Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కాళోజీ వారసత్వాన్ని పుణికిపుచ్చుకోవాలి

కాళోజీ వారసత్వాన్ని పుణికిపుచ్చుకోవాలి

- పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి- రవీంద్రభారతిలో ఘనంగా కాళోజీ జయంతి ఉత్సవాలు
- వి.ఆర్.విద్యార్థికి కాళోజీ సాహిత్య పురస్కారం ప్రదానం

హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 9 : కాళోజీ నారాయణరావు ప్రజల గొంతుకగా, తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచారని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.

కాళోజీ జయంతి సందర్భంగా రవీంద్రభారతిలో బుధవారం నిర్వహించిన ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సైనిక కవిగా, ఖండాంతర కవిగా ప్రసిద్ధి చెందిన వి.ఆర్.విద్యార్థికి (వేలూరి రాములు) 2026 కాళోజీ నారాయణరావు సాహిత్య పురస్కారాన్ని ఆయన ప్రదానం చేశారు. కాళోజీ సాహిత్య వారసత్వాన్ని వి.ఆర్.విద్యార్థి వంటి వారు పుణికిపుచ్చుకుని ముందుకు తీసుకెళ్లాలని మంత్రి జూపల్లి కోరారు. తెలంగాణ ప్రజల జీవితం, బాధ, ఆశ, ఆకాంక్ష, పోరాటం, ఆత్మగౌరవం కాళోజీ రచనల్లో స్పష్టంగా ప్రతిబింబించాయన్నారు. 'నా గొడవ' కేవలం ఆయన వ్యక్తిగత గొడవ కాదని, సమాజంలోని అణగారిన, బాధిత, సామాన్య ప్రజల గొడవను తన గొడవగా కాళోజీ స్వీకరించారని మంత్రి చెప్పారు. ప్రజల సమస్యలను తన కలంతో వినిపించిన ప్రజాకవిగా కాళోజీ చిరస్థాయిగా నిలిచిపోయారని కొనియాడారు.

తెలంగాణ యాస.. కాళోజీ శ్వాస

తెలంగాణ భాష, యాసపై కాళోజీకి ఉన్న ప్రగాఢ విశ్వాసం ఆయన రచనల్లో స్పష్టంగా కనిపిస్తుందని మంత్రి జూపల్లి అన్నారు. తెలంగాణ రచయితల వేదిక ప్రథమ మహాసభలో తెలంగాణ బతుకు, భాషపై కాళోజీ చేసిన అధ్యక్షోపన్యాసం తెలంగాణ ఆధునిక సాహిత్య చరిత్రలో సువర్ణాధ్యాయమని అన్నారు.ప్రజలు మాట్లాడే భాషలోనే రచనలు చేయాలని కాళోజీ బలంగా విశ్వసించారని చెప్పారు.

పలుకుబడుల భాషకు పెద్దపీట

కాళోజీ దృష్టిలో భాషకు రెండు తీర్లు ఉన్నాయని మంత్రి తెలిపారు. ఒకటి బడి పలుకుల భాష, మరొకటి పలుకుబడుల భాష అని వివరించారు. పుస్తకాల్లో, పండితుల రచనల్లో కనిపించే భాష కంటే ప్రజల నాలుకలపై సహజంగా నడయాడే పలుకుబడుల భాషలోనే నిజమైన జీవన వాస్తవికత ఉంటుందని కాళోజీ విశ్వసించారని చెప్పారు. తన పోరాటాలన్నింటికీ కాళోజీ కవిత్వాన్ని మాధ్యమంగా ఎంచుకున్నారని, చెప్పదలుచుకున్న విషయాన్ని సూటిగా, సరళంగా ప్రజల భాషలోనే చెప్పేవారని పేర్కొన్నారు. అందుకే ఆయన రచనలు సామాన్య ప్రజలకు మరింత చేరువయ్యాయన్నారు. తెలంగాణ యాసను, భాషను, ప్రజల పలుకుబడిని కాళోజీ సాహిత్యంలో గౌరవప్రదంగా నిలబెట్టారని జూపల్లి అన్నారు. తెలంగాణ మాండలికాన్ని తక్కువగా చూసే ధోరణులకు తన కలంతో సమాధానం చెప్పి తెలంగాణ యాస పట్ల తనకున్న ప్రగాఢ విశ్వాసాన్ని చాటుకున్నారని వెల్లడించారు. భాష సంభాషణకు ఉపయోగించే సాధనం మాత్రమే కాదని, ఒక జాతి చరిత్ర, సంస్కృతి, జీవన విధానం, ఆత్మగౌరవానికి ప్రతిబింబమని మంత్రి పేర్కొన్నారు. కాళోజీ అందించిన స్ఫూర్తిని కొనసాగించాలనే ఉద్దేశంతోనే ఆయన జయంతిని తెలంగాణ భాషా దినోత్సవంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్‌పర్సన్ వెన్నెల గద్దర్, భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ ఏనుగు నరసింహారెడ్డి, నిథమ్ డైరెక్టర్ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prajatantra News