"ఇప్పటికిప్పుడు శాసనసభలో చర్చించవలసిన, పరిష్కారాలు ఆలోచించి అమలు చేయవలసిన తక్షణ సమస్యలు ఎన్నో ఉన్నాయి. వాటిలో 22ఏ నిషేధిత భూములు, ఫీ రీయింబర్స్ మెంట్ బకాయిలు, పాలిటెక్నిక్ విద్యార్థుల ఆందోళన, కరువు, వ్యవసాయ సమస్యలు, నిరుద్యోగ సమస్య, పెన్షనర్ల సమస్య, ఆర్టీసీ విలీనం, శాంతి భద్రతలు ప్రధానమైనవి.."
శాసనసభ సమావేశాలు జరగబోతున్నాయంటే అప్పటికి ప్రధానమైన విషయాలు చర్చకు వస్తాయని, ప్రతిపక్షాలు ప్రజల సమస్యల మీద ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తాయని, ప్రభుత్వం సమాధానం చెపుతుందని అనుకుంటాం. తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాలు సెప్టెంబర్ 7 సోమవారం మొదలయ్యాయి. వారం రోజుల పాటు జరుగుతాయనుకుంటున్న సమావేశాలు మొదటి మూడు రోజులూ అసలు సభే జరగకుండా ఆందోళనలతో, పోలీసు నిర్బంధకాండతో సరిపోయింది. మూడో రోజు, బుధవారం నాడు ప్రతిపక్ష భారత రాష్ట్ర సమితికి చెందిన 22 మంది శాసన సభ్యులను సమావేశాలు ముగిసే వరకూ సభ నుంచి సస్పండ్ చేశారు. అంటే మిగిలిన రోజుల్లో కూడా ప్రతిపక్షాలు ప్రజా సమస్యలు లేవనెత్తే అవకాశాలు రద్దయిపోయాయి. అధికారపక్ష సభ్యులు ఎట్లాగూ ప్రజా సమస్యలను ప్రస్తావించరు. ప్రస్తావించినా, తాము అంతా అద్భుతంగా చేశామని, ప్రజలకు సమస్యలే లేవని ప్రగల్భాలు పలుకుతారు గనుక అసలు సమస్యలు గాలికి పోయినట్టే.
నిజానికి ఇవాళ తెలంగాణ అనేక సమస్యలతో కునారిల్లుతున్నది. వెయ్యి రోజుల పాలన ముగించుకున్న అధికార కాంగ్రెస్ 2023 ఎన్నికల వాగ్దానాలను ఇప్పటికీ నెరవేర్చలేదు సరిగదా, ఈ వెయ్యి రోజుల్లో అనేక కొత్త సమస్యలు తెచ్చిపెట్టింది. వంద రోజుల్లో నెరవేరుస్తామన్న ఆరు గ్యారంటీలలో ఏ ఒక్కటీ సంపూర్ణంగా అమలులోకి రాలేదు. ముఖ్యమంత్రి వ్యక్తిగతంగా హామీ పడిన ఏడో గ్యారంటీ ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఎంతమాత్రమూ అమలులోకి రాలేదని గడిచిన కాలం అలా ఉంచినా, ఈ మూడు రోజుల అనుభవాలే చూపుతున్నాయి. ఇప్పటికిప్పుడు శాసనసభలో చర్చించవలసిన, పరిష్కారాలు ఆలోచించి అమలు చేయవలసిన తక్షణ సమస్యలు ఎన్నో ఉన్నాయి. వాటిలో 22ఏ నిషేధిత భూములు, ఫీ రీయింబర్స్ మెంట్ బకాయిలు, పాలిటెక్నిక్ విద్యార్థుల ఆందోళన, కరువు, వ్యవసాయ సమస్యలు, నిరుద్యోగ సమస్య, పెన్షనర్ల సమస్య, ఆర్టీసీ విలీనం, శాంతి భద్రతలు ప్రధానమైనవి.
