Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బంబాసు!

బంబాసు!

మెరుపు తీగెలు

-బమ్మిడి జగదీశ్వరరావు

రాకూడని చోటుకి వచ్చామని వచ్చిన రెండు నిముషాల్లోనే అర్థమయ్యింది. కొరియన్ డ్రామాస్ చూసి చూసి 'కొరియర్' అని అన్నా కొరియన్ అనే వినిపిస్తోంది.

అలాంటి స్థితిలో మన హైదరాబాదులో 'కొరియన్ సందడి' జరుగుతుంటే మనం వెళ్ళకుండా వుంటే యేమి బావుంటుంది అంటూ నన్నూ యీడ్చుకుపోయారు మా మిత్రులిద్దరూ. 'ఉచితమనే అన్నారే' అంటూనే ముగ్గురికీ యెంట్రీ ఫీజు తొమ్మిదివందలు తనే కట్టేసింది సుమిత్ర. ఫ్లోరుకు వంద లెక్క చెప్పేసింది విజయ. ఆపై ఇన్ పేషెంట్‌కు వేసినట్టు చేతులకు బ్లూ బేడీలు వేసేశారు. లోపలకు అడుగు పెట్టగానే అచ్చం సంతలానే వుంది. ఎవరి స్టాల్ వారిది. బట్టలూ బొమ్మలూ బుక్సూ కెఫేలూ ఫుట్ మసాజులూ. స్టయిలిష్ బట్టలు బాగున్నాయి అని చెయ్యి వేస్తే, బాలేవ్ అని చెయ్యి తీసేసేంత కాస్ట్. మళ్ళీ చెయ్యి వెయ్యలేదు సుమిత్ర.

విజయకు బుల్లి కుక్కబొమ్మ నచ్చింది. గోలీ పిక్కంత వుంది. ఆరొందల యాభై. ఈ లెక్కన మామూలు లైవ్ కుక్కే తక్కువకి వస్తుంది అన్నాను, గొంతు తగ్గించి. ఆ కుక్క కింద చెయ్యాలి, యిదయితే యెక్కడ పెడితే అక్కడే వుంటుంది, దానికింద చెయ్యక్కర్లేదు అంది విజయ. రీజనింగు బాగుంది. నయం కుక్కపిల్ల సైజు తీయలేదు, లక్షలు పోయాల్సివచ్చేది అని నవ్వేను నేను. టీ డికాషన్ వేలల్లో వుంది. అందుకే రుచి చూసి 'మన యింట్లో చేసుకున్నట్టే వుంది' అని సరిపెట్టేసుకున్నారు యిద్దరూ. సాంస్కృతిక ప్రదర్శనలు అంటే స్టాండ్ అప్ కామిడీయే. భలే రెండు దేశాలకూ వొకటే- అన్నాను. ఔనూ… సినిమా ప్రదర్శన అన్నారు, చిత్ర ప్రదర్శన అన్నారు, యేదీ లేదు అనుకుంటూ చివరకు ఫుడ్ కోర్టు దగ్గరకు పోయి చేయికున్న బ్లూ బ్యాడ్జి చూపించి కాంప్లిమెంటరీ వుంటుందా? పే చెయ్యాలా? అని అడిగితే, పే చెయ్యాలి అనడంతో ఆ ధరలకే ఆకలి చచ్చూరుకుంది.

చూస్తే, అంతా హై ఫై. అమ్మాయిలే. తొంభైయ్యారు శాతం. చిక్కితే కాదు, చిక్కకుండా రక్తం వచ్చేలా మెరిసిపోతున్నారు. కలరింగుకే యీ కాస్ట్ వేసినట్టున్నారు అన్నాను. 'మీకు గిట్టుబాటు అయినట్టుందిగా…' అని మిత్రులు యిద్దరూ నన్ను ఆట పట్టించారు. ఇంక యే వస్తువు మీద చెయ్యి వెయ్యడానికి చూడడానికి మిత్రులకి చేతులు రాలేదు. ఆ వస్తువు కంటే ముందు ప్రైస్ ట్యాగే కనిపిస్తోంది. పర్లేదు చూడొచ్చు అని నేనూ చెప్పలేకపోయాను. అప్పుడు… ప్రైస్‌ చూడడానికి మాలా భయపడకుండా అసలు ప్రైసే చూడకుండా రుచి కూడా చూసిందో జీవి. రాజమౌళి 'ఈగ' సినిమా యెందుకు తీశాడో అర్థమైంది. 'కిమ్' అనకుండా బయటకు వచ్చేశాం, పోని 'కిమ్'అనడానికి నార్త్ కొరియా కాదుగా… అని సరిపెట్టుకు బయటపడ్డాం!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prajatantra News