"ఉద్యోగుల ఆర్థిక సమస్యలను కేవలం ఒక వర్గానికి సంబంధించిన డిమాండ్లుగా చూడటం సరికాదు. బకాయిపడిన ఆరు డీఏలు, పీఆర్సీ అమలు, పదవీ విరమణ ప్రయోజనాలు, ఇతర పెండింగ్ చెల్లింపులకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వాలి.
ఇవి దయాదాక్షిణ్యాలతో ఇచ్చే కానుకలు కావు; ఉద్యోగుల న్యాయమైన హక్కులు.."
ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు పెండింగ్ బకాయిల కోసం ఎదురుచూస్తుండగా, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వచ్చే ఎన్నికల్లో విజయంపై దృష్టి సారించడం విస్మయకరం. ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో అప్పులు పుట్టడం లేదని ఆర్థిక డిమాండ్లు తీర్చలేమన్నారు. ఇప్పుడు తెలంగాణ ఆర్థికాభివృద్ధిలో ముందుందని చెబుతూనే, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి మరో రెండేళ్లు వేచి చూడాలంటున్నారు. అభివృద్ధి ఫలాలు రాష్ట్ర నిర్మాణంలో భాగస్వాములైన ఉద్యోగులకు ఎందుకు అందడం లేదన్న ప్రశ్నకు ప్రభుత్వం సమాధానం చెప్పాలి.
పెరుగుతున్న నిత్యావసరాల ధరలు, విద్య, వైద్య ఖర్చులతో స్థిరాదాయ ఉద్యోగుల కుటుంబాలు సతమతమవుతున్నాయి. వేతనాల కొనుగోలు శక్తి తగ్గితే కుటుంబాల జీవన ప్రమాణాలతోపాటు స్థానిక వ్యాపారాలూ దెబ్బతింటాయి. ఉద్యోగుల ఆర్థిక సమస్యలను కేవలం ఒక వర్గానికి సంబంధించిన డిమాండ్లుగా చూడటం సరికాదు. బకాయిపడిన ఆరు డీఏలు, పీఆర్సీ అమలు, పదవీ విరమణ ప్రయోజనాలు, ఇతర పెండింగ్ చెల్లింపులకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వాలి. ఇవి దయాదాక్షిణ్యాలతో ఇచ్చే కానుకలు కావు; ఉద్యోగుల న్యాయమైన హక్కులు.
నిధులు కరువా? బాధ్యతలు బరువా?
ఉపాధ్యాయ దినోత్సవ వేదికపై రాష్ట్ర విద్యాభివృద్ధికి ఉపాధ్యాయుల సేవలే కారణమని ముఖ్యమంత్రి ప్రశంసించారు. అదే ఉపాధ్యాయుల ఆర్థిక సమస్యలు తీర్చేందుకు రెండేళ్ల గడువు కోరడం ఆ ప్రశంసల విలువను ప్రశ్నార్థకం చేస్తున్నది. వచ్చే ఎన్నికల్లో మద్దతు కోరుతూ, హక్కుల కోసం రోడ్డెక్కడాన్ని తప్పుబట్టడం ప్రజాస్వామిక స్ఫూర్తికి విరుద్ధం. సమస్యలను పరిష్కరించకుండా నిరసనలు వద్దనడం ఎలా సమంజసం? ఉపాధ్యాయులకు తానే 'గుంపు మేస్త్రీ'నని చెప్పుకునే ముఖ్యమంత్రి వారి ఆవేదనను అర్థం చేసుకోవాలి.
ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న డీఏలకు రానున్న వాయిదాలు తోడైతే బకాయిల భారం మరింత పెరుగుతుంది. ప్రస్తుత పీఆర్సీ సమస్య తేలకముందే తదుపరి వేతన సవరణ సమయం సమీపిస్తుంది. పెద్ద సంఖ్యలో పదవీ విరమణ చేయనున్న ఉద్యోగుల ప్రయోజనాలూ దీనికి అదనమవుతాయి. చెల్లింపులను వాయిదా వేయడం వల్ల ప్రభుత్వ బాధ్యత తగ్గదు; భవిష్యత్తులో భారం పెరుగుతుంది. పెన్షనర్లకు అందాల్సిన సొమ్ము నిలిపివేయడం వారి వృద్ధాప్య భద్రతను, వైద్య అవసరాలను దెబ్బతీస్తుంది. ఈ ఆలస్యంతో కుటుంబాలకు కలిగే ఆర్థిక నష్టాన్ని ప్రభుత్వం గుర్తించాలి.