పద్ధతి లేకుండా, తగిన చట్టబద్ధ ప్రక్రియ పాటించి నోటీసులు ఇవ్వకుండా ప్రైవేటు భూములను 22ఏ కింద నిషేధిత భూములుగా ప్రకటించారని, హైదరాబాద్ చుట్టుపక్కల వేలాది మంది భూయజమానులు ఆందోళన ప్రకటిస్తున్నారు. ఆ ఆందోళన పతాకస్థాయికి చేరినప్పుడు ఏవో కంటితుడుపు వాగ్దానాలు చేసి, చల్లార్చడానికి ప్రయత్నించారు తప్ప మూలాలలోకి వెళ్లి సమస్య పరిష్కరించే ప్రయత్నం గాని, ఉద్దేశం గాని కనబడడం లేదు. వేల కోట్ల రూపాయల ఫీ రియింబర్స్ మెంట్ బకాయిలు పేరుకుపోతున్నా, ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు విద్యార్థులను, తల్లిదండ్రులను ఇబ్బంది పెడుతున్నా ఆ సమస్య పరిష్కరించడానికి ప్రభుత్వం వైపు నుంచి కనీస ఉపశమన చర్యలు కూడా ప్ర్రారంభం కాలేదు.
"ఒక సమస్య వస్తే, చర్చలతో, శాంతియుతంగా, సమన్వయ దృష్టితో పరిష్కారం ఆలోచించాలని కాకుండా, పోలీసు బలం ఉపయోగించి, లాఠీలతో, తూటాలతో, దౌర్జన్యంతో ప్రశ్నలను అణచివేయాలని ఈ దేశంలో అన్ని ప్రభుత్వాలూ వలసవాదుల నుంచి నేర్చుకున్న విద్యను కళగా అభివృద్ధి చేశాయి. అటువంటి పోలీసు నిర్బంధాలను తెలంగాణ ఎన్నో దశాబ్దాలుగా అనుభవించింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి, తెల్లకాగితం వంటి పాలనాధికారం చేజిక్కినప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి గత అనుభవాలతో పోలీసు రాజ్యం వైపు కాకుండా, సంభాషణ, సమన్వయ పాలన దిశగా నడుపుతుందని, పోలీసు పాత్రను కత్తిరిస్తుందని ప్రజలు ఆశించారు. కాని ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ను మించిన పోలీసు రాజ్యాన్ని తెరాస ప్రభుత్వం నడిపింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకొక రెండాకులు ఎక్కువ చదివినట్టుగా నిరసన దుస్తులు, వాటి మీద నినాదాలు అభ్యంతరకరమంటూ బిఆర్ఎస్ శాసనసభ్యులను గేటు ముందే ఆపడానికి పోలీసులను నియోగించింది. పోలీసులు వారికి తెలిసిన ఏకైక విద్య రౌర్జన్యం ప్రయోగించారు.."
పాలిటెక్నిక్ లను యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలో భాగం చేస్తున్నామనే పేరుతో, వారి ఇంజనీరింగ్ ప్రవేశాలను డోలాయమాన స్థితిలో పడవేసినప్పుడు పాలిటెక్నిక్ విద్యార్థి లోకమంతా పెద్ద ఎత్తున ఆందోళనకు దిగింది. అప్పటికి ఏవో కంటితుడుపు వాగ్దానాలు చేశారు గాని శాశ్వతంగా పరిష్కారం లేదు.
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు జీవగర్ర అయిన వ్యవసాయ రంగం ఈ సంవత్సరం అత్యంత కష్టభరితంగా ఉండబోతున్నది. గడిచిన మూడు నెలల వర్షాకాలంలో వర్షపాతం సాధారణ సగటు కన్నా తక్కువ నమోదయింది. కృష్ణా, గోదావరి, ఇతర చిన్న నదులు వేటిలోనూ తగినంత నీరు రాలేదు. భూగర్భ జలాల పునరుద్ధరణ జరగకపోవడం వల్ల మళ్లీ వర్షాకాలం వరకూ రాష్ట్రం తీవ్రమైన నీటి ఎద్దడిని ఎదుర్కోక తప్పదు. పాత నీటి పారుదల పథకాల అవినీతి, అపసవ్యతలు ఒక సమస్య కాగా, కొత్త నీటి పారుదల పథకాలను ఆడంబరంగా ప్రకటిస్తున్నప్పటికీ సాగునీటి, తాగునీటి సమస్యలు పెరగనున్నాయి.
