Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
విమాన కంపెనీలకు కేంద్రం మరో బంపర్‌ ఆఫర్‌

విమాన కంపెనీలకు కేంద్రం మరో బంపర్‌ ఆఫర్‌

  • ఇంధన ధరల స్థిరీకరణకు రూ.10,000 కోట్ల ప్యాకేజీ

న్యూఢిల్లీ : మోడీ సర్కార్‌ మరోమారు సంపన్నుల పక్షపాతి అని నిరూపించుకుంది. సామాన్యులు ఉపయోగించే పెట్రోల్‌, డీజిల్‌ ధరలను ఓ వైపున పెంచుతున్న బిజెపి ప్రభుత్వం..

మరోవైపు ధనవంతులు ప్రయాణించే విమానయాన రంగంపై భారం పడకుండా సాధ్యమైనన్ని చర్యలు తీసుకుంటుంది. ఈ నేపథ్యంలోనే జూన్‌1న విమానాల జెట్ ఇంధన (ఎటిఎఫ్‌) ధరలను 27 శాతం (కిలోలీటరుకు సుమారు 400 డాలర్లు) తగ్గించడం వల్ల విమానయాన సంస్థలకు భారీ లబ్ధి కల్పించింది. తాజాగా ఆ కంపెనీలపై ఇంధన భారాన్ని మరింత తగ్గించడానికి వేల కోట్ల నిధిని ఏర్పాటుకు ముందుకు వచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేబినెట్ సమావేశంలో విమాన ఇంధన ధరల స్థిరీకరణ నిధి కోసం ఏకంగా రూ.10,000 కోట్ల బడ్జెట్‌కు ఆమోదం తెలిపారు. పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ ద్వారా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు వడ్డీ లేని అడ్వాన్సుల రూపంలో ఈ నిధులు అందుతాయని, దీనివల్ల విమానయాన సంస్థలపై ఆర్థిక భారం భారీగా తగ్గుతుందని కేంద్ర సమాచార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. మే నెలలో కిలోలీటరుకు 1,511 డాలర్లుగా ఉన్న అంతర్జాతీయ విమాన ఇంధన ధరను.. ఇటీవల 27 శాతం తగ్గింపునతో 1,100 డాలర్లకు (సుమారు రూ.1,05,000) చేర్చింది. ఈ కీలక నిర్ణయం అంతర్జాతీయ విమాన సర్వీసులు నడిపే సంస్థలకు లబ్ధి చేకూరనుంది.
మధ్యప్రాచ్య ఉద్రిక్తతల కారణంగా ఏవియేషన్ టర్బైన్ ఇంధనం ధరలు స్వల్ప కాలంలోనే దాదాపు 2.5 రెట్లు పెరిగాయని మంత్రి పేర్కొన్నారు. మార్చి 2026లో లీటరుకు రూ.60.5 గా ఉన్న ఇంధన ధర.. మే 2026 నాటికి ఏకంగా రూ.142కు చేరింది. విమానయాన సంస్థల నిర్వహణ ఖర్చులలో ఎటిఎఫ్ వాటానే దాదాపు 40 శాతంగా ఉంటుంది. ఈ అసాధారణ ధరల పెరుగుదల చమురు మార్కెటింగ్ కంపెనీలతో పాటు విమానయాన రంగంపై తీవ్ర ప్రభావం చూపింది. ఈ నేపథ్యంలో దేశీయ విమాన కార్యకలాపాల కోసం విమాన టర్బైన్ ఇంధనం ధరను కేంద్ర ప్రభుత్వం లీటరుకు రూ.75.6 గా నిర్ణయించినట్లు మంత్రి అశ్విని వైష్ణవ్‌ స్పష్టం చేశారు. దీంతో విమాన ప్రయాణ ఛార్జీలు నియంత్రణలోకి రావడం వల్ల సాధారణ, వ్యాపార ప్రయాణికులకు, పర్యాటకులకు పెరిగిన ఛార్జీల భారం నుండి పెద్ద ఊరట లభించనుందన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: prajasakti