- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం
ప్రజాశక్తి - మైదుకూరు : కడప జిల్లా మైదుకూరు మండలం జివి సత్రం సమీపంలోని మైదుకూరు-బద్వేల్ జాతీయ రహదారిపై బొలేరో క్యాంపర్ వాహనం ఢీకొని ఇద్దరు యువకులు మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది.
పోలీసులు అందించిన వివరాల ప్రకారం…. జివి సత్రం గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు వాకింగ్ చేస్తూ మైదుకూరు వైపు వెళ్తుండగా బద్వేల్ నుంచి మైదుకూరుకు వస్తున్న క్యాంపర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కంబగిరి మదన గోపాల్ (24), వనిపెంట సుమంత్ (23)కు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందారు. విజయ నరసింహకు బలమైన గాయాలు కావడంతో కడప రిమ్స్‌కు తరలించారు.
మృతి చెందిన వారిలో మదన్ గోపాల్ జివి సత్రంలో బార్బర్ షాపు నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు. గత ఏడాది చివరిలో వివాహమైంది. అతని భార్య ప్రస్తుతం మూడు నెలల గర్భిణీ. వనిపెంట సుమంత్ తమిళనాడులోని సబితా ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్నారు.
చేతికి అంది వచ్చిన కుమారుడు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఢీకొన్న వాహనాన్ని సిసి కెమెరాల సహాయంతో గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.

