కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లోని ఫల్తా అసెంబ్లీ నియోజకవర్గంలో మే 21న రీపోలింగ్ నిర్వహించాలని భారత ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ నియోజకవర్గంలోని మొత్తం 285 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ జరుగనుంది.
మే 24న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఏప్రిల్ 29న రెండో దశలో పోలింగ్ జరిగిన ఫల్తా నియోజకవర్గంలో విస్తృత అవకతవకలు జరిగాయని ఆరోపణల నేపథ్యంలో తృణమూల్ కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ మధ్య తీవ్ర ఘర్షణలు చోటుచేసుకున్నాయి.
ఇక రెండో దశలో పోలింగ్ జరిగిన ఇతర నియోజకవర్గాల్లో కూడా రీపోలింగ్ కొనసాగుతోంది. మగ్రాహట్ పశ్చిమ్ నియోజకవర్గంలోని 11 బూత్‌లలో, డైమండ్ హార్బర్ నియోజకవర్గంలోని నాలుగు బూత్‌లలో మే 2న రీపోలింగ్ నిర్వహించారు.
ఓటింగ్ ప్రక్రియలో అవకతవకలు జరిగినట్లు రిటర్నింగ్ అధికారులు, పరిశీలకులు నివేదించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్ 58(2) ప్రకారం ఏప్రిల్ 29న జరిగిన పోలింగ్‌ను చెల్లనిదిగా ప్రకటించారు.

