Dailyhunt
విశాఖ డెయిరీపై విచారణ బుట్టదాఖలేనా!

విశాఖ డెయిరీపై విచారణ బుట్టదాఖలేనా!

  • నాడు కస్సుబుస్సుమన్న స్పీకర్‌ అయ్యన్న నోట మాటేది?
  • రెండేళ్లు కావస్తున్నా అడుగు ముందుకేయని శాసనసభా సంఘం!

​ప్రజాశక్తి- గ్రేటర్‌ విశాఖ బ్యూరో : 'విశాఖ డెయిరీ అవినీతి, అక్రమాల ఫైలును మూసేసిట్టేనా?

విశాఖ డెయిరీ చైర్మన్‌కు ఆడారి ఆనంద్‌కుమార్‌కు క్లీన్‌ చిట్‌ ఇచ్చేసినట్టేనా?' అంటూ ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో పాడి రైతుల్లో తాజాగా టిడిపి కూటమి పాలన తీరుపై చర్చ జరుగుతోంది. విచారణకు శాసనసభా సంఘం ఏర్పాటు చేసి రెండేళ్లు కావస్తున్నా అడుగు ముందుకు పడకపోవడం విమర్శలకు తావిస్తోంది. రైతుల పేరుతో రూ.కోట్లు కొల్లగొట్టి సొంత ఖాతాలకు మళ్లించినట్లు వచ్చిన అభియోగాలపై విశాఖకు చెందిన ప్రస్తుత బిజెపి నాయకుడు (2024 ఎన్నికల్లో వైసిపి అభ్యర్థి) ఆడారి ఆనంద్‌కుమార్‌పై రాష్ట్రంలో టిడిపి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే జ్యోతుల నెహ్రూ అధ్యక్షతన శాసనసభా సంఘాన్ని వేసింది. నర్సీపట్నం టిడిపి ఎమ్మెల్యే, రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు తీవ్రస్థాయిలో విశాఖ డెయిరీపై అవినీతి ఆరోపణలు అప్పట్లో చేశారు. దేశంలోనూ, రాష్ట్రంలోనూ అనేక మంది రాజకీయ నాయకులు, కార్పొరేట్లు ఆర్థిక నేరాలకు పాల్పడి ఆ తర్వాత బిజెపిలో చేరుతున్నారు. అనంతరం వారిపై విచారణ అక్కడితో ఆగిపోతోంది. ఎటువంటి చర్యలూ ఉండడం లేదు. విశాఖ డెయిరీ విషయంలోనూ ఇదే జరిగిందని పరిశీలకులు అంటున్నారు. సభాసంఘం ఏర్పాటు తర్వాత ఆనంద్‌కుమార్‌ వైసిపిని వీడి బిజెపిలో చేరారు. టిడిపి కూటమి ప్రభుత్వంలో బిజెపి కూడా భాగస్వామిగా ఉన్నందున, ఆనంద్‌కుమార్‌పై చర్యలు తీసుకుంటే బిజెపికి కోపం వస్తుందనే ఉద్దేశంతోనే విచారణ అటకెక్కిందని ప్రచారం జరుగుతోంది. బిజెపి అధ్యక్షులు పురంధేశ్వరి సమక్షంలో 2024 డిసెంబరు 25న బిజెపిలో చేరిన ఆనంద్‌కుమార్‌ ప్రస్తుతం ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్ష పదవిలో ఉన్నారు. రాష్ట్రంలో అధికారం పాలుపంచుకుంటున్న టిడిపి, బిజెపి, జనసేన ఒక్కటై డెయిరీ అక్రమార్కుడు ఆనంద్‌కుమార్‌ ఫైలును తొక్కిపట్టేశాయన్న చర్చ తాజాగా ఉమ్మడి విశాఖ జిల్లా ప్రజల్లోనూ, పాల రైతుల్లోనూ పెద్ద ఎత్తున సాగుతోంది. ప్రశ్నించడానికే పార్టీని పెట్టానని చెప్తున్న జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ దీనిపై నోరు మెదపకపోవడం విమర్శలకు తావిస్తోంది. అనకాపల్లి బిజెపి ఎంపి సిఎం రమేష్‌, సుజనా చౌదరిలపై కూడా గతంలో విచారణలు ఈ విధంగానే అటకెక్కడాన్ని ఈ సందర్భంగా ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు.

కమిటీ నివేదిక 2 నెలల్లో అని చెప్పి…

విశాఖ డెయిరీ అక్రమాలు అన్నీ ఇన్నీ కావని, రైతులకు దక్కాల్సిన రూ.వందల కోట్లను కుటుంబ విలాసాలకు దారి మళ్లించారని స్పీకర్‌ అయ్యన్నపాత్రుడుతోపాటు పలువురు టిడిపి నాయకులు అప్పట్లో ఆరోపణలు చేశారు. రెండు నెలల్లో విచారణ పూర్తి చేసి బాధ్యులను గుర్తించి కఠినంగా శిక్షిస్తామని శాసనసభా సంఘం చైర్మన్‌ జ్యోతుల నెహ్రూ అప్పట్లో ప్రకటించారు. రెండేళ్లు కావస్తున్నా విచారణ ఏమైందనే విషయం నేటికీ ప్రకటించలేదు. విశాఖపట్నం, విజయనగరం, అనకాపల్లి జిల్లాలకు చెందిన పాడి రైతులు స్వయంగా అక్రమాల చిట్టాలను టిడిపి నేతలకు పలుమార్లు అందించారు. విశాఖ డెయిరీ యాజమాన్యం లీటరు ఆవు పాలు రైతుల నుంచి రూ.30కు సేకరించి మార్కెట్లో రూ.60కు అమ్ముకుని రూ.వేల కోట్లు ఆర్జించిందని, బోనస్‌లు, పాల ధర వ్యత్యాసాన్ని ఏళ్ల తరబడి చెల్లించలేదని ఆరోపణలు ఉన్నాయి. సహకార రంగంలోని విశాఖ డెయిరీని టిడిపి హయాంలో డెయిరీ యాజమాన్యం కంపెనీ చట్టంలోకి మార్చేసింది. అప్పటి నుంచి అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని ఆరోపణలు ఉన్నాయి. 2025 మే 16న జ్యోతుల నెహ్రూ స్వయంగా విశాఖ షీలానగర్‌లోని విశాఖ డెయిరీని సందర్శించి డెయిరీ అక్రమాలపైనా, ఆర్థిక అవకతవకలపైనా పాడి రైతులు తనను కలిసి అనేక ఫిర్యాదులు అందజేశారని, విచారణ జరిపి నిజాలు నిగ్గు తేలుస్తామని, చట్టం నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరని గతంలో ప్రకటించారు. అయినా, ఇంతవరకూ ఎటువంటి చర్యలూ తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: prajasakti