Dailyhunt
వందకు చేరువలో చింత

వందకు చేరువలో చింత

ప్రజాశక్తి - పార్వతీపురం : ఈ ఏడాది ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులకు కాసుల పంట పండుతోంది. చింతపండు దిగుబడి గణనీయంగా తగ్గిపోయినా ధర మాత్రం ఆశాజనకంగా పెరుగుతోంది.

గిరిజనులు గతంలో ఎన్నడూ చూడని విధంగా చింతపండు రేటు కిలో వంద రూపాయలకు చేరువలో ఉంది. ప్రస్తుతం మార్కెట్లో నాణ్యమైన చింతపండు కిలో ధర 90రూపాయల వరకు పలుకుతోంది. మరి కొద్దిరోజుల్లో ఇది వంద రూపాయలు దాటే పరిస్థితి కనిపిస్తోంది. రాష్ట్రంలో ఈ ఏడాది సీజన్‌లో చింతపండు దిగుబడి ఆశాజనకంగా లేదు.

దీంతో మార్కెట్లో ధర అమాంతంగా పెరుగుతూ వస్తోంది. గత ఏడాదిలో దిగుబడి ఎక్కువగా ఉండడంతో కిలో చింతపండు రూ.60 దాటలేదు. ఈ ఏడాది పంట దిగుబడి తగ్గడంతో ధర పెరుగుదల గిరిజనులకు కాసుల పంట కురిపిస్తోంది. పంట దిగుబడి గణనీయంగా తగ్గిపోయినా ధర మాత్రం రికార్డు స్థాయిలో పెరగడం ఏజెన్సీ వాసుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది.రెండు సార్లు ధర పెంచిన జిసిసిచింతపండు సీజన్‌ ప్రారంభానికి ముందు జిసిసి చింతపండు కిలో ధర రూ.36గా నిర్ణయించింది.

కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన చిన్న తరహా ఉత్పత్తుల ధరలకు అనుగుణంగానే జిసిసి మొదటగా కిలో ధర రూ.36గా ప్రకటించింది. అయితే అప్పటికే మార్కెట్లో ధర రూ.60 పలుకుతుండడంతో అనివార్యంగా జిసిసి యాజమాన్యం కూడా రూ.45 వరకు పెంచింది. ప్రస్తుతం మార్కెట్లో ధర రూ.90 వరకు చేరడంతో జిసిసి మరో అడుగు ముందుకు వేసి రూ.55గా నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర రూ.36లైనా జిసిసి మాత్రం మరో రూ.19 పెంచింది.

జిసిసి గిరిజనులకు మార్కెట్లో మరింత గిట్టుబాటు ధర లభించాలనే ఉద్దేశంతో 55 రూపాయల వరకు ధర పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. గిరిజనులు జిసిసికి చింతపండు విక్రయించకపోయినా ఫర్వాలేదని, దళారుల వలలో పడి నష్టపోకుండా రెండు సార్లు ధర పెంచింది. ఐటిడిఎ పిఒ యశ్వంత్‌ కుమార్‌ రెడ్డి సూచనల మేరకు జిసిసి ఎమ్‌డి ఎస్‌ఎస్‌ శోబిక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే జిసిసి అధికారులు, సిబ్బంది సంతల్లో అటవీ ఉత్పత్తుల అమ్మకాల్లో గిరిజనులు మోసం పోకుండా అవగాహన కల్పించారు.పక్క రాష్ట్రాల నుంచి దిగుమతిఎపిలో చింతపండు దిగుబడి గణనీయంగా తగ్గడంతో పక్క రాష్ట్రాల నుంచి అధికంగా దిగుమతి జరుగుతోంది.

రాష్ట్రంలో ప్రజలు, విద్యాసంస్థల అవసరాలకు అనుగుణంగా దిగుబడి లేకపోవడంతో వ్యాపారులు గిరిజన గ్రామాలకు కొనుగోలు చేస్తున్నారు. అంతేకాకుండా ఒడిశా, ఛత్తీస్గఢ్‌ రాష్ట్రాల నుంచి ఎక్కువగా దిగుమతి చేస్తున్నారు. నాణ్యమైన కిలో చింతపండు ధర మార్కెట్లో ప్రస్తుతం రూ.90కు చేరింది. మున్ముందు ఇది వంద రూపాయలు దాటే పరిస్థితి కనిపిస్తోంది.

వ్యాపారులు ఇప్పటికే వేలాది టన్నులు కొనుగోలు చేసి కోల్డ్‌ స్టోరేజ్‌ ల్లో నిల్వ చేస్తున్నారు. చింతపండుకి ఈ ఏడాది డిమాండ్‌ బాగా పెరుగుతుందనే ఆశతో ఎక్కువ మొత్తంలో నిల్వ చేస్తున్నారు. గిరిజనుల మేలు కోసం ధర పెంపు ఈఏడాది సీజన్‌ ప్రారంభానికి ముందు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కిలో 36 రూపాయలు. ఆ ధర ప్రకారం జిసిసి కొనుగోలు ప్రారంభించింది.

అయితే మార్కెట్లో ధర పెరుగుతున్న నేపథ్యంలో మొదటిసారి 45 రూపాయల వరకు పెంచాం. ఇంకా మార్కెట్లో ధర 90 రూపాయల వరకు చేరడంతో రెండో సారి రూ.55గా నిర్ణయిస్తూ జిసిసి ఎమ్‌డి ఎస్‌ ఎస్‌ శోబిక ఉత్తర్వులు జారీ చేశారు. ఐటిడిఎ పిఒ యశ్వంత్‌ కుమార్‌ రెడ్డి సిఫార్సు మేరకు ధర పెంపు జరిగింది. సంస్థ ప్రయోజనాల కన్నా గిరిజనుల ప్రయోజనాలే పరమావధిగా భావించి యాజమాన్యం రెండు సార్లు ధర పెంచింది.

గిరిజనులు దళారుల వలలో చిక్కి మోసపోకుండా అవగాహన కల్పించాం.-జె.రామారావు,డిఎం,జిసిసిజిసిసి ఆధ్వర్యంలో చింతపండు కొనుగోలుగుమ్మలక్ష్మీపురం : స్థానిక జిసిసి ఆధ్వర్యంలో గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి గిరిజనుల నుంచి చింతపండు కొనుగోలు చేస్తున్నట్లు మేనేజర్‌ రాము తెలిపారు. ఇందులో భాగంగానే మండలంలోని గొల్లాలంకలో మంగళవారం గిరిజనులు సేకరించిన చింతపండు కొనుగోలు చేశామన్నారు. ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు గిరిజనులకు గిట్టుబాటు ధర కల్పించాలనే ఉద్దేశంతో కిలో చింతపండు ధర రూ. 45 నుంచి రూ.55కు పెంచినట్లు తెలిపారు. గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి గిరిజనులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. గిరిజనులు సేకరించిన చింతపండు, ఇతర అటవీ ఫలసాయాలు గ్రామాల్లోకి వస్తున్న జిసిసి సిబ్బంది నేరుగా కొనుగోలు చేసి దళారుల నుంచి రక్షణగా ఉంటామన్నారు. కార్యక్రమంలో అకౌంటెంట్‌ తమ్మయ్య, సిసిపిఎలు, సిబ్బంది ఉన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: prajasakti