Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఆధునిక వైద్య పరిశోధనల కేంద్రంగా హైదరాబాద్

ఆధునిక వైద్య పరిశోధనల కేంద్రంగా హైదరాబాద్

సంగారెడ్డి, ప్రజాతంత్ర, జూన్ 3 : క్యాన్సర్, ఇతర అరుదైన రోగాలను నయం చేసే బయోలాజిక్స్, వ్యాక్సిన్లు, సెల్ అండ్ జీన్ థెరపీ వంటి అత్యంత అధునాతన వైద్య పరిశోధనలకు ప్రధాన కేంద్రంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు.

పరిశోధన దశ నుంచి కమర్షియల్ ప్రొడక్షన్ దాకా అవసరమైన అన్ని సదుపాయాలను ఒకేచోట కల్పించేలా అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ప్రపంచస్థాయి ఎకో సిస్టమ్‌ను అభివృద్ధి చేసేలా సమగ్ర కాంప్రహెన్సివ్ రోడ్ మ్యాప్‌ను సిద్ధం చేస్తున్నామన్నారు. సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం బోర్పట్లలో రూ.1200 కోట్లతో ఏర్పాటు చేసిన థెరానిమ్ బయోలాజిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని ఆయన బుధవారం లాంఛనంగా ప్రారంభించారు. ఫార్మా రాజధాని హైదరాబాద్‌ను బయో టెక్నాలజీ రంగంలోనూ గ్లోబల్ లీడర్‌గా మార్చేందుకు తీసుకుంటున్న చర్యలను వివరించారు. రాబోయే రోజుల్లో బయోటెక్నాలజీ రంగంలో రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అడ్వాన్స్‌డ్ జెనెటిక్స్ వంటి సాంకేతికతలు విప్లవాత్మక మార్పులు తీసుకొస్తాయన్నారు.

ఫలితంగా వచ్చే అవకాశాలను అందిపుచ్చుకునేలా, తలెత్తే సవాళ్లను అధిగమించేలా దిగ్గజ కంపెనీల పెట్టుబడులను ఆకర్షించేలా వ్యూహాత్మక అడుగులు వేస్తున్నామన్నారు. లైఫ్ సైన్సెస్ పాలసీ, వన్ బయో హబ్, గ్రీన్ ఫార్మా సిటీ, లైఫ్ సైన్సెస్ హబ్ తదితర విప్లవాత్మక అడుగులు లైఫ్ సైన్సెస్ రంగంలో మేడ్ ఇన్ తెలంగాణ బ్రాండ్‌ను మరింత విశ్వవ్యాప్తం చేసేందుకు దోహదపడతాయన్నారు. ఓవైపు లైఫ్ సైన్సెస్ పరిశ్రమలకు అవసరమయ్యే మౌలిక సదుపాయాలు కల్పిస్తూనే మరోవైపు వారికి కావాల్సిన రెడీ టూ వర్క్ ఫోర్స్‌ను తయారు చేసే బృహత్తర బాధ్యతను తీసుకున్నామన్నారు.

ఈ అంశంలో రాష్ట్రంతో కలిసి పనిచేసేందుకు ముందుకు రావాలని దిగ్గజ ఫార్మా కంపెనీలకు పిలుపునిచ్చారు. తెలంగాణను గ్లోబల్ లైఫ్ సైన్సెస్ హబ్‌గా మార్చే ప్రయాణంలో థెరానిమ్ బయోలాజిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ మరొక కీలక మైలురాయి అని శ్రీధర్‌బాబు అన్నారు. క్యాన్సర్, ఇతర ప్రాణాంతక వ్యాధుల చికిత్సకు సంబంధించిన ఔషధాలను ఇక్కడ ఉత్పత్తి చేసి యూఎస్ సహా పలు దేశాలకు ఎగుమతి చేయనున్నట్టు వివరించారు. ఈ ప్లాంట్ ద్వారా 1500 మందికిపైగా ఉపాధి లభిస్తుందన్నారు. కార్యక్రమంలో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ, టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి, కంపెనీ ప్రతినిధులు కె.నిత్యానంద రెడ్డి, డాక్టర్ మదన్‌మోహన్ రెడ్డి, డాక్టర్ శాతకర్ణి ఎమ్, డాక్టర్ ఐ.ఎస్.ఆర్.రావు, సనత్ ఛట్టోపాధ్యాయ, డేవ్ మరాల్డో తదితరులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prajatantra News