Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బడుగు 'బతుకుబండి'ని బుగ్గి చేస్తున్న ఇ20 పెట్రోల్!

బడుగు 'బతుకుబండి'ని బుగ్గి చేస్తున్న ఇ20 పెట్రోల్!

"ఇథనాల్‌ను పర్యావరణ అనుకూల ఇంధనంగా ప్రచారం చేయడం ఒక అతిపెద్ద పర్యావరణ మోసం అని పర్యావరణ శాస్త్రవేత్తలు వాదిస్తున్నారు. భారతదేశంలో ఒక లీటరు ఇథనాల్ ఉత్పత్తికి వేలాది లీటర్ల నీరు అవసరమవుతున్నది.

ప్రత్యేకంగా మిగులు బియ్యం నుంచి ఇథనాల్ తయారుచేసే విధానం వల్ల దేశ ఆహార భద్రత ప్రమాదంలో పడడమే కాకుండా భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటుతున్నాయి.."

భారతదేశంలో ఇ20 (20 శాతం ఇథనాల్ కలిపిన పెట్రోల్) ఇంధనాన్ని దేశవ్యాప్తంగా తప్పనిసరి చేయాలనే ప్రభుత్వ నిర్ణయం తీవ్ర చర్చకు దారితీసింది. విదేశీ ముడి చమురు దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గించడం, దేశీయ ఇంధన భద్రతను బలోపేతం చేయడం, కార్బన్ ఉద్గారాలను తగ్గించడం వంటి ఉన్నతమైన లక్ష్యాలతో ఈ విధానాన్ని ప్రభుత్వం ముందుకు తెచ్చింది. అయితే వాస్తవ గడువు కంటే ముందే ఈ నిర్ణయాన్ని వేగవంతం చేయడం, వినియోగదారులపై దీని ప్రభావాన్ని తగినంతగా విశ్లేషించకపోవడం పట్ల దేశవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. పర్యావరణ అనుకూల ఇంధన విధానం వెనుక కార్పొరేట్ ప్రయోజనాలు, రాజకీయ అనుబంధాలు, దేశీయ ఆటోమొబైల్ రంగానికి లబ్ధి చేకూర్చే రహస్య వ్యూహాలు దాగి ఉన్నాయనే విమర్శలు తీవ్రమవుతున్నాయి. భారతదేశం తన ముడి చమురు అవసరాలలో సుమారు 88 నుంచి 89 శాతం విదేశీ దిగుమతుల పైనే ఆధారపడుతున్నది. ఈ నేపథ్యంలో దేశీయంగా ఉత్పత్తి చేసే ఇథనాల్‌ను పెట్రోల్‌లో కలపడం ద్వారా భారీగా విదేశీ మారకద్రవ్యాన్ని ఆదా చేయవచ్చని ప్రభుత్వం వాదిస్తున్నది. 2018 నాటి 'జాతీయ జీవ ఇంధన విధానం', 2021 నాటి 'నీతి ఆయోగ్ రోడ్‌మ్యాప్' మొదట్లో 2030 నాటికి 20 శాతం ఇథనాల్ బ్లెండింగ్ సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. కానీ ప్రభుత్వం ఈ గడువును ఐదేండ్ల ముందే, అంటే 2025 నాటికే పూర్తిస్థాయిలో అమలుచేస్తూ వేగవంతం చేసింది.

అధికారిక గణాంకాల ప్రకారం, ఈ కార్యక్రమం ద్వారా 2014 నుంచి 2026 మధ్య కాలంలో రూ.1.9 లక్షల కోట్లకు పైగా దిగుమతి ఖర్చులు ఆదా అయ్యాయి. 930 మెట్రిక్ టన్నుల కార్బన్ ఉద్గారాలు తగ్గాయి. రైతులకు ఇథనాల్ సరఫరా ద్వారా ఏడాదికి సుమారు రూ.40,000 కోట్ల నుంచి రూ.43,000 కోట్ల చెల్లింపులు అందుతాయని, దీనివల్ల వారు "ఊర్జాదాతలు"గా మారుతారని ప్రభుత్వం ఉద్ఘాటిస్తున్నది. కానీ, ఈ అసాధారణ వేగంతో కూడిన మార్పు వల్ల పాత వాహనాలు కలిగి ఉన్న సామాన్య వినియోగదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. భౌగోళిక రాజకీయ ఒత్తిళ్లు కూడా ఈ వేగవంతమైన నిర్ణయం వెనుక కీలక పాత్ర పోషించాయి. ముఖ్యంగా పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు, ఇరాన్‌పై జరిగిన దాడుల వల్ల ప్రపంచ చమురు సరఫరా వ్యవస్థకు తీవ్ర అంతరాయం కలిగి, ముడి చమురు ధరలు పెరగడం దేశీయ ఇంధన లభ్యతను వేగవంతం చేయాలని ప్రభుత్వాన్ని పురికొల్పింది.