కాంగ్రెస్ ఎన్నికల వాగ్దానాలలో భాగమైన నిరుద్యోగ సమస్య పరిష్కారం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే లాగుంది. ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్న, జాబ్ కాలెండర్ విడుదల చేస్తామన్న వాగ్దానాలు నీటి మీద రాతలే అయ్యాయి. మరొకవైపు ఉద్యోగుల సమస్యలు పేరుకుపోతున్నాయి. ఉద్యోగ విరమణ చేస్తున్నవారికి విరమణ సమయంలో చెల్లించవలసిన డబ్బు నెలలు, ఏళ్లు గడిచినా చెల్లించడం లేదు. అతి చిన్న పద్దుల నుంచి పెద్ద పద్దుల దాకా ప్రభుత్వం చెల్లించవలసిన బాకీలు ఇబ్బడి ముబ్బడిగా పేరుకుపోతున్నాయి. పాలనా నిర్ణయాలలో కీలక నిర్ణయంగా ప్రకటించిన ఆర్టీసీ - ప్రభుత్వ విలీనం ఇంకా పూర్తి కాలేదు. ఏ సామాజిక, రాజకీయ, ఆర్థిక సమస్యకైనా, ప్రజల నుంచి వచ్చే ఏ చిన్న ఆకాంక్షకైనా పోలీసులతోనే జవాబు చెప్పిస్తున్నారు గాని రాజకీయ సంభాషణ కరువైపోయింది. రాష్ట్రం పోలీసు రాజ్యంగా, ప్రజాస్వామ్యం, రాజ్యాంగం అమలు కాని రాష్ట్రం గానే ఉంది.
తన వెయ్యి రోజుల పాలన మైలురాయి సెప్టెంబర్ 2 గనుక, సెప్టెంబర్ 7 నుంచి మొదలయ్యే శాసనసభ సమావేశాల్లో గొప్పలు చెప్పుకోవడానికీ అధికారపక్షానికి ఒక అవకాశం ఈ సమావేశాలు. ప్రతిపక్ష బిఆర్ఎస్, బిజెపి లకు కూడా వెయ్యి రోజుల పాలన వైఫల్యాల గురించి నిలదీయడానికి అవకాశం అది. అంటే శాసనసభ వర్షాకాల సమావేశం ఏడురోజులైనా, అంతకంటే ఎక్కువైనా వాస్తవంగా జరపదలచుకుంటే చేతి నిండా పని ఉంది. నోటి నిండా మాట్లాడవలసి ఉంది. నాలుగు మెదళ్ల కలయికతో పరిష్కారాలు ఆలోచించవలసి ఉంది. పది చేతుల పనులు చేసి ప్రజల సమస్యల పరిష్కారం కాకపోయినా, ఉపశమనమైనా కల్పించవలసి ఉంది. కాని అధికారపక్షానికి ఈ చర్చ ఇష్టం లేదు. ప్రజల సమస్యలు బహిరంగం కావడం ఇష్టం లేదు. తమ వైఫల్యాలు బైటపడడం ఇష్టం లేదు. తమ గొప్పలు చెప్పుకోవడానికి ఎట్లాగూ తమ చేతుల్లో మీడియా ఉంది, లేదా బిల్లులు చెల్లించినా చెల్లించకపోయినా ప్రకటనలు గుప్పించడానికి అవకాశం ఉంది. అందువల్ల ఏదో ఒక సాకుతో సమావేశాలు జరగకుండా చేస్తే విమర్శల దాడి నుంచి తప్పించుకోవచ్చునని కాంగ్రెస్ ఆశించింది.
అందుకే శాసనసభ సమావేశానికి కొద్ది ముందుగా కాంగ్రెస్, స్వయంగా ముఖ్యమంత్రితో సహా, ప్రధాన ప్రతిపక్షాన్ని రెచ్చగొట్టే చర్యలు ఎత్తుకున్నారు. ప్రతిపక్ష నాయకుడు కె చంద్రశేఖర రావు వెయ్యి రోజులుగా శాసనసభకు రాలేదనేది ఒక అంశమే కావచ్చు గాని దాని మీదనే అధికార పక్షం ఒక మహా ధర్నా జరపవలసినంత ముఖ్యమైన విషయం కాదు. ఆయన సభకు రాకుండా ఉంటున్నారనే అంశం ప్రజల దృష్టికి తేవడం వరకూ ఫర్వాలేదు గాని, అది ఒక ప్రధాన ఎజెండాగా, సరిగ్గా శాసనసభ సమావేశాల ముందురోజు కాంగ్రెస్ మహా ధర్నా నిర్వహించింది. ఆ ధర్నాలో కెసిఆర్ మీద కాంగ్రెస్ నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో మరొక సభలో మాట్లాడుతూ స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అటువంటి వ్యాఖ్యలే చేశారు.
