Thursday, 05 Aug, 12.34 pm ప్రజాశక్తి

తాజా వార్తలు
Womens Hokey team : మహిళల హాకీ టీంకు సూరత్‌ వజ్రాల వ్యాపారి బంఫర్‌ ఆఫర్‌

అహ్మదాబాద్‌ : భారత మహిళల హాకీ జట్టుకు సూరత్‌కు చెందిన ప్రముఖ వజ్రాల వ్యాపారి సావ్‌జీ ధోలాకియా బంపర్‌ ఆఫర్‌ ఇచ్చారు. ఒలింపిక్స్‌లో భారత మహిళల హాకీ టీమ్‌ స్వర్ణ పతకం సాధిస్తే.. జట్టు సభ్యులకు వారి కలలను సాకారం చేసేవిధంగా నగదు బహూకరించనున్నట్లు ఆయన ట్విటర్‌ ద్వారా ప్రకటించారు. హాకీ టీమ్‌ సభ్యులెవరైనా సొంతింటి కలను సాకారం చేసుకోవాలనుకునే వారికి రూ. 11 లక్షలు, ఇల్లు ఉన్న వారికి కారును బహూకరించాలని నిర్ణయించినట్లు హెచ్‌కే గ్రూప్‌ అధినేత ప్రకటించారు.
మహిళల హాకీ టీమ్‌ సెమీ ఫైన్‌ల్‌కి చేరిన సంతోషంతో నగదును బహూకరిస్తున్నట్లు ఆయన ట్వీట్‌ చేశారు. ట్వీట్‌లో 'టోక్యోలో అమ్మాయిలు చరిత్ర సృష్టిస్తున్నారు. క్రీడాకారుల మనోధైర్యం పెంచేందుకే మా వినయపూర్వక ప్రయత్నం. రాబోయే టోర్నీల్లో కూడా వారు మెరుగైన ప్రదర్శన కనబరిచేందుకు ఇది సహాయపడుతుంది. నేను ఒక్కడినే కాదు.. నా సోదరుడు కమలేష్‌ దేవ్‌ సైతం విజేతలందరికీ రూ. లక్ష నగదు ప్రోత్సాహం ఇవ్వనున్నారు. మా కుటుంబ సభ్యులే కాకుండా.. దేశ ప్రజలు సైతం ముందుకు వచ్చి క్రీడాకారులకు మద్దతివ్వాలని కోరుకుంటున్నాను. వారంతా దేశానికి మరింత కీర్తి తెచ్చేలా వారిని చైతన్యపరచాలి' అంటూ పిలుపునిచ్చారు. ధోలాకియా బహుమతులివ్వడం కొత్తేమీ కాదు. తన కంపెనీల్లో పనిచేసే ఉద్యోగస్తులకు ప్రతిఏడాదీ ఘనమైన దీపావళి కానుకలిస్తారు. ప్రతి ఏడాది ఉత్తమ ప్రదర్శన చూపించిన ఉద్యోగులకు కార్లతో పాటు ప్లాట్లను సైతం ఇస్తారు. 'హరే కష్ణ ఎక్స్‌పోర్ట్స్‌' పేరుతో సావ్‌జీ వజ్రాల వ్యాపారం చేస్తున్నారు.
టోక్యో ఒలింపిక్స్‌లో మహిళల జట్టు మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను ఓడించి సెమీఫైనల్‌కు చేరిన భారత జట్టు... బుధవారం జరిగిన మ్యాచ్‌లో అర్జెంటీనాపై 2-1తో ఓడిపోయిన విషయం తెలిసిందే. అయితే, కాంస్య పతకం కోసం మరో మ్యాచ్‌ గ్రేట్‌ బ్రిటన్‌తో తలపడనున్నది.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: prajasakti
Top