పాత వాహనాల మనుగడకు ముప్పు

ప్రస్తుతం భారతీయ రోడ్లపై ఉన్న వాహనాలలో మెజారిటీ వాహనాలు ఇ20 ఇంధనానికి అనుకూలమైనవి కావు. పరిశ్రమల విశ్లేషణల ప్రకారం గత 15 సంవత్సరాలలో విక్రయించబడిన పెట్రోల్ వాహనాలలో కేవలం 20 శాతం మాత్రమే ఇ20 ఇంధనంతో నడవడానికి అనుకూలంగా ఉన్నాయి. మిగిలిన 80 శాతం వాహనాలు అంటే సుమారు 23 కోట్ల పాత వాహనాలు కేవలం ఇ5, ఇ10 ఇంధనానికి మాత్రమే పరిమితమైన సాంకేతికతను కలిగి ఉన్నాయి. ఏప్రిల్ 2025 నుంచి దేశవ్యాప్తంగా ఇ20 ఇంధనం అందుబాటులోకి వచ్చిన తర్వాత, వినియోగదారులకు వేరే ప్రత్యామ్నాయం లేకుండా పోయింది. ఆటోమొబైల్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఏఆర్ఏఐ) నిర్వహించిన, ఇంతవరకు అధికారికంగా బహిర్గతం చేయని ఒక అధ్యయనంలో కీలకమైన సాంకేతిక లోపాలు వెలుగులోకి వచ్చాయి. ఇ10 వాహనాలలో ఇ20 ఇంధనాన్ని నిరంతరాయంగా వాడడం వల్ల ఇంజిన్ ఇంధన వ్యవస్థలోని రబ్బరు హోస్‌లు, సీల్స్, గ్యాస్కెట్లు, ఓ-రింగులు తీవ్రంగా క్షీణిస్తాయని, తద్వారా లీకేజీలు సంభవిస్తాయని ఈ అధ్యయనం ధృవీకరించింది.

అంతేకాక, టర్బోచార్జ్డ్ ఇంజిన్లలో కార్బన్ పేరుకుపోవడం, కొన్ని రకాల ఇంజిన్లలో ఎగ్జాస్ట్ వాల్వ్ వైఫల్యాలు (థర్మోమెకానికల్ ఫెయిల్యూర్) సంభవించినట్టు కూడా నివేదించింది. ఇథనాల్ తక్కువ కెలోరిఫిక్ విలువ వల్ల వాహనాల మైలేజ్ 2 నుంచి 6 శాతం తగ్గుతుందని పరిశ్రమ వర్గాలు ఒప్పుకుంటున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో వినియోగదారులు 10 శాతం కంటే ఎక్కువ మైలేజ్ నష్టాన్ని, ఇంజిన్ల పనితీరు మందగించడాన్ని గమనిస్తున్నారు. 2026 నాటి లోకల్‌సర్కిల్స్ సర్వే ప్రకారం పాత వాహనదారులలో 55 శాతం మంది తమ వాహనాల్లో సాంకేతిక సమస్యలు, నిర్వహణ ఖర్చులు పెరిగాయని పేర్కొన్నారు. ఆటోమొబైల్ సంస్థల యజమాని నిబంధనలు, ప్రస్తుత ప్రభుత్వ ప్రకటనల మధ్య వ్యత్యాసాన్ని విశ్లేషిస్తూ రాజకీయ నేతలు కంపెనీలకు లేఖలు రాయడం గమనార్హం. పాత వాహనాలలో ఇ10 కంటే ఎక్కువ ఇథనాల్ వాడకూడదని వాటి మాన్యువల్స్‌లో స్పష్టంగా పేర్కొని ఉండగా, ప్రభుత్వ ఒత్తిడి మేరకు ఇప్పుడు వాహన తయారీ సంస్థలు ఇ20 సురక్షితమైనదని అబద్ధపు హామీలు ఇస్తున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి.

