Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

ఫిలాసఫికల్ థియరీ కేరాఫ్ పచ్చబొట్టు

యన అక్షరం ఆయువు పోసుకొని, పదమై బంధాలను కలుపుకున్నట్లు, యాస నూరిన కత్తి అంచలంచెలు దాటి, కాలం నుదుటిపై రక్తపుబొట్ల సువాసనను అద్ది, కవిత్వ శబ్దమై మనిషి తత్వాన్ని ఒంటపట్టించుకొని తర్కం నుండి వర్తమాన మెట్లపై పచ్చబొట్టును పొడిచి తన కలం దాహం తీరని భవిష్యత్తుకు మేల్కొలుపు రాగమంటూ, పెదవి ప్రమిదల నుండి పుట్టిన వెలుగు సంకేతమే తుల శ్రీనివాస్ గారి పచ్చబొట్టు చుక్క!

అక్షరాలను పోగేసుకోవడం, భావాలను జ్ఞాపకాల తోరణాలుగా ముడి కట్టడం, వస్తువు ఏదైనాసరే తన అంతరంగపు సంఘర్షణలను, ఆత్మశుద్ధితో భావానికి బతుకు అంగిని తొడిగి, దానిమీద నచ్చిన దృశ్యాన్ని చెక్కడమే కాదు పాఠక హృదయాన్ని మెప్పించడం శ్రీనివాసుకున్న ప్రత్యేకత. చింతలతొవ్వతో చిగురించి, జీవన సంస్కృతికి బాటలు పరిచి, ప్రతి మనిషి రాయబడని కవిత్వమే అంటూ మానవీయ స్ఫురణను రగిలించిన కవిత్వం పచ్చబొట్టు. అంతర్వాహినిగా ఆయనను కదిలించిన అంశాలు కంటి ముక్కలు రాలిపడి కవిత్వపుప్పొడిగా రూపాంతరం చెందడం చూస్తాము.

"అడవిని గర్భంలో దాచుకొని/ ఒక్క వాన చుక్క కోసం/ తపస్సు చేసే అంకురం/ జ్వలించడానికి సిద్ధంగా ఉన్న/ అగ్నిపర్వతం" అంటూ చెట్టుతత్వాన్ని చెప్పేతీరులో సమాజం పట్ల కలవరపాటు స్పష్టమవుతుంది. "నింగి మెడకు దండలేస్తూ/ బారులు తీరిన పక్షుల గుంపులు/ ఏ సంతోషద్వీపాల్లో/ తమ కలలను పొదుగుతున్నాయో/ సింధూరాన్ని పుక్కిలిస్తూ/ ఆకాశాన్ని అలంకరించిన మోదుగువనాలు/ ఏ వసంతాన్ని వెతుక్కుంటూ వెళ్లాయో" ఆ వెతుకులాటలో శ్రీనివాస్ కలం సఫలమైందని చెప్పవచ్చు.

పచ్చబొట్టుకు పందిరే కాదు తన హృదయం నడవని కాలాన్ని నాలా నడవాలనీ, వినని దృశ్యాన్ని నాలా వినాలనీ, ఊపిరిని బిగగట్టి మరణమును దాచిపెట్టి మనిషిగా మళ్లీ పుట్టాలంటూ తనే ప్రతిజ్ఞగా మారి మనతో మాట్లాడుతాడు. నిశబ్దంలో ఉన్నప్పుడు తనగొంతు వినే మిత్రుడు కావాలని జీవితపార్శ్వాన్ని అద్దమై కొత్త చరిత్రకు నిర్మాణంగా చూపే ప్రయత్నం చేశాడు శ్రీనివాస్. మానవజన్మ ప్రకృతితో ముడిపడ్డదని ఎందరో కవులు చెప్పుంటారు కానీ ప్రకృతిరహస్యాన్ని అనితర సాధ్యంగా అందిపుచ్చుకున్నాడు.

పల్లానికే ప్రవహించాలని/ నది శిక్షణ పొందలేదు ఎక్కడ/ సాయంకాలానికి తన ఆయుష్షని/ తెలుసుకొని తను పూయలేదు పూవు/ చర్మానికి ఉద్యమ గీతం,పేగులకు ఆకలిశబ్దం రక్తమాంసాల దేహగదిలో బంధింపబడ్డ మనసే ఒక సంకల్ప వికల్పాల సంఘాతం అనీ జీవిత రహస్యాన్ని విప్పిచెప్పిన కవిశ్రేష్టుడు. పాడె కొమ్మున పైసలెన్ని గుప్పినా పానాన్ని కొనుక్కరావు బీరువా నిండా దాసిన పాపం కడీలు నాటి కంచలేసిన మోసం నీ రూపాన్ని రేపటికి ఆపలేవు అని మట్టిభాషలో తనవేదనను విస్తారపరిచాడు.