రాష్ట్ర వృద్ధిరేటు దేశ సగటును మించిందని ప్రభుత్వం ప్రకటిస్తున్నప్పుడు ఉద్యోగుల బకాయిలకు నిధులు లేవనడం సహజంగానే అసంతృప్తి కలిగిస్తుంది. ఆర్థిక వృద్ధి ప్రకటనలకూ, ప్రభుత్వ చెల్లింపు సామర్థ్యానికీ మధ్య వ్యత్యాసముంటే దానిని పారదర్శకంగా వివరించాలి. ఆదాయాలు, వ్యయాలు, బకాయిల వివరాలను వెల్లడించి, చెల్లింపులకు కాలపరిమితితో కూడిన కార్యాచరణ ప్రకటించాలి. ఈ సమస్యపై ప్రతిపక్షాల మౌనమూ ప్రశ్నార్థకమే. ఎన్నికల సమయంలో ఉద్యోగుల సంక్షేమాన్ని ప్రస్తావించే పార్టీలు ఇప్పుడు వారి న్యాయమైన డిమాండ్లకు అండగా నిలవాలి.
మరచిన ఎన్నికల హామీలు
కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీల అమలు కోసం ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు ఎదురుచూస్తున్నాయి. సీపీఎస్ స్థానంలో ఓపీఎస్, పెండింగ్ డీఏల చెల్లింపు, పీఆర్సీ నివేదిక అమలు, ఉద్యోగులు, పెన్షనర్లకు ఆరోగ్య కార్డులు, పదవీ విరమణ బకాయిల విడుదల వంటి అంశాల్లో నిరీక్షణ కొనసాగుతున్నది. గత హామీలను నెరవేర్చకుండా రాబోయే ఎన్నికల్లో మద్దతు కోరడం విశ్వసనీయతను దెబ్బతీస్తుంది. మాటలకూ, ఆచరణకూ మధ్య అంతరం పెరిగితే అసంతృప్తి రాజకీయ వ్యతిరేకతగా మారుతుంది.
ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, విద్యాసంస్థల విలీనాలు, పాఠశాలల మూసివేత వంటి ప్రతిపాదనలపై ఉపాధ్యాయులు, విద్యార్థులు, విద్యావేత్తలు వ్యక్తంచేస్తున్న అభ్యంతరాలను ప్రభుత్వం వినాలి. విద్యా సంస్కరణల పేరుతో తీసుకునే నిర్ణయాలకు విస్తృత చర్చ అవసరం. గ్రామీణ విద్యార్థుల అందుబాటు, ప్రయాణభారం, బోధన నాణ్యత, మౌలిక సదుపాయాలను పరిగణనలోకి తీసుకోవాలి. విద్యారంగంలో పనిచేస్తున్నవారి అనుభవాన్ని విస్మరించి పై నుంచి నిర్ణయాలు రుద్దితే ఆశించిన ఫలితాలు రావు. విద్యాభివృద్ధి ఉపాధ్యాయుల భాగస్వామ్యంతోనే సాధ్యమని పాలకులు గుర్తించాలి.
సంఘాలకు ఐక్యతే బలం
ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ఉమ్మడి కార్యాచరణతో ముందుకు రావాల్సిన సమయమిది. ధర్నాలు, నిరసనలను పదేపదే వాయిదా వేయడం కింది స్థాయి సభ్యుల్లో నిరాశను పెంచుతుంది. ప్రభుత్వంతో చర్చలు అవసరమే; అయితే వాటికి నిర్దిష్ట ఫలితాలు, గడువులు ఉండాలి. హామీలతోనే ఉద్యమాలను విరమించడం వల్ల సమస్యలు అపరిష్కృతంగా మిగులుతాయి. తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలకపాత్ర పోషించిన ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు తమ హక్కుల విషయంలోనూ అదే పట్టుదలను ప్రదర్శించాలి. నాయకత్వం సభ్యుల ఆకాంక్షలకు జవాబుదారీగా వ్యవహరించాలి.
