్లో ఫేస్ యాప్ రద్దు చేయాలి

'ఉపాధి' పనుల్లో ఫేస్ యాప్ రద్దు చేయాలి

ప్రజాశక్తి - కురుపాం : పార్వతీపురం మన్యం జిల్లా జియ్యమ్మవలస మండలం గొర్లి గ్రామంలో ఉపాధి హామీ పనుల వద్ద బుధవారం గిరిజనులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ఆదివాసి గిరిజన సంఘం నాయకుడు మెల్లక చక్రపాణి మాట్లాడుతూ ఫేస్ యాప్ అమలు కారణంగా కూలీలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయని, పనికి హాజరై పని చేసినప్పటికీ యాప్‌లో హాజరు నమోదు కాకపోవడంతో కూలి అందకుండా పోతుందని ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో నెట్‌వర్క్ సమస్యల కారణంగా వందలాది మంది కూలీలు ఇబ్బందులు పడుతున్నారని ఉపాధి కూలి లేక, వ్యవసాయ పనులు కూడా లేక ప్రజలు పస్తులు ఉండే పరిస్థితి ఏర్పడిందన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త విధానాలను రద్దు చేసి పాత పద్ధతుల్లోనే ఉపాధి హామీ చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. సంవత్సరానికి 200 పని దినాలు కల్పించాలని, రోజుకు రూ.600 కూలి ఇవ్వాలని, పని హక్కును గ్యారెంటీ చేయాలని కోరారు. గ్రామసభల ద్వారా పనులను గుర్తించాలనీ, వేసవి అలవెన్సులు 40 శాతం చెల్లించాలని, రెండు పూటల పని విధానాన్ని రద్దు చేయాలని అన్నారు. పనుల వద్ద తాగునీరు, మజ్జిగ, మెడికల్ కిట్లు, టెంట్లు ఏర్పాటు చేయాలని, మేట్లకు ప్రోత్సాహకాలు, పనిముట్ల నిర్వహణకు అదనపు భత్యాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

సమస్యలు పరిష్కరించకపోతే పోరాటం తీవ్రం

ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి కొల్లి గంగు నాయుడు మాట్లాడుతూ ఉపాధి కూలీలను ఇబ్బందులకు గురిచేస్తున్న ఫేస్ యాప్‌ను వెంటనే రద్దు చేయాలని లేదంటే ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. జిల్లాలో అనేక గ్రామాల కూలీలు హాజరు సమస్యలతో తమ దృష్టికి వస్తున్నారని, అధికారులకు పలుమార్లు తెలియజేసినా స్పందన లేకపోవడం బాధాకరమన్నారు. కూలీలకు కూలి చెల్లింపుల విషయంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని విమర్శించారు. అభివృద్ధి పనుల్లో అక్రమాలపై చర్యలు తీసుకోవడంలో కూడా అధికారులు విఫలమయ్యారని ఆరోపించారు.ఉపాధి కూలీల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, లేకపోతే విస్తృత స్థాయిలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గిరిజనులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: prajasakti