Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
విజిలెన్స్ నివేదిక పేరుతో బిల్లులు నిలిపేయొద్దు

విజిలెన్స్ నివేదిక పేరుతో బిల్లులు నిలిపేయొద్దు

- కాంట్రాక్టర్లకు బకాయిలు చెల్లించాలి

- ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

ప్రజాశక్తి-అమరావతి : విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విచారణ నివేదిక కోసం ఎదురుచూస్తున్నామనే కారణంతో కాంట్రాక్టర్ల బిల్లుల చెల్లింపులను నిలిపివేయడం సమంజసం కాదని హైకోర్టు పేర్కొంది.

ఒకవేళ విచారణలో పనుల్లో అక్రమాలు జరిగినట్లు తేలితే, ఇప్పటికే చెల్లించిన మొత్తాన్ని చట్ట ప్రకారం తిరిగి వసూలు చేసుకునే అవకాశం అధికారులకు ఉందని తెలిపింది. కడప జిల్లా పులివెందుల ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ (పిఎడిఎ) పరిధిలో సిసి రోడ్లు, శ్మశానవాటికల ప్రహరీలు, బోరు బావుల తవ్వకం, వెటర్నరీ ఆస్పత్రుల ఆధునీకరణ, సామాజిక భవనాల నిర్మాణం తదితర అభివృద్ధి పనులు పూర్తి చేసిన కాంట్రాక్టర్లకు బకాయిలు విడుదల చేయాలని అధికారులను ఆదేశించింది. రూ.25 లక్షల వరకు ఉన్న బిల్లులను నాలుగు వారాల్లో, అంతకంటే ఎక్కువ విలువైన బిల్లులను ఎనిమిది వారాల్లో చెల్లించాలని జస్టిస్ కె శ్రీనివాసరెడ్డి తీర్పులో పేర్కొన్నారు.

వైసిపి హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులకు చెల్లింపులు జరగకపోవడంతో వైఎస్ఆర్‌ కడప జిల్లాకు చెందిన పలువురు సివిల్ కాంట్రాక్టర్లు 2024, 2025లో హైకోర్టును ఆశ్రయించారు. ఒప్పందాల ప్రకారం పనులు పూర్తిచేశామని, సంబంధిత అధికారులు వాటిని పరిశీలించి ఎం-బుక్‌లో నమోదు చేసినప్పటికీ బిల్లులు విడుదల చేయలేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. విచారణ సందర్భంగా విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ జనరల్ తరపున దాఖలైన కౌంటర్‌లో పిఎడిఎ పనులపై విచారణ కొనసాగుతోందని, కొన్ని అవకతవకలు గుర్తించామని, నివేదిక సిద్ధమైన తర్వాత ప్రభుత్వానికి సమర్పిస్తామని తెలిపింది. అయితే విచారణ పూర్తయ్యే వరకు బిల్లులు నిలిపివేయాలని తాము ఎక్కడా సూచించ లేదని కూడా స్పష్టం చేసింది. ఆర్థికశాఖ సహాయ ప్రభుత్వ న్యాయవాది 2019-2024 మధ్య పిఎడిఎ చేపట్టిన పనులపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో విచారణ కొనసాగుతోందని, నివేదిక రావాల్సి ఉందని వాదించారు. ఆ వాదనలను న్యాయస్థానం అంగీకరించలేదు. విజిలెన్స్ నివేదిక పెండింగ్‌లో ఉందనే కారణంతో చెల్లింపులు నిలిపివేయడం సరికాదంది. కాంట్రాక్టర్ల బిల్లులను నిర్ణీత గడువులో విడుదల చేయాలని అధికారులను ఆదేశించింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: prajasakti