సంఘాల జెండాలు వేరైనా ఆర్థిక డిమాండ్లు ఉమ్మడివే. క్యాడర్, సంఘ అనుబంధాలు, ఇతర విభేదాలు ఐక్య కార్యాచరణకు అడ్డంకులు కాకూడదు. వేర్వేరు తేదీల్లో విడివిడిగా చేపట్టే కార్యక్రమాలకంటే సమన్వయంతో నిర్వహించే పోరాటాలకు ప్రభావం ఎక్కువ. ప్రజాసంఘాలు, కార్మిక సంఘాల సంఘీభావాన్ని కూడగట్టాలి. పదవీ విరమణ చేసిన అనుభవజ్ఞులైన నాయకుల సూచనలను స్వీకరించాలి. ప్రభుత్వ విధానాల పర్యవసానాలను విశ్లేషించడంలో, చర్చలను ముందుకు తీసుకెళ్లడంలో వారి అనుభవం ఉపయోగపడుతుంది. పెన్షనర్లను ఉద్యమంలో సమాన భాగస్వాములుగా చూడాలి.
ఉమ్మడి డిమాండ్లపై స్పష్టమైన ప్రాధాన్యక్రమం రూపొందించుకోవడం కూడా అవసరం. తక్షణం చెల్లించాల్సిన బకాయిలు, దశలవారీగా పరిష్కరించాల్సిన అంశాలపై సంఘాలు సమగ్ర ప్రతిపాదనతో చర్చలకు వెళ్లాలి. ప్రభుత్వం ఇచ్చే ప్రతి హామీని లిఖితపూర్వకంగా నమోదు చేయించి, అమలు పురోగతిని సభ్యులకు తెలియజేయాలి. తమ పోరాటం వెనుక ఉన్న కుటుంబాల కష్టాలను ప్రజలకు వివరించాలి. తద్వారా ఉద్యోగుల సమస్యలపై అవగాహన పెరుగుతుంది; ఉద్యమానికి విస్తృత మద్దతు లభిస్తుంది.
యువత స్ఫూర్తితో ముందుకు
పరీక్షల నిర్వహణలో లోపాలు, ప్రశ్నపత్రాల లీకేజీలు, విద్యా సమస్యలపై యువత చూపుతున్న చైతన్యం ఉద్యోగ సంఘాలకు స్ఫూర్తి కావాలి. సంప్రదాయ కార్యక్రమాలతోపాటు ప్రజలకు సమస్యలను వివరించే సృజనాత్మక, శాంతియుత నిరసన రూపాలను అనుసరించాలి. సంక్షేమ పథకాల అమలుపై ఉద్యోగులకు అభ్యంతరం లేదు. అయితే వాటిని అమలు చేస్తూనే ఉద్యోగుల చట్టబద్ధమైన ప్రయోజనాలను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. ఒక బాధ్యతను చూపి మరో బాధ్యతను నిరవధికంగా వాయిదా వేయడం సమర్థనీయం కాదు.
ఉపాధ్యాయుల సేవలను కొనియాడే వేదికలపైనే వారి సమస్యల పరిష్కారానికి స్పష్టమైన నిర్ణయాలు ప్రకటిస్తే ప్రభుత్వంపై విశ్వాసం పెరుగుతుంది. నిరసనలను తప్పుబట్టే వ్యాఖ్యలు దూరాన్ని పెంచుతాయి. వినడం, చర్చించడం, అంగీకరించిన అంశాలను అమలు చేయడం ద్వారా మాత్రమే ఆ దూరాన్ని తగ్గించవచ్చు. ఎన్నికల అవసరానికి పరిమితమైన అనుబంధం కాకుండా నిరంతర సంప్రదింపులకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వాలి. ఇదే ఆచరణాత్మక గౌరవానికి నిదర్శనం.
ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లను కేవలం వోటర్లుగా చూడకుండా పాలనలో భాగస్వాములుగా గుర్తించాలి. వారి కుటుంబాల అసంతృప్తిని నిర్లక్ష్యం చేయడం ప్రభుత్వానికే నష్టం. వేర్వేరు ఐక్య వేదికలు ఉమ్మడి కార్యాచరణకు రావాలి. ప్రభుత్వం స్పష్టమైన చెల్లింపుల ప్రణాళికతో స్పందించాలి. గురువులకు దగ్గరవ్వాలంటే 'గుంపు మేస్త్రీ' మాటల్లో ఆప్యాయత మాత్రమే సరిపోదు; నిర్ణయాల్లో న్యాయం, ఆచరణలో బాధ్యత కనిపించాలి.
వాడపల్లి అజయ్ బాబు
టి.పి.టి.ఎఫ్. సీనియర్ నాయకులు
'ఉపాధ్యాయ' పత్రిక పూర్వ సంపాదకులు

