దక్షిణంలో 18కి పెరిగే అవకాశం
ఇప్పటికే స్పష్టతకు వచ్చిన అధికారులు
ప్రజాశక్తి - విశాఖ కలెక్టరేట్ : జివిఎంసిలో మొత్తం వార్డుల సంఖ్యను 98 నుంచి 120కి పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడంతో వార్డుల పెంపు విషయమై అధికారులు ముమ్మర కసరత్తు చేపట్టారు.
అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ప్రస్తుతం ఈ ప్రక్రియ జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో దక్షిణ నియోజకవర్గంలో కూడా వార్డుల పునర్విభజన కార్యక్రమాన్ని చేపట్టారు. 2021లో జరిగిన జివిఎంసి ఎన్నికలలో 14 వార్డులు దక్షిణ నియోజకవర్గంలో ఉండగా ఇప్పుడు వాటి సంఖ్య 3 నుంచి 4 వార్డులు పెరగవచ్చని భావిస్తున్నారు. 2011 జనాభా ప్రాతిపదికన వార్డుల పునర్విభజన జరుగుతోంది.
2021లో జరిగిన ఎన్నికలలో ఒక్కొక్క వార్డులో సరాసరి 14 వేల నుంచి 20 వేల మంది వరకు ఓటర్లు ఉన్నారు. ఇప్పుడు ఈ సంఖ్య ఒక్కొక్క వార్డులో13 వేల నుంచి 17 వేల మధ్యలో ఉండే అవకాశం ఉందని అంటున్నారు. 2007లో జరిగిన కార్పొరేషన్ ఎన్నికలలో దక్షిణ నియోజకవర్గంలో 11 వార్డులు ఉండేవి. 2021 నాటికి వార్డుల సంఖ్య 14కు పెరిగింది.
అందులో 42వ వార్డులో కొంత భాగం దక్షిణ నియోజకవర్గంలో ఉండగా, స్వల్ప భాగం ఉత్తర నియోజకవర్గం పరిధిలో కలిసి ఉంది. వార్డుల పునర్విభజన కార్యక్రమం ఈ నెల 2 నుంచి 9వ తేదీ వరకు జరుగుతోంది. అప్పటికి వార్డుల విభజన ప్రకారం పూర్తయిన ఓటర్ల జాబితాపై ఈ నెల 10 నుంచి 16 వరకు అభ్యంతరాలను స్వీకరిస్తారు. 17 నుంచి 25వ తేదీ మధ్య సిద్ధం చేసిన జాబితాను ప్రభుత్వానికి పంపిస్తారు.
ఈ నెల 26 నుంచి మే 2వ తేదీలోగా తుది జాబితా ప్రచురణ జరుగుతుంది. ప్రచురించిన జాబితాను మే 3 నుంచి 6వ తేదీలోగా బహిరంగంగా ప్రకటించనున్నట్టు అధికారులు తెలిపారు. వార్డుల సంఖ్య పెరగడంతో పాటు వార్డుల రిజర్వేషన్లలో కూడా మార్పులు జరుగుతాయని అధికారులు తెలిపారు. జివిఎంసి పరిధిలో ఉన్న అన్ని అసెంబ్లీ నియోజక వర్గాలతో పోలిస్తే దక్షిణ నియోజకవర్గంలో ఓటర్ల సంఖ్య తక్కువగా ఉంది. 2024 అసెంబ్లీ ఎన్నికల నాటికి నియోజవర్గంలో ఓటర్ల సంఖ్య 2 లక్షలా 9 వేలా 313 మాత్రమే. ఈ కారణం వల్ల వార్డుల పునర్విజన తర్వాత అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలతో పోలిస్తే దక్షిణ నియోజకవర్గంలో తక్కువ సంఖ్యలో వార్డులు ఏర్పడనున్నాయి.

