Wednesday, 16 Oct, 1.39 am ప్రజాశక్తి

తాజావార్తలు
వైసిపిది ప్రచార ఆర్భాటమే

* రైతుల పట్ల చిత్తశుద్ధి నిరూపించుకోండి
* సిఎం జగన్‌కు కళా వెంకటరావు బహిరంగ లేఖ
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో:
వైసిపి ప్రచార ఆర్భాటం కొండంత అయితే రైతులకు చేసింది మాత్రం గోరంతేనని టిడిపి రాష్ట్ర అధ్యక్షులు కిమిడి కళా వెంకటరావు అన్నారు. రుణమాఫీ జీవో రద్దుతో రైతులను నిలువునా ముంచిన మీరు నేడు రైతు భరోసా సాయానికి పెద్ద మొత్తంలో కోత విధిస్తూ మరోసారి తడిగుడ్డతో వారి గొంతు కోశారని పేర్కొన్నారు. రైతుల పక్షాన 15 ప్రశ్నలను సంధిస్తూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి మంగళవారం ఆయన బహిరంగలేఖ రాశారు. బడ్జెట్‌లో 64.06లక్షల మందికి పథకం వర్తింపజేస్తామని హామీనిచ్చి అమల్లో 54లక్షలకు కుదించారని, 15.36లక్షల మంది కౌలు రైతులను 3లక్షలకు తగ్గించడం నమ్మకద్రోహం కాదా? అని ప్రశ్నించారు. రైతులకు ఒకే దఫాలో ఏటా రూ.12,500 ఇస్తామని 2017లో జరిగిన ప్లీనరీలో ప్రకటించడంతోపాటు రాష్ట్ర నిధుల నుంచే ఇస్తానని హామీనిచ్చారని తెలిపారు. 2017నాటికి పిఎం కిసాన్‌ సమ్మాన్‌ రూ.6వేలు ప్రకటించలేదని, హామీపై నిలబడే వారైతే ముఖ్యమంత్రి ఇప్పుడు కేంద్రం ఇస్తున్న రూ.6వేలతో పాటు రాష్ట్రం రూ.12,500తో కలిపి రూ.18,500కి బదులు రూ.13,500 ఇస్తామంటే రూ.5వేలు ఒక్కొక్క రైతుకు ఎగనామం పెట్టడం కాదాని పేర్కొన్నారు. రైతు భరోసా కింద రాష్ట్ర నిధుల నుంచి రూ.13,500కి బదులు రూ.7,500 మాత్రమే చెల్లిస్తూ రూ.13,500 ఇస్తున్నట్లు ప్రచారం చేసుకోవడం అసత్యం కాదా? ఇది రైతును దగా చేయడం కాదా?

అంటూ విమర్శించారు. టిడిపి హయాంలో రూ.50వేలలోపు రైతు రుణాలను ఒకే దఫాలో రద్దు చేసింది నిజంకాదా? రైతు రుణమాఫీ ద్వారా ఒక్కో రైతు రూ.1.10 లక్షలు లబ్ధి పొందింది వాస్తవం కాదా? అని ఆయన ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. కులాలు, మతాలకతీతంగా పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించి నేడు నిబంధనల పేరుతో అన్నదాతల మధ్య కులాల కుంపట్లు పెట్టడం దుర్మార్గంకాదా ? అని ప్రభుత్వాన్ని నిలదీశారు. ధరల స్ధిరీకరణ నిధి ప్రకటించి, టమాటా, ఉల్లి రైతులకు మాత్రం మద్దతు ధరను అందించకపోవడం వంచన కాదా అని వెంకటరావు ప్రశ్నించారు.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: prajasakti
Top