స్క్రాపేజ్ పాలసీతో ఆటోమొబైల్ సంస్థల కుట్ర

ఇ20 ఇంధన బలవంతపు అమలు, ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన వాహనాల స్క్రాపేజ్ పాలసీ (వాహనాల రద్దు విధానం) మధ్య స్పష్టమైన సంబంధం కనిపిస్తున్నదని విమర్శకులు వాదిస్తున్నారు. పాత వాహనాలు (ముఖ్యంగా ఏప్రిల్ 2023 కంటే ముందు తయారైనవి) ఇ20 ఇంధనానికి అనుకూలం కాకపోవడం వల్ల వాటి ఇంజిన్ భాగాలు త్వరగా పాడవుతాయి. క్రమంగా నిర్వహణ ఖర్చులు భరించలేక వాహనదారులు తమ వాహనాలను కాలపరిమితి ముగియక ముందే స్క్రాపింగ్ సెంటర్లకు పంపవలసి వస్తుంది. స్క్రాపేజ్ విధానం వల్ల పాత వాహనాలను రద్దు చేసి కొత్త వాహనాలను కొనుగోలు చేసేలా వినియోగదారులను ప్రోత్సహించవచ్చు. దీనివల్ల దేశీయ ఆటోమొబైల్ రంగానికి భారీ డిమాండ్ ఏర్పడుతుంది. కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి స్వయంగా సియామ్ వార్షిక సదస్సులో మాట్లాడుతూ, ఆటోమొబైల్ రంగానికి చెందిన కంపెనీలు గనుక స్క్రాపింగ్ కేంద్రాలలో పెట్టుబడులు పెడితే, దేశీయ వాహనాల అమ్మకాలు 18 నుంచి 20 శాతం వరకు వృద్ధి చెందుతాయని స్పష్టం చేశారు. ప్రారంభంలో ఇ10 ఇంధనాన్ని పాత వాహనాల కోసం "ప్రొటెక్షన్ గ్రేడ్"గా కొనసాగించాలని డిమాండ్ చేసిన సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ (సియామ్), ఆ తర్వాత ప్రభుత్వ ప్రతిపాదనలను పూర్తిగా సమర్ధించింది. కొత్త వాహనాల అమ్మకాలను పెంచుకునేందుకే ఆటోమొబైల్ కంపెనీలు ఇ20 ప్రభావాన్ని తక్కువ చేసి చూపిస్తున్నాయనే ఆరోపణలకు ఇది బలమైన సాక్ష్యంగా నిలుస్తున్నది.

ఇథనాల్ కంపెనీలలో క్రోనీ క్యాపిటలిజం

ఈ ఇథనాల్ విప్లవం వెనుక ఉన్న ఆర్థిక ప్రయోజనాలు కొద్దిమంది రాజకీయ నేతలు, వారి సన్నిహిత కార్పొరేట్ శక్తుల చేతుల్లోనే కేంద్రీకృతమై ఉన్నాయి. కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కుమారులు నిర్వహించే 'సియాన్ ఆగ్రో' (నిఖిల్ గడ్కరీ), 'మానస్ ఆగ్రో' (సారంగ్ గడ్కరీ) కంపెనీలు ఈ ఇ20 పాలసీ వల్ల భారీ ఆర్థిక లబ్ధి పొందాయన్నది కాంగ్రెస్ పార్టీ, ఇతర విమర్శకుల ప్రధాన ఆరోపణ. సియాన్ ఆగ్రో ఆదాయం కేవలం ఒకే సంవత్సరంలో రూ.18 కోట్ల నుంచి రూ.523 కోట్లకు పెరగడం, దాని స్టాక్ ధర 2,184 శాతం పెరగడం తీవ్ర అనుమానాలకు దారితీసింది. కేవలం గడ్కరీ కుటుంబమే కాకుండా, బలరాంపూర్ చినీ మిల్స్, త్రివేణి ఇంజినీరింగ్, విల్మార్ సంస్థ మద్దతు ఉన్న శ్రీ రేణుక షుగర్స్, ప్రాజ్ ఇండస్ట్రీస్ వంటి పెద్ద చక్కెర, బయోటెక్నాలజీ సంస్థలు ఈ బలవంతపు ఇథనాల్ విధానం ద్వారా భారీగా లాభపడుతున్నాయి. సియాన్ ఆగ్రో కంపెనీ వ్యవసాయ ప్రాసెసింగ్, ఇథనాల్ సరఫరా చేస్తున్నది. జూన్ 2024 లో రూ.18 కోట్ల నుంచి జూన్ 2025 నాటికి రూ.523 కోట్లకు ఆదాయ వృద్ధి చెందింది. స్టాక్ విలువలో 2,184 శాతం అసాధారణంగా పెరిగింది. త్రివేణి ఇంజినీరింగ్ కంపెనీ చక్కెర, ఇథనాల్ ఉత్పత్తి చేస్తున్నది. ఈ కంపెనీ అత్యంత సమర్థవంతమైన ఇథనాల్ తయారీదారుగా ఎదిగి, 67.23 శాతం అసాధారణ ఆర్ వీఈని నమోదు చేసింది. బలరాంపూర్ చినీ మిల్స్ కంపెనీ చక్కెర, బయో-ప్లాస్టిక్స్ ను ఉత్పత్తి చేస్తున్నది. ఇది విస్తృతమైన డిస్టిలరీ సామర్థ్యంతో ప్రభుత్వ ఇథనాల్ బ్లెండింగ్ కార్యక్రమానికి ప్రధాన సరఫరాదారుగా ఎదిగింది. ప్రాజ్ ఇండస్ట్రీస్ బయోఫ్యూయల్ టెక్నాలజీ, ఇంజినీరింగ్ ఉత్పత్తులు చేస్తూ, దేశవ్యాప్తంగా ఇథనాల్ ఉత్పత్తి ప్లాంట్లను స్థాపించడానికి అవసరమైన సాంకేతికతను అందించే ఏకఛత్రాధిపత్య సంస్థగా ఉన్నది.