ఇంతకుముందే దిగజార్చిన రాజకీయ భాషను మరింత దిగజార్చారు. ఈ వ్యాఖ్యలకు బిఆర్ఎస్ స్పందిస్తుందనీ, శాసనసభ సమావేశాల్లో రభస జరుగుతుందనీ, తద్వారా వెయ్యి రోజుల వైఫల్యం విమర్శలకు జవాబు చెప్పకుండా తప్పించుకోవచ్చుననీ కాంగ్రెస్ వ్యూహ రచన చేసినట్టుంది. ఒక రకంగా బిఆర్ఎస్ ఆ ఉచ్చులో పడింది. లేదా ఒక అనివార్య ఘర్షణ స్థితికి నెట్టబడింది. తమ నాయకుడికి జరిగిన అవమానానికి స్పందించకుండా, మౌనంగా సభలోకి వెళ్లి వెయ్యి రోజుల వైఫల్యం గురించి, ఇతర ప్రజా సమస్యల గురించీ ప్రశాంతంగా మాట్లాడితే అది నాయకుడి పట్ల నిర్లక్ష్యం అవుతుంది. నాయకుడికి జరిగిన అవమానాన్నే ప్రధానాంశం చేస్తే ప్రజాసమస్యలకు తక్కువ స్థానం ఇవ్వవలసి వస్తుంది. ఈ నుయ్యి-గొయ్యి సమస్య మాత్రమే కాక, వెయ్యి రోజుల వైఫల్యం, ఆరు గ్యారంటీల వైఫల్యం, ఫీ రియింబర్స్ మెంట్, నిరుద్యోగం వంటి ఏ సమస్య మీద మాట్లాడబోయినా, 'మీ పది సంవత్సరాల కాలంలో ఏం చేశారు' అనే ప్రశ్న వెంటాడుతుందనే భయం కూడా ఉంది.
"సోమవారం జరిగిన దౌర్జన్యానికి వ్యతిరేకంగా మంగళవారం ప్రదర్శనలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు మాత్రమే కాదు, శాసనసభ నుంచి వంద మైళ్ల అవతల ప్రతిపక్ష నాయకుడి ఇంటి ముందు చావు డప్పులు మోగించాలని అనుకోవడం మరింత హీనమైన చర్య. ఆ హీనమైన చర్య జరపడానికి వెళ్లేవారిని వెళ్లనిచ్చి, దాన్ని ఆపడానికో, తమ నాయకుడికి అండగా నిలబడడానికో వెళ్తున్నవాళ్లను మాత్రం ఆపడానికి పోలీసులను వాడడం మరింత హీనమైన చర్య. చివరికి బుధవారం ప్రధాన ప్రతిపక్ష సభ్యులందరినీ సమావేశాలు ముగిసేవరకూ సస్పెండ్ చేయడం అప్రజాస్వామికం.."
