Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కుటుంబమే మన బలం.. బలగం

కుటుంబమే మన బలం.. బలగం

నిషి జీవితానికి మొదటి పాఠశాల కుటుంబమే. అక్కడ నేర్చుకునే విలువలే సమాజ నిర్మాణానికి పునాది. కుటుంబ బంధాలు బలహీనపడితే సమాజం కూడా అస్థిరంగా మారుతుంది.

కుటుంబ వ్యవస్థకు పునాది వివాహం. కుటుంబం అంటే ఒక గృహంలో నివసించే వ్యక్తుల సమూహం. వారి మధ్య వైవాహిక, రక్త సంబంధాల ద్వారా బంధుత్వం ఉంటుంది. కుటుంబం అనేది మనిషి జీవితంలో ఆనంద, దుఃఖాలను పంచుకునే ఆత్మీయ బంధం. ప్రేమ, అనురాగం, పరస్పర గౌరవం, బాధ్యత వంటి విలువలు ఇందులోనే ప్రారంభమవుతాయి. కుటుంబం అనేది కేవలం రక్త సంబంధమే కాదు.. అది భావోద్వేగాల సమాహారం. కుటుంబ వ్యవస్థ ప్రాముఖ్యతను గుర్తు చేయడానికి ఐక్యరాజ్య సమితి మే 15న ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ కుటుంబ దినోత్సవాన్ని ప్రకటించగా యేటా ఆ రోజున ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ కుటుంబ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.

మొదటి పాఠశాల కుటుంబమే

మనిషి జీవితానికి మొదటి పాఠశాల కుటుంబమే. అక్కడ నేర్చుకునే విలువలే సమాజ నిర్మాణానికి పునాది. కుటుంబ బంధాలు బలహీనపడితే సమాజం కూడా అస్థిరంగా మారుతుంది. అందువల్ల కుటుంబ వ్యవస్థను కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించాలి. కుటుంబాలను ప్రభావితం చేసేది సామాజిక, ఆర్థిక అంశాలే. వీటిని చర్చించడం, కుటుంబ విలువలను పెంచడం ద్వారా బలమైన సమాజాన్ని నిర్మించొచ్చు. అయితే ఈ రోజుల్లో కుటుంబ వ్యవస్థలో భార్యాభర్తల మధ్య పెరుగుతున్న విభేదాలు చిన్న విషయాలకT కూడా పెద్ద గొడవలకు దారి తీస్తున్నాయి. తల్లిదండ్రులు-పిల్లల మధ్య కూడా తరాల తేడాలు, జీవన విధానాల్లో వ్యత్యాసాలు, సాంకేతికత ప్రభావం కారణంగా విభేదాలు పెరుగుతున్నాయి. కొన్ని సందర్భాల్లో పరస్పర అవగాహన లోపం, కోపం, అహంకారం కారణంగా హింసాత్మక ఘటనలు కూడా చోటుచేసుకుంటున్నాయి. ఇవి కుటుంబ విలువలు క్షీణిస్తున్నాయని చెప్పే ఆందోళనకర సంకేతాలు.

సమస్యలకు పరిష్కారం కుటుంబంలోనే..

అనేక సమస్యలకు పరిష్కారం మన కుటుంబంలోనే ఉంది. భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకోవడం, సంభాషణకు ప్రాధాన్యత ఇవ్వడం, కోపాన్ని అదుపులో ఉంచుకోవáడం అవసరం. తల్లిదండ్రులు పిల్లలతో స్నేహపూర్వకంగా వ్యవహరించాలి. పిల్లలు పెద్దలను గౌరవించాలి. సాంకేతిక ప్రపంచంలో ఎంత తీరిక లేకుండా ఉన్నా కుటుంబంతో గడిపే సమయాన్ని పెంచుకోవాలి. చిన్నచిన్న విషయాల్లో సహనం, పరస్పర గౌరవం పాటిస్తే పెద్ద సమస్యలు తలెత్తవు.