పెట్రోల్ బంకుల్లో వినియోగదారుల దోపిడీ

ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు అన్ని సాధారణ పెట్రోల్ బంకుల్లో కేవలం ఇ20 ఇంధనం మాత్రమే విక్రయించబడుతున్నది. వినియోగదారులకు ఇ0, ఇ10 ఎంచుకునే సదుపాయం లేకుండా పోయింది. ఎంపిక చేసిన కొన్ని ప్రాంతాలలో మాత్రమే ఇథనాల్ లేని స్వచ్ఛమైన పెట్రోల్ అందుబాటులో ఉన్నది. కానీ అది 'ఎక్స్ పీ100' గ్రేడ్ కింద లీటరుకు దాదాపు రూ.167 కు అమ్ముడవుతున్నది. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) విడుదల చేసిన సామాజిక ప్రచారంలో "బీజేపీ పెట్రోల్ బంక్" రశీదు ద్వారా పన్ను చెల్లింపుదారులు పూర్తి ధర చెల్లిస్తూనే తక్కువ మైలేజీ, అధిక నిర్వహణ ఖర్చులతో మోసపోతున్నారని ఎద్దేవా చేసింది. దీనికి అదనంగా, వినియోగదారులకు ఏ విధమైన ధర తగ్గింపు కూడా లభించడం లేదు.

పర్యావరణ వినాశనం : గ్రీన్ ఇంధనం వెనుక నీటి దోపిడీ

ఇథనాల్‌ను పర్యావరణ అనుకూల ఇంధనంగా ప్రచారం చేయడం ఒక అతిపెద్ద పర్యావరణ మోసం అని పర్యావరణ శాస్త్రవేత్తలు వాదిస్తున్నారు. భారతదేశంలో ఒక లీటరు ఇథనాల్ ఉత్పత్తికి వేలాది లీటర్ల నీరు అవసరమవుతున్నది. ప్రత్యేకంగా మిగులు బియ్యం నుంచి ఇథనాల్ తయారుచేసే విధానం వల్ల దేశ ఆహార భద్రత ప్రమాదంలో పడడమే కాకుండా భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటుతున్నాయి. ప్రముఖ వ్యవసాయ ఆర్థికవేత్త అశోక్ గులాటి వంటి నిపుణులు పర్యావరణ సమతుల్యత, ఇథనాల్ విధానంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. నీటి లభ్యత తక్కువగా ఉన్న ప్రాంతాలలో ఇటువంటి పంటలను ప్రోత్సహించడం వల్ల తీవ్రమైన పర్యావరణ దుష్పరిణామాలు సంభవిస్తాయని ఆయన హెచ్చరిస్తున్నారు. ఒక లీటరు ఇథనాల్ ఉత్పత్తి బియ్యం ద్వారా అయితే 10,790 లీటర్ల నీరు అవసరం అవుతుంది. మక్కల ద్వారా అయితే 4,670 లీటర్ల నీరు అవసరం అవుతుంది. చెరుకు ద్వారా అయితే 3,000 నుంచి 3,630 లీటర్ల నీరు అవసరం అవుతుంది.