ఇటువంటి స్థితిలో బిఆర్ఎస్ శాసనసభ్యులు నల్ల చొక్కాలు ధరించి, వాటి మీద 'హామీల అమలులో కాంగ్రెస్ వైఫల్యం', 'వెయ్యిరోజుల విఫల ప్రభుత్వం' అనే నినాదాలతో సభలోకి వెళ్లాలని ప్రయత్నించారు. ఒక సమస్య వస్తే, చర్చలతో, శాంతియుతంగా, సమన్వయ దృష్టితో పరిష్కారం ఆలోచించాలని కాకుండా, పోలీసు బలం ఉపయోగించి, లాఠీలతో, తూటాలతో, దౌర్జన్యంతో ప్రశ్నలను అణచివేయాలని ఈ దేశంలో అన్ని ప్రభుత్వాలూ వలసవాదుల నుంచి నేర్చుకున్న విద్యను కళగా అభివృద్ధి చేశాయి. అటువంటి పోలీసు నిర్బంధాలను తెలంగాణ ఎన్నో దశాబ్దాలుగా అనుభవించింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి, తెల్లకాగితం వంటి పాలనాధికారం చేజిక్కినప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి గత అనుభవాలతో పోలీసు రాజ్యం వైపు కాకుండా, సంభాషణ, సమన్వయ పాలన దిశగా నడుపుతుందని, పోలీసు పాత్రను కత్తిరిస్తుందని ప్రజలు ఆశించారు. కాని ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ను మించిన పోలీసు రాజ్యాన్ని తెరాస ప్రభుత్వం నడిపింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకొక రెండాకులు ఎక్కువ చదివినట్టుగా నిరసన దుస్తులు, వాటి మీద నినాదాలు అభ్యంతరకరమంటూ బిఆర్ఎస్ శాసనసభ్యులను గేటు ముందే ఆపడానికి పోలీసులను నియోగించింది. పోలీసులు వారికి తెలిసిన ఏకైక విద్య రౌర్జన్యం ప్రయోగించారు. తోపులాటలో అటూ ఇటూ మాటలు చెలరేగాయి. ఒక బిఆర్ఎస్ శాసనసభ్యుడు తమను ఆపిన, ఆపించిన వ్యక్తిని దూషించారు. ఆ దూషణ మన సంస్కృతిలో సాధారణమైపోయిన తల్లి మీద, స్త్రీ మీద తిట్టుగా ఉంది.
అలా తల్లి మీద తిట్లు, స్త్రీల మీద తిట్లు, స్త్రీల మీదికి వచ్చే ఏ తిట్టునైనా ఉపయోగించకపోవడం అనే సంస్కారం మన రాజకీయ నాయకుల్లో ఎవరికీ లేదు. ఇప్పుడేదో ఆ తప్పుకు ఒకరిని శిక్షించాలని కత్తులు నూరుతున్నవారు కూడా బహిరంగంగానూ, ఆంతరంగికంగానూ ఎన్ని వందల సార్లు ఆ మాటలు ఉపయోగించి ఉంటారో వారి అంతరంగాలకు తెలుసు. ఇది మనలోని పితృస్వామిక, మనువాద భావజాలం ప్రభావం అని గుర్తించి దాని మీద పోరాడవలసే ఉంది. ఆ పోరాటం, చైతన్యం, శిక్షణ మన రాజకీయ రంగానికి చేరడానికి ఎంతకాలం పడుతుందో!
సోమవారం జరిగిన దౌర్జన్యానికి వ్యతిరేకంగా మంగళవారం ప్రదర్శనలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు మాత్రమే కాదు, శాసనసభ నుంచి వంద మైళ్ల అవతల ప్రతిపక్ష నాయకుడి ఇంటి ముందు చావు డప్పులు మోగించాలని అనుకోవడం మరింత హీనమైన చర్య. ఆ హీనమైన చర్య జరపడానికి వెళ్లేవారిని వెళ్లనిచ్చి, దాన్ని ఆపడానికో, తమ నాయకుడికి అండగా నిలబడడానికో వెళ్తున్నవాళ్లను మాత్రం ఆపడానికి పోలీసులను వాడడం మరింత హీనమైన చర్య. చివరికి బుధవారం ప్రధాన ప్రతిపక్ష సభ్యులందరినీ సమావేశాలు ముగిసేవరకూ సస్పెండ్ చేయడం అప్రజాస్వామికం. ఇలా దౌర్జన్యం, తిట్లు, ఆరోపణలు, ప్రత్యారోపణలు, సస్పెన్షన్లు, చావు డప్పులు - ఇవీ మన ప్రజాస్వామ్యం! మొత్తం మీద వేలాది కోట్ల రూపాయల ప్రజాధనం వెచ్చించి జరిగే సభలో ప్రజలు లేరు, ప్రజా సమస్యలు లేవు, సమస్యల చర్చ లేదు. రచ్చ తప్ప మరేమీ లేదు. పోలీసులకు మరింత దౌర్జన్య అధికారం, ప్రభుత్వానికి ప్రజా సమస్యల పరిష్కారం నుంచీ, చర్చ నుంచీ తప్పించుకునే అవకాశం. ఇదీ మన మహా ఘనత వహించిన పార్లమెంటరీ ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం!