తన కలానికున్న భావుకతను విముక్తి అనే కవితలో పెద్దపులిలా గాండ్రించి కులమతాల ఆధారంగా చితుల మండవని అంతిమఅజ్ఞాతంలో అందరూ మృత్యువురంగు పులుముకోవాల్సిందిగా చాటింపు వేసి హెచ్చరికలు చేస్తున్నాడు. బువ్వకుండ అర్ధాకలితో అలమటిస్తుంది. ఒంటి రెక్కపక్షి ఒకటి ఎగరలేక నిలువలేక విలవిలలాడుతుంటే తోడుంటానన్న ప్రమాణం తొండిమాట అవుతుందనీ ఏకాంత గమనాన్ని ఎవరికి అందనంతగా చూపెట్టడంలో కవినేర్పు కళ్ళముందు మిరుమిట్లు గొలుపుతాయి.

జ్ఞాపకాల అలలపై సాగిన 'తుల' నాటిన పచ్చబొట్టు తులనాత్మక అధ్యయనమే! మండలు వాలిన వాకిలి పొద్దులో మట్టి పరిమాణాలను పలికించిండు. గుండెనిండా యాదితో నాయినను తలుసుకుంటూ, గోసబడ్డ క్షణాలను వాకిట్లో ఆరబోసినట్లు అందరి జ్ఞాపకాలను తట్టిలేపుతాడు. ఏవో కొన్నిసముద్రాలు మరికొన్ని నక్షత్రాలు తూచలేని బిడ్డలప్రేమ ముందు అనంతాలు కానేకావనీ ఓపికతో ప్రాణముద్రలు నాటుతూ, నీ తలపుల్ని ఆత్మకు ఆవాహన చేసి ఎప్పటికో ఓ శరీరంగా దహింపబడతాననీ శరణాగతిని మించిన తపస్సు లేదంటూ జబ్బచరిచి మరీ చెప్పుతాడు. ఇలాంటి చోట కవివాడిన ప్రతీకలు భాషపట్ల తనకున్న గౌరవాన్ని తెలియపరుస్తుంది.

ఈ కావ్యం చదువుతున్నంత సేపు ఫిలాసఫికల్ థియరీలో గింగిరాలు తిరుగుతున్నట్లు అనిపించింది. కవితలకు పేరుగడపగా పెట్టిన శీర్షికలు మనల్ని ఇలా ప్రభావితులను చేస్తుంది. గొర్రెగిట్టల గంధం అంటూ ఎత్తిన రాగంలో పల్లె జీవన సంస్కృతిలో మూగజీవాల సహవాసం పెద్దరికాన్ని చూపెట్టింది. మగ్రీబ్ నమాజ్ అయిపోగానే మినార్ల నడుమ నెలపొడుపు తరీఖ, తన స్నేహ పునాదుల మీద దేశపతాకం రెపరెపలాడాలని విశ్వానికి ఐక్యత జెండాను తానే కడుతున్నట్టుగా ఉంటది. కవి మూలాన్ని వెతకడం కంటే కవిత్వ అంచులను తాకుతే తన ఆలోచన సరళి లోతుగా అర్థమవుతుంది. తెలుగు సంప్రదాయంలో పెళ్లికి ప్రత్యేకత ఉన్నది. అలాంటి పెళ్లితంతును తనదైనశైలిలో ఆల్టర్నేటివ్ హార్ట్ ను బొమ్మగావేసి ఆడపిల్ల అత్తింటివైపు కదిలిపోతుంటే కడలి కెరటమై పోటెత్తే కన్నగుండెకూ ప్రత్యామ్నాయ ప్లాస్టిక్ హృదయం ఉంటే ఈ వేదనంతా తప్పేది కదూ అనీ తనుచూసిన విషయాన్ని త్రీడీ చిత్రంగా నిర్మాణ సౌష్టవాన్ని కవితాగోడలకు వేలాడదీసి చూపర్లను ఆకట్టుకున్నాడు.

పచ్చబొట్టులో తను వొంపిన మాటలు కాంతిపూలుగా పరిమళాలు వీస్తాయి. కనిపించని చోటులో కవి వినిపిస్తాడనే మాటకు మూటలు ఎత్తింది తుల శ్రీనివాస్ కవిత్వం. ఏ విషయాన్నయినా నిర్వహణ చేస్తున్నప్పుడు ఎన్నో హెచ్చుతచ్చులు పొడచూపుతోనే ఉంటాయి. కానీ శ్రీనివాస్ కవిత్వంలో ఈ మాటకు తావులేదు. ఆత్మతో అద్దిన కవిత్వాన్ని అక్షరసంకెళ్లు విడదీయవని గట్టిగా చెప్పవచ్చు. ఊరిడిసిపోతున్నప్పుడు ఊటబావిగా మారిన ఆయనకన్నుల ఆర్తి ఆరనిసెగలుగా పచ్చబొట్టు కొలిమిలో మండుతూనే ఉన్నవి. మాటలకు చేతలకు పొంతన ఉండాలని డీజే పెట్టి ఢంకా వాయిస్తూ పచ్చబొట్టుతో శాశ్వత పరిష్కారం కోరుతున్న 'తుల'వారి తూకం సామాజిక మార్పుకు విజన్ కావాలి.

-గన్నోజు ప్రసాద్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prajatantra News