అత్యధిక నీటి వినియోగంతో ఆహార భద్రతకు హాని కలిగించే ప్రమాదం ఉన్నది. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్ సీఐ) సబ్సిడీ బియ్యాన్ని ఇథనాల్ ప్లాంట్లకు మళ్లించడం ఆర్థిక భారాన్ని పెంచుతున్నది. బియ్యంతో పోలిస్తే మక్కల ద్వారా ఉత్పత్తి చేసే ఇథనాల్ కు తక్కువ నీరు అవసరమైనప్పటికీ, సాగు విస్తీర్ణం, పర్యావరణ సమతుల్యతపై ప్రభావం చూపుతున్నది. చెరుకు ద్వారా ఉత్పత్తి చేసే ఇథనాల్ తో మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ వంటి తీవ్ర నీటి ఎద్దడి ఉన్న రాష్ట్రాలలో భూగర్భ జలాలు వేగంగా క్షీణించేందుకు దారితీస్తున్నది. సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్, సీఈఈడబ్ల్యూ నివేదికల ప్రకారం సబ్సిడీలు, పన్ను మినహాయింపులను కలుపుకుంటే బియ్యం ఆధారిత ఇథనాల్ అసలు ఆర్థిక వ్యయం లీటరుకు రూ.126 అవుతున్నది. కానీ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు దీనిని కేవలం రూ.60 కే కొనుగోలు చేస్తున్నాయి. అంటే మిగిలిన భారాన్ని పన్నుల రూపంలో ప్రజలే మోస్తున్నారు. నీటి ఎద్దడి ఎదుర్కొంటున్న దేశంలో ఒక లీటరు ఇంధనం కోసం వేలాది లీటర్ల నీటిని వృధా చేయడం పర్యావరణ సమతుల్యతను దెబ్బతీస్తుందనడంలో సందేహం లేదు.

న్యాయ, రాజకీయ పోరాటాలు

ఇ20 విధానానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా న్యాయ, రాజకీయ పోరాటాలు తీవ్రరూపం దాల్చాయి. సుప్రీం కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. మొదటి పిటిషన్‌ను 2025 లో సుప్రీంకోర్టు కొట్టివేసినప్పటికీ, జూలై 2026 లో అడ్వకేట్ నరేంద్ర కుమార్ గోస్వామి దాఖలు చేసిన తాజా పిటిషన్ వినియోగదారుల ఎంపిక హక్కును, ఇంధన నాణ్యత బహిర్గతం చేయాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నది. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద రోడ్లపై తిరుగుతున్న తమ పాత వాహనాలను తుక్కుగా మార్చవద్దంటూ వాహనదారులు నిరసనలు చేపట్టారు. అరవింద్ కేజ్రీవాల్ వంటి నేతలు ఆటోమొబైల్ సంస్థల మాన్యువల్స్ వ్యత్యాసాలపై లేఖలు రాసి నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

గతంలో ఒక కోర్టు విచారణ సందర్భంగా ప్రభుత్వ అటార్నీ జనరల్ ఇ20 అమలును కేవలం ఒక "ప్రయోగం" అని పేర్కొనడం తీవ్ర సంచలనం సృష్టించింది. అయితే దీనిపై ప్రజల్లో వస్తున్న తీవ్ర విమర్శలను అడ్డుకోవడానికి పెట్రోలియం మంత్రిత్వ శాఖ, ప్రభుత్వం ఆ ప్రకటనను తప్పుగా వ్యాఖ్యానించారని స్పష్టం చేస్తూ నష్టనివారణ చర్యలు చేపట్టాయి.

వ్యర్థాల నుంచి ఇథనాల్ ను ఉత్పత్తి చేయాలి

భారతదేశ ఇథనాల్ బ్లెండింగ్ కార్యక్రమం ఇంధన స్వయంసమృద్ధి సాధన దిశగా వేసిన అడుగు అయినప్పటికీ, ఆచరణాత్మక విధానంలో పారదర్శకత లోపించడం తీవ్ర ఆందోళన కలిగిస్తున్నది. కేవలం కార్పొరేట్ సంస్థల ప్రయోజనాల కోసమో లేదా ఆటోమొబైల్ రంగానికి డిమాండ్ పెంచేందుకో కాకుండా, పాత వాహనాలు కలిగి ఉన్న సామాన్య పౌరుల ప్రయోజనాలను కాపాడడం తక్షణ కర్తవ్యం.

భవిష్యత్తులో ఈ విధానం ప్రజాదరణ పొందాలంటే, పెట్రోల్ బంకుల వద్ద వినియోగదారులకు తమ వాహనాల సామర్థ్యానికి అనుగుణంగా ఇ0, ఇ10, ఇ20 వంటి విభిన్న ఇంధన ఎంపికలను వేర్వేరు ధరలతో అందుబాటులో ఉంచాలి. అలాగే అత్యంత నీటి తీవ్రత గల పంటల నుంచి కాకుండా ప్రత్యామ్నాయ వ్యర్థాల నుంచి ఇథనాల్ ఉత్పత్తిని ప్రోత్సహించడం ద్వారా మాత్రమే పర్యావరణానికి నిజమైన మేలు చేకూరుతుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prajatantra News