Dailyhunt
మాఫియా చేతుల్లోకి ఇసుక ఆదాయం

మాఫియా చేతుల్లోకి ఇసుక ఆదాయం

హైదరాబాద్‌,ప్రజాతంత్ర,ఏప్రిల్‌ 3:రాష్ట్రంలో ఇసుక తవ్వకాల ఆదాయంపై కాంగ్రెస్‌ ప్రభుత్వం విడుదల చేస్తున్న గణాంకాలు పూర్తిగా తప్పుదోవ పట్టించే విధంగా ఉన్నాయని బీఆర్‌ఎస్‌ అధికార ప్రతినిధి మన్నె క్రిశాంక్‌ విమర్శించారు.

రాష్ట్రం ఏర్పడక ముందు కాంగ్రెస్‌ ప్రభుత్వ కాలంలో ఇసుక తవ్వకాల ద్వారా వచ్చిన ఆదాయం కేవలం రూ.39 కోట్లే అని తెలిపారు. కానీ కేసీఆర్‌ నాయకత్వంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తీసుకున్న సంస్కరణలతో ఇసుక ఆదాయం గణనీయంగా పెరిగిందన్నారు. ఒక్క సంవత్సరంలోనే రూ.886 కోట్లకు చేరిందని చెప్పారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో ఇసుక ధర టన్నుకు రూ.645 మాత్రమే ఉండేదని.. ప్రజలకు అందుబాటులో ఉండేదని క్రిశాంక్‌ తెలిపారు. కానీ కాంగ్రెస్‌ ప్రభుత్వంలో సాండ్‌ బజార్‌ పేరుతో ఇసుక ధరను రూ.1600కు పెంచి, అదనంగా రవాణా భారం కూడా ప్రజలపై మోపుతోందన్నారు. సర్వీస్‌ చార్జీలు టన్నుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం రూ.3 నుంచి రూ.100కు పెంచినప్పటికీ, ఆదాయం మాత్రం పెరగకపోవడం అనుమానాస్పదమని అన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ కాలంలో ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు మాత్రమే ఇసుక తవ్వకాలు జరగ్గా, ఇప్పుడు పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించి ఉదయం 6 నుంచి రాత్రి 9 వరకు తవ్వకాలు, 24 గంటల రవాణా అనుమతించినప్పటికీ ఆదాయం రెట్టింపు కాలేదని క్రిశాంక్‌ తెలిపారు. ఈ పరిస్థితి చూస్తే ఇసుక ఆదాయం సాండ్‌ మాఫియా చేతుల్లోకి వెళ్లిపోతుందనే అనుమానాలు బలపడుతున్నాయని పేర్కొన్నారు. ముఖ్యంగా, ప్రస్తుత ముఖ్యమంత్రి కార్యాలయ సీపీఆర్వోగా ఉన్న గుర్రం మల్సూర్‌ గతంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో టీఎస్‌ఎండీసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా పనిచేశారు. కాబట్టి, ఆయనకు వాస్తవ గణాంకాలు బాగా తెలుసని క్రిశాంక్‌ అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎందుకు గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ విజయాలను వక్రీకరించి తప్పుడు గణాంకాలతో ప్రజలను మోసం చేస్తోంది అనే విషయంపై మల్సూర్‌ వెంటనే స్పష్టత ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఇసుక తవ్వకాల ఆదాయంపై పారదర్శకత కోసం పూర్తి వివరాలు ప్రజలకు వెల్లడించాలన్నారు.
------------------------------------------------------------

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prajatantra News