Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
విజయ్‌పై చర్యలకు బాలల హక్కుల కమిషన్‌ ఆదేశం

విజయ్‌పై చర్యలకు బాలల హక్కుల కమిషన్‌ ఆదేశం

చెన్నయ్‌ : తమిళగ వెట్రి కళగం (టివికె) అధ్యక్షులు, సినీ నటుడు విజయ్‌ మరోమారు చిక్కుల్లో పడ్డారు. విజయ్​పై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పోలీసు శాఖకు, ఎన్నికల సంఘానికి తమిళనాడు రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఆదేశాలు జారీ చేసింది.

పిల్లలను భావోద్వేగపరంగా ప్రేరేపించి, టివికె పార్టీకి ఓటు వేసేలా తమ తల్లిదండ్రులపై ఒత్తిడి తెచ్చేలా చేసి వారిని ఓట్లు సేకరించే సాధనంగా విజయ్ ఉపయోగించుకున్నారని కమిషన్ పేర్కొంది. ఎన్నికల ప్రచార ప్రసంగాల ద్వారా పిల్లలు తమ తల్లిదండ్రుల ఓటు నిర్ణయాలను ప్రభావితం చేసేలా ప్రేరేపించారన్న నేపథ్యంలో కమిషన్ ఈ నిర్ణయం తీసుకుంది.
ఎన్నికల ప్రచారానికి సంబంధించిన వివిధ చట్టాల ప్రకారం పిల్లలను సహాయకులుగా లేదా సామాన్య ప్రజలను చేరుకోవడానికి ఒక మాధ్యమంగా ఉపయోగించడం నిషేధమని కమిషన్‌ తెలిపింది. ఈ విషయంలో తమిళ వెట్రి కళగం నేత జోసెఫ్ విజయ్, ఆయన ప్రచార విభాగం తమ రాజకీయ పార్టీని సామాన్య ప్రజలకు చేరవేయడానికి పిల్లలను సహాయకులుగా, మాధ్యమంగా చాలా చాకచక్యంగా ఉపయోగించుకున్నారని తెలిపింది. ఇది ఏమాత్రం అనుమతించే వ్యూహం కాదని పేర్కొంది. ఈ క్రమంలోనే ఆయన బాలల న్యాయ (సంరక్షణ, రక్షణ) చట్టం, 2015లోని సెక్షన్లు 75, 83లను ఉల్లంఘించినందున విజయ్‌పై అధికారిక విచారణ జరపాలని బాలల కమిషన్ ఆదేశించింది. తాజా అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఓ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న టివికె అధినేత విజయ్, పిల్లలు తమ తల్లిదండ్రులను 'ఈల' గుర్తుకు ఓటు వేయమని చెప్పాలంటూ సూచించారు. ఈ ప్రసంగం తర్వాత విజయ్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఆయనపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు తీవ్రమయ్యాయి. ఈ నేపథ్యంలో బాలల కమిషన్‌ నిర్ణయం వెలువడింది. కాగా ఎన్నికలు ముగిసిన తర్వాత విజయ్ వరసగా ఆలయ పర్యటనలు చేస్తున్నారు. బుధవారం మహారాష్ట్రలోని ప్రసిద్ధ షిర్డీ సాయిబాబా ఆలయాన్ని సందర్శించారు. అంతకుముందు తమిళనాడులోని తూత్తుకుడి జిల్లా తిరుచెండూరులో ఉన్న ప్రసిద్ధ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: prajasakti