Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఉపకార వేతనాల పెంపుపై మరో విడత చర్చ

ఉపకార వేతనాల పెంపుపై మరో విడత చర్చ

జూడాలతో ఉన్నతస్థాయి కమిటీ సమావేశం

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : హైకోర్టు ఆదేశాల మేరకు జూనియర్ డాక్టర్ల (జూడా) డిమాండ్లపై వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతస్థాయి కమిటీ గురువారం తొలివిడత చర్చలు జరిపింది.

మంగళగిరిలోని వైద్య, ఆరోగ్య శాఖ ప్రధాన కార్యాలయంలో కమిటీ ఛైర్మన్, ఆ శాఖ కార్యదర్శి జి. వీరపాండియన్ అధ్యక్షతన 2 గంటల పాటు జరిగిన ఈ భేటీలో డిఎంఇ ఎ. విష్ణువర్ధన్, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ సుధీర్, జూడా అధ్యక్షుడు ఈశ్వర్, భార్గవ్ తదితరులు పాల్గొన్నారు. జూడాల 6 డిమాండ్లపై ఈ సమావేశంలో చర్చించారు.

5 డిమాండ్లపై ప్రభుత్వం తరుపున స్పష్టత ఇచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఇక ప్రధాన అంశమైన జూడాలకు ఉపకారవేతనాల పెంపు అంశంపై హౌస్ సర్జన్లకు 10 శాతం, పిజి, సూపర్ స్పెషాలిటీ వైద్యులకు 3 శాతం చొప్పున పెంపుతో పాటు వచ్చే ఏడాది నుంచి ప్రతి ఏటా 3 శాతం పెంపు ఇస్తామని ప్రభుత్వం ప్రతిపాదించింది. అయితే 13 శాతం పెంపు ఇవ్వాలని జూడా పట్టుబట్టడంతో ఈ అంశంపై మరో విడత చర్చ జరపాలని నిర్ణయించారు. ప్రొఫెసర్ల రిటైర్మెంట్ వయసు పెంపు అంశంపై ప్రభుత్వం ఇంకా ఎలాంటి విధానపరమైన నిర్ణయం తీసుకోలేదని, అవసరమైతే జూడాతో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం తెలిపింది.

నాన్-క్లినికల్ పోస్టుల భర్తీ అంశంపై ఎన్ఎంసి మార్గదర్శకాల ప్రకారమే భర్తీ చేస్తున్నామని స్పష్టం చేసింది. మొత్తం పోస్టుల్లో 30 శాతం వరకు ఎంఎస్సి, పిహెచ్ అర్హత కలిగిన వారితో భర్తీకి అవకాశం ఉండగా, ప్రస్తుతం కేవలం 11.05 మాత్రమే భర్తీ చేసినట్లు తెలిపింది. పని వేళలు, కనీస సౌకర్యాలకు సంబంధించిన అంశాలపై జూనియర్ వైద్యులకు నిర్ణీత పని వేళలు, సౌకర్యాలపై ఇప్పటికే అన్ని ఆస్పత్రుల సూపరింటెండెంట్లకు ఆదేశాలు జారీ చేశామని, అమలులో నిర్లక్ష్యం చేస్తే సూపరిండెంట్లపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. సీనియర్ రెసిడెంట్ల ఉపకార వేతనాల అంశంపై సీనియర్ రెసిడెంట్లు జూడా పరిధిలోకి రారని, వారి స్టెపెండ్ అంశాన్ని ప్రభుత్వం వేరుగా పరిశీలిస్తుందని తెలిపింది. ప్రభుత్వం ప్రతిపాదించిన అంశాలపై ఎపి జూడాల అసోసియేషన్లో చర్చించి ఒక నిర్ణయానికి రానున్నట్లు జూడాల అసోసియేషన్ వెల్లడించింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: prajasakti