Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
వైసిపి మాజీ ఎమ్మెల్యే ముస్తఫా అరెస్ట్‌

వైసిపి మాజీ ఎమ్మెల్యే ముస్తఫా అరెస్ట్‌

నూజివీడు : కిడ్నాప్‌ కేసులో గుంటూరు తూర్పు మాజీ ఎమ్మెల్యే, వైసిపి నాయకుడు షేక్‌ మహమ్మద్‌ ముస్తఫాను నూజివీడు పోలీసులు అరెస్టు చేశారు. వ్యాపార వివాదాల నేపథ్యంలో పొగాకు వ్యాపారి కుమారుడితో పాటు మరో ముగ్గురిని కిడ్నాప్‌ చేసి బెదిరింపులకు పాల్పడిన ఘటనలో మాజీ ఎమ్మెల్యే షేక్‌ మహమ్మద్‌ ముస్తఫా, ఆయన కుమారుడు బషీర్‌లపై నూజివీడు పోలీసులు కిడ్నాప్‌, ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు చేశారు.

మాజీ ఎమ్మెల్యే ముస్తఫాకు గుంటూరులో పొగాకు గోదాము ఉంది. ఏలూరు జిల్లా కొయ్యలగూడేనికి చెందిన కడిమి సూర్యచంద్రం రైతుల నుంచి పొగాకు సేకరించి, గుంటూరులో ముస్తఫాకు అమ్మేవారు. ఇటీవల ఆయన పొగాకు ధరలు భారీగా తగ్గించారు. దీంతో తనకు వ్యాపారం గిట్టుబాటు కావడం లేదంటూ సూర్యచంద్రం.. ముస్తఫాకు సరకు అమ్మడం ఆపేసి, గుంటూరులోనే మరో కంపెనీకి విక్రయిస్తున్నారు. సూర్యచంద్రం కుమారుడు అభి.. డ్రైవర్‌ బాలరాజు, గుమస్తా దుర్గారావుతో కలిసి సోమవారం రాత్రి పొగాకు బేళ్లను సొంత వాహనంలో లోడ్‌ చేసుకొని కొయ్యలగూడెం నుంచి గుంటూరుకు బయలుదేరారు. కాసేపటికే అభి ఏడుస్తూ తండ్రికి ఫోన్‌ చేశారు. 'మాజీ ఎమ్మెల్యే ముస్తఫా కొడుకు బషీర్, ఆయన అనుచరులు రెండు కార్లలో వచ్చి మమ్మల్ని నూజివీడులో అడ్డగించారు. పొగాకు బేళ్లతో సహా వ్యాన్‌ను లాక్కొన్నారు. మమ్మల్ని కిడ్నాప్‌ చేసి తీసుకెళ్తున్నారు. వాళ్లకు ఇవ్వాల్సిన డబ్బులు చెల్లిస్తేనే మమ్మల్ని వదిలేస్తామంటున్నారు' అని ఫోన్‌ పెట్టేశాడు. వెంటనే సూర్యచంద్రం మాజీ ఎమ్మెల్యే ముస్తఫాకు ఫోన్‌ చేశారు. 'మాకివ్వాల్సిన డబ్బులు తీసుకుని వెంటనే గుంటూరులో పొగాకు గోదాము వద్దకు వస్తే సరి. లేదంటే నీ కొడుకు నీకు దక్కడు' అని ఆయన హెచ్చరించారు. ఆందోళనకు గురైన సూర్యచంద్రం పోలీసులకు సమాచారమిచ్చారు. ముస్తఫా పొగాకు గోదాములు గుంటూరు జిల్లా పెదకాకానిలో ఉన్నందున బాధితులను అక్కడే బంధించి ఉంటారన్న అంచనాతో నూజివీడు పోలీసులు.. అక్కడి స్టేషన్‌ సిబ్బందికి సమాచారమిచ్చారు. వెంటనే వారు ముస్తఫాకు ఫోన్‌ చేసి.. 'సూర్యచంద్రం మీకు డబ్బులివ్వాల్సి ఉంటే చట్టపరంగా తేల్చుకోండి. అంతేకానీ, అతని కుమారుడిని కిడ్నాప్‌ చేయడం తగదు. వెంటనే వారితోపాటు మీ అబ్బాయిని స్టేషన్‌లో లొంగిపోయేలా చూడండి' అని స్పష్టం చేశారు. మంగళవారం తెల్లవారుజామున బాధితులను వెంటబెట్టుకొని వచ్చిన కిడ్నాపర్ల ముఠా.. పెదకాకాని ఠాణాలో లొంగిపోయింది. కానీ, ముస్తఫా, బషీర్‌ అప్పటి నుంచి పరారీలో ఉన్నారు.


Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: prajasakti