Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఇందిరమ్మ టవర్స్‌పై కాల్‌సెంటర్

ఇందిరమ్మ టవర్స్‌పై కాల్‌సెంటర్

- యూపీఐ ద్వారానే రూ.10వేల ఈఎండీ చెల్లించాలి- ఇల్లు రాకపోతే అదే ఖాతాకు తిరిగి చెల్లిస్తాం
- దరఖాస్తు సమయంలో ఆధార్ నంబరు చాలు
- పదేళ్లు క్యూర్ పరిధిలో నివాసం ఉన్నవారికే

- 040-24603572ను ప్రారంభించిన మంత్రి పొంగులేటి

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 25 : హైదరాబాద్ మహా నగరంలోని పేద, దిగువ మధ్యతరగతి కుటుంబాలకు నగర నడిబొడ్డున సొంతింటిని అందించాలనే సంకల్పాన్ని కార్యరూపంలోకి తీసుకొస్తూ ప్రజా ప్రభుత్వం క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టిందని రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ పథకంపై ప్రజల్లో ఎలాంటి గందరగోళం, అపోహలు లేకుండా దరఖాస్తు విధానం, అర్హతలు, అవసరమైన పత్రాలు, చెల్లింపులు, కేటాయింపు విధానం తదితర అంశాలపై పూర్తి సమాచారం అందించేందుకు ప్రత్యేక కాల్ సెంటర్ హెల్ప్‌లైన్‌ను హౌసింగ్ బోర్డు కార్యాలయంలో మంత్రి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు ఎలాంటి సందేహాలు ఉన్నా మధ్యవర్తులను నమ్మకుండా నేరుగా 040-24603572 నంబర్‌కు ఉదయం 9 నుంచి సాయంత్రం 6గంటల మధ్య ఫోన్ చేసి అధికారిక సమాచారాన్ని తెలుసుకోవాలని సూచించారు. దరఖాస్తుదారుల సౌకర్యార్ధం తెలుగు, హిందీ, ఇంగ్లీషు, ఉర్దూ భాషలలో సమాచారం తెలియజేయస్తామన్నారు. క్యూర్ పరిధిలో లక్ష ఇళ్ల నిర్మాణం లక్ష్యంగా తొలి విడతలో 16 నియోజకవర్గాల్లో 7680 ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. నియోజకవర్గాన్ని యూనిట్‌గా తీసుకుని ఇండ్ల నిర్మాణం చేపడుతున్నామని, ఏ నియోజకవర్గానికి చెందిన ప్రజలు అదే నియోజకవర్గంలో దరఖాస్తు చేసుకోవాలని మంత్రి సూచించారు. దరఖాస్తు దారులు ఎలాంటి విష ప్రచారాలను నమ్మకూడదని, మీ-సేవ కేంద్రాలు, ఆన్‌లైన్ పోర్టల్, వాట్సాప్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చునని చెప్పారు. హైదరాబాద్ క్యూర్ ఏరియాలో నివసిస్తున్న అల్పాదాయ వర్గాల కుటుంబాల కోసం ఈ పథకాన్ని రూపొందించామని, కుటుంబ వార్షిక ఆదాయం రూ.6 లక్షల వరకు ఉండాలని తెలిపారు. ఒక కుటుంబం నుంచి ఒక దరఖాస్తు మాత్రమే స్వీకరించనున్నట్లు, అర్హత కలిగిన కుటుంబానికి ఒక ఫ్లాట్ మాత్రమే కేటాయిస్తామని స్పష్టం చేశారు. అందిన దరఖాస్తులను డిజిటల్ విధానంలో పరిశీలించడంతోపాటు, క్షేత్రస్థాయి పరిశీలన, సమగ్ర ధ్రువీకరణ నిర్వహిస్తామన్నారు. నిర్మిస్తున్న ఫ్లాట్ల సంఖ్య కంటే అర్హులైన సంఖ్య ఎక్కువగా ఉంటే లాటరీ ద్వారా ఇండ్లను కేటాయిస్తామన్నారు. దరఖాస్తుదారు క్యూర్ పరిధిలో పదేళ్లుగా నివాసం ఉండాలని, దరఖాస్తుదారు లేదా కుటుంబానికి ఓఆరఆర్, క్యూర్ పరిధిలో సొంత ఇల్లు లేదా ఫ్లాట్ లేదా ప్లాట్ ఉండకూడదని తెలిపారు. దరఖాస్తు సమయంలో ఆధార్ నెంబర్ తెలియజేస్తే సరిపోతుందని, కుల, జీతభత్యాల ధ్రువీకరణ పత్రాలను అప్‌లోడ్ చేయాల్సిన అవసరం లేదని, లాటరీ సమయంలో వీటిని సమర్పించవచ్చునని తెలిపారు. దరఖాస్తు సమయంలో రూ.10 వేల చెల్లింపునకు యూపీఐ లేదా నెట్ బ్యాంకింగ్‌ను మాత్రమే ఉపయోగించాలని, ఒకవేళ ఇల్లు మంజూరు కాకపోతే తిరిగి అదే ఖాతాకు ఆ మొత్తం వాపసు అవుతుందని పొంగులేటి చెప్పారు. పరిశీలన, కేటాయింపు, వాపసు తదితర సమాచారం పూర్తయ్యేవరకు మీసేవ రశీదు, చెల్లింపు రశీదు, దరఖాస్తు సంఖ్య, మొబైల్ నెంబర్‌లను యాక్టివ్‌గా ఉంచుకోవాలని సూచించారు. ఒక్కో ఫ్లాట్ ఖరీదు రూ.40 నుంచి రూ.60 లక్షల వరకు ఉంటుందని, ఇందులో ప్రభుత్వం రూ.5 లక్షల సబ్సిడీతో పాటు అన్‌డివైడెడ్ షేర్ కింద 20 నుంచి 25 గజాల స్ధలాన్ని కూడా లబ్దిదారుని పేరిట రిజిస్ట్రేషన్ చేస్తుందని తెలిపారు. లబ్దిదారుడు కేవలం రూ.6 లక్షలు మాత్రమే చెల్లించవలసి ఉంటుందన్నారు. కార్యక్రమంలో హౌసింగ్ శాఖ ప్రత్యేక కార్యదర్శి వి.పి.గౌతమ్, హౌసింగ్ బోర్డు సీఈ రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prajatantra News