Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
హద్దులు దాటుతున్న రాజకీయం!

హద్దులు దాటుతున్న రాజకీయం!

ప్రజాస్వామ్య వ్యవస్థలో శాసనసభ అత్యున్నతమైన స్థానం. ప్రజల సమస్యలను చర్చించడానికి, విధానపరమైన నిర్ణయాలను రూపొందించడానికి, చట్టాలను ప్రజామోదయోగ్యంగా మార్చడానికి వేదికగా నిలవాల్సిన అసెంబ్లీ, ఇటీవల కాలంలో రాజకీయ కుమ్ములాటలకు, గందరగోళానికి నిలయంగా మారుతుండడం ఆందోళనకరం.

తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాల ప్రారంభ రోజే చోటుచేసుకున్న పరిణామాలు సభా గౌరవానికి, ప్రజాస్వామ్య విలువలకు సవాలుగా నిలిచాయి. ప్రజాసమస్యలపై లోతైన చర్చలు జరగాల్సిన చోట, వీధి పోరాటాలు, నిరసనలు, పోలీసుల జోక్యం చోటుచేసుకోవడం విచారకరం.తెలంగాణ వర్షాకాల అసెంబ్లీ సమావేశాల తొలిరోజే ఉభయ సభలలోనూ, వెలుపలా తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి.

సభ లోపల ప్రతిపక్షాలు లేవనెత్తిన అంశాలపై హుందాగా చర్చ జరగాల్సింది పోయి, ప్లకార్డుల ప్రదర్శనలు, నినాదాలతో సభ అర్ధాంతరంగా వాయిదా పడే పరిస్థితి వొచ్చింది. ముఖ్యంగా, రిజిస్ట్రేషన్ల చట్టంలోని 22-ఏ నిషేధిత భూముల వ్యవహారంపై బీజేపీ సభ్యులు సభలో ఆందోళనకు దిగడం, స్పీకర్ పోడియం వద్దకు వెళ్లడం చర్చల వాతావరణాన్ని దెబ్బతీసింది. మరోవైపు, సభ వెలుపల అసెంబ్లీ ప్రాంగణానికి సమీపంలో ప్రతిపక్ష బీఆర్ఎస్ సభ్యులు ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేస్తూ నల్ల చొక్కాలతో శాసనసభలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించినప్పుడు చోటుచేసుకున్న ఘర్షణలు ప్రజాస్వామ్య చరిత్రలో చేదు జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. ప్రజాప్రతినిధులైన మహిళా ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకోవడమే కాకుండా, తోపులాటలో పలువురు నేతలు గాయపడటం, ప్రజాస్వామ్య ప్రాంగణం వెలుపల ఒక అప్రజాస్వామిక వాతావరణాన్ని సృష్టించింది.

ప్రతిపక్షాలకు ప్రజల తరఫున నిలదీసే హక్కు, నిరసన తెలిపే స్వేచ్ఛ ఉన్నాయి. కానీ, ఆ నిరసనలు శాసనసభా నియమావళిని, సభ మర్యాదలను ఉల్లంఘించే విధంగా ఉండకూడదు. అదే సమయంలో, సభను సజావుగా నడపాల్సిన బాధ్యత కేవలం ప్రతిపక్షాలదే కాదు, అధికార పక్షానిది కూడా. ప్రతిపక్షాలు లేవనెత్తిన 22-ఏ భూముల అంశం కావొచ్చు, లేదా ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి ప్రజాసమస్యలు కావొచ్చు, వాటన్నింటిపై సుదీర్ఘ చర్చకు అధికార పక్షం తగిన సమయాన్ని కేటాయించాలి. శాసనసభా వ్యవహారాల సలహా కమిటీ (బీఏసీ) నిర్ణయాలకు అనుగుణంగా చర్చలు జరిగేలా చూడటంలో ప్రభుత్వం మరింత చొరవ చూపాలి. బలవంతపు అరెస్టులు, పోలీసు బలగాల మోహరింపు ద్వారా శాసనసభకు వొచ్చే ప్రజాప్రతినిధులను నియంత్రించాలని చూడటం ఏ ప్రభుత్వానికైనా శ్రేయస్కరం కాదు.శాసనసభలో చర్చించాల్సిన అంశాలు ప్రజా సంక్షేమానికి సంబంధించినవై ఉండాలి. వ్యక్తిగత దూషణలు, రాజకీయ ప్రతీకారాలు, స్పీకర్ వంటి అత్యున్నత రాజ్యాంగబద్ధమైన పదవిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సభ గరిమను తగ్గిస్తాయి. స్పీకర్ స్థానాన్ని గౌరవించడం సభలోని ప్రతి ఒక్క సభ్యుడి ప్రాథమిక విధి. ప్రజాస్వామ్యంలో చర్చలు , సంభాషణలే పరమార్థం. పరస్పర విమర్శలు హద్దులు దాటినప్పుడు, అసలైన ప్రజా సమస్యలు పక్కదారి పడతాయి.

