Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఏరోస్పేస్ రంగంలో మరో భారీ పెట్టుబడి

ఏరోస్పేస్ రంగంలో మరో భారీ పెట్టుబడి

‎- సఫ్రాన్ సంస్థ నుంచి రూ.4,000 కోట్ల పెట్టుబడికి ప్రతిపాదన- ఇన్వెస్ట్ తెలంగాణ సదస్సులో ఎంఓయూ కుదిరే అవకాశం
‎‎- ఫ్రాన్స్‌లోని సఫ్రాన్ తయారీ కేంద్రాన్ని సందర్శించిన డిప్యూటీ సీఎం భట్టి

‎
హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్ 21 : ‎హైదరాబాద్‌ను అంతర్జాతీయ ఏరోస్పేస్ తయారీ కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా తెలంగాణ ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. ఫ్రాన్స్‌కు చెందిన ప్రపంచ ప్రఖ్యాత విమాన ఇంజిన్ల తయారీ సంస్థ సఫ్రాన్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్స్ రాష్ట్రంలో సుమారు రూ.4,000 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి వ్యక్తం చేసింది. ఈ ప్రతిపాదన కార్యరూపం దాల్చితే రాష్ట్రంలో ఏరోస్పేస్, విమాన విడి భాగాల తయారీ రంగాలకు మరింత ఊతం లభించనుంది. డిసెంబర్ లో నిర్వహించనున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌లో ఈ పెట్టుబడికి సంబంధించి అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదిరే అవకాశం ఉంది. ‎ఫ్రాన్స్ పర్యటనలో భాగంగా పారిస్ సమీపంలోని ఎవ్రీ-కార్బెల్‌లో ఉన్న సఫ్రాన్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్స్ తయారీ కేంద్రాన్ని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా సంస్థ ఉన్నతాధికారులతో సమావేశమై తెలంగాణలో పెట్టుబడి అవకాశాలు, ఇప్పటికే కొనసాగుతున్న కార్యకలాపాల విస్తరణ, కొత్త తయారీ యూనిట్ల ఏర్పాటుపై చర్చించారు. బోయింగ్, ఎయిర్‌బస్ వంటి అంతర్జాతీయ విమాన తయారీ సంస్థలకు ఇంజిన్లను సరఫరా చేస్తున్న సఫ్రాన్ వంటి ప్రపంచ స్థాయి సంస్థ తెలంగాణలో పెట్టుబడులకు ముందుకు రావడం రాష్ట్ర పారిశ్రామిక ప్రగతికి కీలక పరిణామం. ‎హైదరాబాద్‌లో సఫ్రాన్ సంస్థ ఇప్పటికే గణనీయమైన స్థాయిలో కార్యకలాపాలు నిర్వహిస్తోందని ఆయన పేర్కొన్నారు. ప్రపంచ స్థాయి ఏరోస్పేస్ పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యం కలిగిన మానవ వనరులు, అత్యాధునిక మౌలిక సదుపాయాలు, పెట్టుబడులకు వేగంగా అనుమతులు కల్పించే ప్రభుత్వ విధానాలు తెలంగాణకు ప్రధాన బలమని వివరించారు. సఫ్రాన్ ప్రతినిధులతో జరిగిన సమావేశం ఎంతో ఫలప్రదంగా సాగిందని, డిసెంబర్‌లో జరిగే ఇన్వెస్ట్ తెలంగాణ సదస్సుకు సంస్థ ప్రతినిధి బృందాన్ని ఆహ్వానించినట్లు భట్ఠి తెలిపారు. ‎హైదరాబాద్‌లో సఫ్రాన్ ఇప్పటికే లీప్ విమాన ఇంజిన్లకు అవసరమైన రొటేటింగ్ పార్ట్స్ తయారీ కేంద్రం, సఫ్రాన్ ఎలక్ట్రికల్ అండ్ పవర్ తయారీ యూనిట్‌తోపాటు విమాన ఇంజిన్ల నిర్వహణ, మరమ్మతుల కోసం ప్రపంచంలోనే అతిపెద్ద కేంద్రాల్లో ఒకటైన లీప్ ఎంఆర్‌ఓ (ఎమ్మార్వో) సదుపాయాన్ని ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో తన తయారీ కార్యకలాపాలను మరింత విస్తరించేందుకు సంస్థ ఆసక్తి చూపుతోంది.‎‎ సఫ్రాన్ సంస్థ అంతర్జాతీయ కార్యకలాపాలు, పౌర, సైనిక విమానాల ఇంజిన్ల రూపకల్పన, తయారీ, నిర్వహణ విధానాలను ఉప ముఖ్యమంత్రికి సంస్థ ప్రతినిధులు వివరించారు. అనంతరం తయారీ విభాగాన్ని భట్టి సందర్శించారు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అత్యంత కచ్చితత్వంతో కూడిన విడి భాగాలను తయారు చేస్తున్న విధానాలను వీక్షించారు.‎‎ఆయనతోపాటు రాష్ట్ర పరిశ్రమల శాఖ కమిషనర్ నిఖిల్ చక్రవర్తి, సఫ్రాన్ సంస్థ ఇండస్ట్రియల్ అండ్ సప్లై చైన్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ లారెంట్ మజౌ, ఇండస్ట్రియల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ రొటేటింగ్ పార్ట్స్ డైరెక్టర్ జూలియన్ డి'ఒరాజియో తదితరులు పాల్గొన్నారు. ‎రూ.4,000 కోట్ల పెట్టుబడి ప్రతిపాదనను ఖరారు చేసేందుకు పరిశ్రమలు, వాణిజ్య శాఖ సఫ్రాన్ సంస్థ ప్రతినిధులతో తదుపరి సంప్రదింపులు కొనసాగించనుంది.

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prajatantra News