Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
'ధరణి' తిప్పలు తప్పిస్తున్నాం

'ధరణి' తిప్పలు తప్పిస్తున్నాం

- అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు- ఎన్నికలనాటి బొమ్మల ఇళ్ల నాటకాలకు చెక్
- రూపాయి లంచం లేకుండా నేరుగా ఖాతాల్లోకే నగదు
- సత్తుపల్లి ప్రజా దర్బార్‌లో రెవెన్యూ మంత్రి పొంగులేటి

సత్తుపల్లి, ప్రజాతంత్ర, మే 21 : గత ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు, ధరణి పోర్టల్‌లోని లోపాల వల్ల పేదలు, రైతాంగం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, నాడు గడీల్లో బందీ అయిన భూ రికార్డులను విడిపించి భూములపై పేదలకే సర్వాధికారాలు కల్పిస్తున్నాం అని రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి స్పష్టం చేశారు. సత్తుపల్లిలో స్థానిక శాసనసభ్యురాలు మట్టా రాగమయి దయానంద్ ఆధ్వర్యంలో పెనుబల్లి, వేంసూరు, సత్తుపల్లి మండలాలకు సంబంధించిన ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక ప్రజా దర్బార్ సదస్సును గురువారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పొంగులేటి వందలాదిగా తరలివచ్చిన ప్రజల నుంచి స్వయంగా వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వ వైఫల్యాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ధనిక రాష్ట్రాన్ని గత పాలకులు అడ్డగోలుగా రూ.8 లక్షల 18 వేల కోట్ల అప్పుల కుప్పగా మార్చారని మంత్రి పొంగులేటి మండిపడ్డారు. 'అప్పులు ఉన్నాయనే నెపంతో మేము చేతులు ముడుచుకుని కూర్చోలేదు.. ఉన్న వనరులతోనే పేదవాడికి భద్రత, భరోసా కల్పిస్తున్నాం.. గత పాలనలో ఎన్నికలు రాగానే ఇళ్ల పేరుతో బొమ్మలు చూపించి కాగితాలకే పరిమితం చేశారు. మా ప్రభుత్వం వచ్చిన మొదటి ఏడాదిలోనే రూ.22,500 కోట్లతో నాలుగున్నర లక్షల ఇళ్లు మంజూరు చేసింది.. ఇప్పటికే 1.25 లక్షల ఇళ్లు పూర్తి కాగా జూన్ నాటికి మరో లక్ష ఇళ్లు సిద్ధమవుతాయి.. జూన్ 2న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రాష్ట్రవ్యాప్తంగా రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల పంపిణీని ఘనంగా ప్రారంభిస్తున్నాం' అని ప్రకటించారు. హైదరాబాద్‌లో బటన్ నొక్కితే ఒక్క రూపాయి లంచం లేకుండా నేరుగా లబ్దిదారుల ఖాతాల్లోనే ప్రతి సోమవారం ఇళ్ల నిధులు జమ చేస్తున్నామన్నారు. ఇళ్లు కట్టుకునే పేదలకు ములకలపల్లి క్వారీ నుంచి నాణ్యమైన ఇసుకను ఉచితంగా అందిస్తామని చెప్పారు. గత పాలకుల హయాంలో నిరుద్యోగులను రోడ్డున పడేస్తే తమ ప్రభుత్వం వచ్చిన ఈ రెండేళ్లలోనే 72వేల ఉద్యోగాలు భర్తీ చేశామని, త్వరలోనే మరిన్ని కొత్త కొలువుల ప్రకటన రాబోతున్నదని తెలిపారు.

కాలపరిమితిలోగా భూముల కొలతలు, పహాణీల్లో పేర్లు

సత్తుపల్లి పట్టణ పరిధిలోని 399 సర్వే నంబర్ అంశంతోపాటు, చుట్టుపక్కల తొమ్మిది గ్రామాల్లో ఉన్న దాదాపు 6,500 ఎకరాల భూ సమస్యలపై మంత్రి సానుకూలంగా స్పందించారు. పేదపల్లి, నారాయణపురం పరిసరాల్లోని 5,500 ఎకరాల పైచిలుకు భూములను క్షేత్రస్థాయిలో పూర్తిస్థాయిలో కొలతలు చేపట్టి స్వాధీనంలో ఉన్న అర్హులైన రైతులందరికీ పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వాలని, పహణీలలో వారి పేర్లు ఎక్కించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ఈ ప్రక్రియ వేగంగా పూర్తి కావడానికి రైతులు, స్థానికులు అధికారులకు సహకరించాలని కోరారు. పాత ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన నిధుల బకాయిలు, ఇతర పెండింగ్ బిల్లులను క్లియర్ చేయాలని ఇప్పటికే ఆదేశాలు ఇచ్చామని, ఒకట్రెండు రోజుల్లోనే ఫలితాలు వస్తాయని చెప్పారు.

అటవీ అడ్డంకులు లేకుండా రైతులకు పూర్తి రక్షణ

రుద్రాక్షపల్లి, కొకపాడు, తాళపెంట, రామచంద్రాపురం, వెంకటగిరి సహా సరిహద్దుల్లోని 10-12 గ్రామాల్లో నెలకొన్న అటవీ-రెవెన్యూ భూముల వివాదాలపై మంత్రి కఠిన ఆదేశాలు జారీ చేశారు. వర్షాకాలం ప్రారంభం అయ్యేలోపే అటవీ సరిహద్దులను కొలిచి తేల్చాలన్నారు. మిగిలిన రెవెన్యూ భూమిలో తరతరాలుగా సాగు చేసుకుంటున్న పేదలకు పట్టాలు ఇచ్చే బాధ్యత నాదే అని మంత్రి భరోసా ఇచ్చారు. అటవీ హక్కుల చట్టం ప్రకారం పట్టాలు పొందిన రైతులు సాగు కోసం బోర్లు వేసుకుంటుంటే అటవీ శాఖ అధికారులు ఎక్కడా అభ్యంతరాలు పెట్టవద్దని, జిల్లా అదనపు కలెక్టర్, ఉప కలెక్టర్లు ఈ వ్యవహారాలను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prajatantra News