ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : రాజధాని అమరావతిపై ముద్రించిన పుస్తకాన్ని టిడిపి ఎంపిలు ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్‌కు మంగళవారం అందజేశారు. పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు ఆధ్వర్యంలో పలువురు ఎంపిలతో కలిసి సిపి రాధాకృష్ణన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా అమరావతి రాజధానిపై 'బిల్ట్ బై ద పీపుల్ సెక్యూర్డ్ బై డెస్టినీ' పేరుతో రూపొందించిన పుస్తకాన్ని ఉపరాష్ట్రపతికి అందజేశారు. అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగాల వారసత్వం నుంచి, రాజధాని పరిరక్షణ కోసం అమరావతి రైతులు, మహిళలు 1,631 రోజుల పాటు చేసిన సుదీర్ఘ పోరాట విశేషాలను ఈ పుస్తకంలో పొందుపరిచారు. 2024 జూన్ రెండు నుంచి అమరావతిని ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా పునరుద్ధరించిన చారిత్రక పరిణామాలు ఈ పుస్తకంలో వివరించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టితో కూడిన నాయకత్వంలో, ఎన్‌డిఎ ప్రభుత్వ మద్దతుతో అమరావతిని ప్రపంచస్థాయి రాజధానిగా తీర్చిదిద్దుతున్నామని శ్రీకృష్ణదేవరాయలు వివరించారు.