అసెంబ్లీ గేటు వద్ద పోలీసుల తీరుపై తెలంగాణ హైకోర్టు తీవ్రంగా స్పందించిందంటే మన పోలీసుల వ్యవహారశైలి ఎంత ఘోరంగా ఉన్నదో అర్థమవుతోంది. కేవలం అధికార పార్టీ నేతల ప్రాపకం పొందేందుకు మాత్రమే అంత దారుణంగా వ్యవహరించారన్నది స్పష్టంగా అర్థమవుతుంది. అసెంబ్లీ ప్రాంగణం స్పీకర్ నియంత్రణలో ఉంటుందని, అక్కడ పోలీసుల జోక్యం ఏమిటని ప్రశ్నించిన న్యాయస్థానం, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అడ్డుకున్న ఘటనపై పూర్తి నివేదిక అందజేయాలని డీజీపీని ఆదేశించింది. మరోవైపు, కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన పూర్తిచేసుకున్న సందర్భంగా అధికార, ప్రతిపక్షాల మధ్య పరస్పర ఆరోపణలు తారస్థాయికి చేరినయి . కాంగ్రెస్ మోసపూరిత హామీలతో ప్రజలను వంచించిందని, ఆరు గ్యారెంటీల అమలులో విఫలమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో ఛార్జ్‌షీట్ విడుదల చేయగా, దీనికి ప్రతిగా కాంగ్రెస్ నేతలు తీవ్రంగా స్పందించారు.

బీఆర్ఎస్ నేతలు సభా అధ్యక్ష స్థానాన్ని, దళిత సమాజాన్ని అవమానించేలా మాట్లాడారని, కేసీఆర్ ఆదేశాల మేరకే ఇదంతా జరుగుతోందని కాంగ్రెస్ దళిత ఎమ్మెల్యేలు ఆరోపించారు. వ్యక్తిగత దూషణలు, రాజకీయ విమర్శలు ఆరోపించుకుంటూ రెండు ప్రధాన పార్టీలు ప్రజా సమస్యలను పక్కదారి పట్టిస్తున్నాయని పరిశీలకులు భావిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి ప్రతిఘటనలు, పరస్పర కక్షసాధింపు చర్యలు రాష్ట్ర ప్రగతికి ఎంతమాత్రం మంచివి కావు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పటివరకు అసెంబ్లీ ఎదుట ఇంతటి ఘోరమైన సన్నివేశాలు చూసి ఎరగం. ఇప్పటివరకు రాష్ట్ర అసెంబ్లీ ఎందరికో మార్గదర్శకంగా వ్యవహరించింది. కానీ రేవంత్ ప్రభుత్వం అధికారంలోకి వొచ్చిన తర్వాత పరిస్థితి మారిపోయి, బూతులు యదేచ్ఛగా ఉపయోగిస్తూ ఆంధ్ర రాజకీయాలను తలపిస్తుండటం విచారకరం.

అసెంబ్లీ సమావేశాల నిర్వహణ కోసం ప్రజాధనం కోట్ల రూపాయలలో ఖర్చవుతోంది. ఆ ధనం ప్రజల అభ్యున్నతికి, రాష్ట్ర ప్రగతికి సంబంధించిన చట్టాల రూపకల్పన కోసం ఉపయోగపడాలే తప్ప, కేవలం సభల వాయిదాలు, పరస్పర ఆరోపణలకే పరిమితమైతే అది వోటర్లను అవమానించడమే అవుతుంది.ఇప్పటికైనా అధికార, ప్రతిపక్షాలు తమ వైఖరిని మార్చుకోవాలి. రాజకీయాలు ఎన్ని ఉన్నా సరే, సభ లోపలికి అడుగుపెట్టగానే ప్రజా సేవకులమనే భావనతో వ్యవహరించాలి. సభ వెలుపల ఉద్రిక్తతలు తగ్గించేందుకు, సభ లోపల నిర్మాణాత్మక చర్చలు సాగించేందుకు ఉభయ పక్షాలు సంయమనం పాటించాలి. సమస్యల పరిష్కారానికి అసెంబ్లీయే వేదిక కావాలి తప్ప, వివాదాల పురిటిగడ్డ కాకూడదు. నాణ్యమైన చర్చలు, హుందాతనంతో కూడిన ప్రవర్తన ద్వారానే తెలంగాణ శాసనసభ దేశానికి ఆదర్శంగా నిలవగలదు. ప్రజాస్వామ్య సౌధానికి ప్రతినిధులైన నాయకులు బాధ్యతాయుతంగా వ్యవహరించి, సభా గౌరవాన్ని కాపాడతారని ఆశిద్దాం.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prajatantra News