Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బొగ్గు గ్యాసిఫికేషన్ ప్రాజెక్టులపై సింగరేణి ఆసక్తి

బొగ్గు గ్యాసిఫికేషన్ ప్రాజెక్టులపై సింగరేణి ఆసక్తి

- కేంద్ర సహకారం అవరం- కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని కోరిన డిప్యూటీ సీఎం భట్టి
- కొయ్యగూడెం బ్లాక్-III కేటాయింపు, తాడిచెర్ల బ్లాక్-II లీజ్‌పై చర్చ

న్యూదిల్లీ, ప్రజాతంత్ర, మే 20: బొగ్గును కేవలం సంప్రదాయ విద్యుత్ ఉత్పత్తికే పరిమితం చేయకుండా భవిష్యత్ పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా విలువ ఆధారితంగా వినియోగించాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ప్రణాళిక, ఇంధన శాఖల మంత్రి భట్టి విక్రమార్క మల్లు అన్నారు. కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డితో న్యూదిల్లీలో బుధవారం ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సింగరేణి కంపెనీ భవిష్యత్ ప్రణాళికలు, బొగ్గు గ్యాసిఫికేషన్ అవకాశాలు, కొత్త బొగ్గు బ్లాకుల కేటాయింపు, తాడిచెర్ల కోల్ బ్లాక్-II మైనింగ్ లీజ్ అంశాలపై చర్చించారు. దేశవ్యాప్తంగా బొగ్గు గ్యాసిఫికేషన్‌కు కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో సింగరేణి కూడా ఆ దిశగా ముందడుగు వేయడానికి సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రికి భట్టి వివరించారు. కోల్ ఇండియా చేపడుతున్న గ్యాసిఫికేషన్ కార్యక్రమాల తరహాలోనే సింగరేణి కూడా తన బొగ్గు వనరులను ఆధునిక సాంకేతికతతో మరింత సమర్థవంతంగా వినియోగించే అవకాశాలను పరిశీలిస్తోందన్నారు. బొగ్గు గ్యాసిఫికేషన్ ద్వారా బొగ్గు వనరులకు అదనపు విలువ కల్పించడంతోపాటు, ఇంధన భద్రత, పారిశ్రామిక వినియోగాలు, ఉపాధి అవకాశాలు మరింత పెరుగుతాయని అన్నారు. ఇందుకు అవసరమైన సాంకేతిక మార్గదర్శకత్వం, విధానపరమైన సహకారం, కేంద్ర పథకాల అనుసంధానంలో బొగ్గు మంత్రిత్వ శాఖ సహకారం అందించాలని కోరారు. సింగరేణి దక్షిణ భారత దేశ బొగ్గు సరఫరా, విద్యుత్ రంగ అవసరాల తీర్చడంలో కీలక పాత్ర పోషిస్తున్న సంస్థ అని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని సింగరేణికి కొత్త బొగ్గు వనరుల సమీకరణ అత్యవసరమని తెలిపారు. గోదావరి వ్యాలీ కోల్ ఫీల్డ్స్ పరిధిలోని కొయ్యగూడెం బ్లాక్-III తెలంగాణ విద్యుత్ అవసరాలకు కీలకమని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. గతంలో ఈ బ్లాక్‌ను వేలంలో కేటాయించిప్పటికీ నాలుగేళ్లు గడిచినా కార్యకలాపాలు ప్రారంభం కాలేదని తెలిపారు. ఈ నేపథ్యంలో కొయ్యగూడెం బ్లాక్-IIIను సింగరేణికి కేటాయించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. తాడిచెర్ల కోల్ బ్లాక్-II అంశంపైనా సమావేశంలో చర్చ జరిగింది. ఈ బ్లాక్‌కు సంబంధించి సింగరేణి ఇప్పటికే ప్రీ-మైనింగ్ కార్యకలాపాలు, అన్వేషణ పనులు చేపట్టిందని, మైనింగ్ లీజ్ ప్రక్రియను వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని ఉప ముఖ్యమంత్రి అన్నారు. తాడిచెర్ల బ్లాక్-II అభివృద్ధి సింగరేణి భవిష్యత్ అవసరాలకు, తెలంగాణ విద్యుత్ భద్రతకు కీలకమని చెప్పారు. తాడిచెర్ల కోల్ బ్లాక్‌కు ఎంఎండీఆర్ చట్టం,1957లోని సెక్షన్-5 కింద ముందస్తు అనుమతి మంజూరు చేసి మైనింగ్ లీజ్ ప్రక్రియను వేగవంతం చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కోరారు. ఈ అంశాలపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు. సింగరేణి బొగ్గు గ్యాసిఫికేషన్ ప్రణాళికలు, కొయ్యగూడెం బ్లాక్-III కేటాయింపు, తాడిచెర్ల బ్లాక్-II మైనింగ్ లీజ్ అంశాలపై కేంద్ర, రాష్ట్ర అధికారులు, సింగరేణి ప్రతినిధులతో త్వరలో సంయుక్త సమావేశం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. సమావేశంలో రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ప్రణాళిక శాఖ కార్యదర్శి డాక్టర్ గౌరవ్ ఉప్పల్, సింగరేణి సీఎండీ డాక్టర్ జ్యోతి బుద్ధ ప్రకాష్, డైరెక్టర్- పర్సనల్ అండ్ అడ్మినిస్ట్రేషన్ గౌతమ్ పొట్రు, డైరెక్టర్ ప్రాజెక్ట్స్ కె.వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prajatantra News