ఇది వేడుక మాత్రమే కాదు

అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం ఒక వేడుక మాత్రమే కాదు. ఇది మనకు బాధ్యతను గుర్తు చేసే రోజు. బలమైన కుటుంబం- బలమైన సమాజం అనే భావనను మనందరం ఆచరణలో పెట్టాలి. కుటుంబ విలువలను కాపాడుకోవడం ద్వారా మాత్రమే మన సంస్కృతీసాంప్రదాయాలను నిలబెట్టగలం. నేటి యాంత్రిక జీవన విధానంలో కుటుంబ బంధాలు క్రమంగా బీటలు వారుతున్నాయి. చదువు, ఉన్నత ఉద్యోగాలు, మంచి అవకాశాల కోసం విదేశాలకు వెళ్తున్న యువత సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ప్రపంచ స్థాయికి ఎదగడం ఒక మంచి పరిణామమే అయినప్పటికీ అది మరోవైపు కుటుంబ సంబంధాలపై ప్రభావం చూపుతోంది. విదేశాలలో స్థిరపడిన పిల్లలు స్వదేశంలో ఉన్న తమ తల్లిదండ్రులను చూసుకోవడంలో కొన్ని సందర్భాల్లో అశ్రద్ధ చూపుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు కోసం ఎన్నో త్యాగాలు చేస్తారు. కానీ వయసు మీద పడినప్పుడు ఆర్థిక సహాయం కంటే ఎక్కువ ప్రేమ, ఆప్యాయత, తోడు వారికి అవసరం. ఈ సమయంలో పిల్లలు దూరంగా ఉండటం వల్ల ఒంటరితనం, భావోద్వేగ లోపం పెరుగుతుంది. ఇది వ్యక్తిగత సమస్య మాత్రమే కాదు.. సమాజానికి సంబంధించిన సమస్యగా మారుతోంది. ఈ పరిస్థితిని పూర్తిగా వ్యతిరేక భావనతో చూడలేం. సాంకేతికత ద్వారా దూరాలను తగ్గించుకునే అవకాశాలు ఉన్నాయి. కానీ నిజమైన అనుబంధం మాత్రం ప్రత్యక్ష సంబంధాల ద్వారానే బలపడుతుంది. కనుక విదేశాలలో ఉన్నా కూడా తల్లిదండ్రులతో నిరంతర సంబంధం కొనసాగించడం, సమయం కేటాయించడం, అవసరమైనప్పుడు వారి దగ్గర ఉండటం వంటి బాధ్యతలను యువతరం గుర్తెరగాలి. పిల్లలను కని, పెంచి, జీవితంలో నిలబెట్టే బాధ్యత తీసుకున్న తల్లిదండ్రులే వారికి మొదటి గురువులు. అలాంటి తల్లిదండ్రులే తమ పిల్లలను అర్థం చేసుకోకపోతే మరెవరు అర్థం చేసుకుంటారు.. ఈ ప్రశ్న నేటి కుటుంబ వ్యవస్థకు అద్దం పడుతోంది. కొన్నిసార్లు యువతరం తప్పుదోవ పట్టినప్పుడు వారిని నిందించడం కంటే ఆ పరిస్థితికి దారి తీసిన కారణాలను పెద్దలు పరిశీలించాలి. పిల్లలు దారి తప్పితే అది కేవలం వారి తప్పు కాదు. మార్గనిర్దేశం చేయడంలో ఎక్కడో లోపం జరిగినట్టే. అందువల్ల పిల్లల ప్రవర్తనను సమస్యగా కాక ఒక సవాలుగా తీసుకోవాలి. వారితో స్నేహపూర్వకంగా మాట్లాడటం, వారి ఆలోచనలను అర్థం చేసుకోవడం, సరైన మార్గం చూపించడం తల్లిదండ్రుల ప్రధాన బాధ్యత. ప్రేమతో చెప్పిన మాటలు, సహనంతో చూపిన దారి, కఠిన శిక్ష కంటే ఎంతో ప్రభావవంతంగా పనిచేస్తాయి. అదే సమయంలో వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను చూసుకోవడం పిల్లల బాధ్యతగా మిగిలిపోకూడదు. అది తమ కర్తవ్యంగా భావించాలి. వృద్ధులైన తల్లిదండ్రులకు అవసరమయ్యేది కేవలం ఆర్థిక సహాయమే కాదు.. ప్రేమ, ఆప్యాయత, తోడు, గౌరవం. వారిని ఒంటరితనం, భావోద్వేగ క్షోభకు గురికాకుండా చూసుకోవడం ప్రతి సంతానం చేయవలసిన అత్యంత పవిత్రమైన బాధ్యత.

పరస్పర అవగాహనతో బంధాలు నిలబడతాయి

ఒకరి తప్పులను మరొకరు మన్నించగలిగి పరస్పర అవగాహనతో ముందుకు సాగినప్పుడే కుటుంబ బంధాలు చిరస్థాయిగా నిలుస్తాయి. కుటుంబంలో ప్రేమ, సహనం, క్షమాగుణం ఉంటే విభేదాలు కూడా సులభంగా పరిష్కారమవుతాయి. మనకు నిజమైన బలం, బలగం తల్లిదండ్రులేనని పిల్లలకు అనిపించినప్పుడు, అలాగే వృద్ధాప్యంలో తమకు అండదండ తమ పిల్లలేనని తల్లిదండ్రులకు నమ్మకం కలిగినప్పుడు ఆ ఇల్లు నిజమైన ఆనంద నిలయంగా మారుతుంది. అలాంటి కుటుంబంలో ఆప్యాయత, అనుబంధాలు, ఆనందం నిత్యం వెల్లివిరుస్తాయి. నిజానికి ప్రేమతో నిండిన కుటుంబమే సస్యశ్యామలం అయిన సమాజానికి పునాది. ఈ దినోత్సవం సందర్భంగా ప్రతి కుటుంబం ఒక నిర్ణయం తీసుకోవాలి. విభేదాలకు బదులు సంభాషణ, ద్వేషానికి బదులు ప్రేమ, అహంకారానికి బదులు సహనం ఎంచుకోవాలి. అప్పుడు మాత్రమే కుటుంబాలు ఆనందమయంగా, సమాజం శాంతియుతంగా ముందుకు సాగుతుంది. అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం కుటుంబ బంధాల గొప్పతనాన్ని గుర్తు చేస్తూ సమాజంలో ఐక్యతను పెంపొందించే సందేశాన్ని అందిస్తుంది. బలమైన కుటుంబ వ్యవస్థ ఉన్నప్పుడే బలమైన సమాజం ఏర్పడుతుంది. అందుకే కుటుంబ విలువలను పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత.

- డాక్టర్ కోమల్ల ఇంద్రసేనారెడ్డి,
లైబ్రేరియన్,
కాకతీయ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, వరంగల్.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prajatantra News