Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మనిషి పక్షాన నిలిచిన సాహిత్యకారుడు

మనిషి పక్షాన నిలిచిన సాహిత్యకారుడు

చెమ్మ : వారాల ఆనంద్

సాహిత్యం సమాజానికి అద్దంలాంటిది అంటారు. కొలకలూరి ఇనాక్ ఆ అద్దంలో బయటకు కనిపించని అనేకముఖాలను చూపించిన రచయిత. ప్రధాన స్రవంతికి దూరంగా ఊరు అంచులకు సమాజం అట్టడుగుక్కి నెట్టివేసిన మనుషుల జీవితాలను కథా వస్తువులుగా తీసుకున్నారు.

వారిశ్రమలోని గౌరవాన్ని, బాధలోని మానవత్వాన్ని, అవమానంలో దాగిన ఆత్మగౌరవాన్ని తన సృజనాత్మక సాహిత్యకేంద్రంగా నిలబెట్టారు. కొలకలూరి ఇనాక్- దళిత జీవితాన్ని కేవలం బాధగా కాకుండా ఆత్మగౌరవ పోరాటంగా చిత్రించిన రచయిత. సామాజిక న్యాయానికి సాహిత్యాన్ని ఆయుధంగా ఉపయోగించిన ఆచార్యుడు. తెలుగు దళిత సాహిత్యానికి అకాడమిక్ గౌరవాన్ని తీసుకొచ్చిన పండితుడు. నాక్ సాహిత్య వ్యక్తిత్వాన్ని పరిశీలిస్తే ఏకకాలంలో దళితచైతన్యాన్ని మానవతా విలువలను ప్రజాస్వామ్యాన్ని సమానత్వాన్ని విద్యయొక్క ప్రాముఖ్యతను ప్రతిపాదిస్తారు. ఆయన రచనల్లో కోపం కనిపిస్తుంది కానీ ద్వేషం లేదు. విమర్శ ఉంది కానీ విద్వేషం లేదు. అంతేకాదు సామాజిక మార్పు పట్ల ఆయనలో గాఢమైన నిబద్ధత ఉంది.

ఆయన సృజనాత్మక రచనల్లో కథలు, నవలలు, నాటకాలు, కవిత్వం లాంటి అనేక ప్రక్రియలు వున్నాయి. తెలుగు సాహిత్యవిమర్శలో విశిష్ట స్థానాన్ని సంపాదించారు. ఆయన రచనల ప్రధాన లక్షణాల్ని స్థూలంగా పరిశీలిస్తే తెలుగు దళిత సాహిత్యానికి సిద్ధాంతపరమైన బలం ఇచ్చిన రచయితలలో ఇనాక్ ఒకరుగా కనిపిస్తారు. "మనిషి గౌరవమే నిజమైన నాగరికత" అని స్పష్టంగా చెబుతారు. ఇక అలంకారాల కంటే జీవితం ప్రధానమని ఆయన విశ్వాసం. ఆయన కథల్లో పాత్రలు నిజజీవితంలో మనకు ఎదురయ్యే మనుషుల్లా ఉంటాయి. ఇనాక్ రాసిన కథల ప్రత్యేకత వాటిల్లోని వృత్తిజీవితాల చిత్రణలో కనిపిస్తుంది. మాల, మాదిగల సంప్రదాయ వృత్తులు, వారి ఆహారసంస్కృతి, జీవనవిధానం, సామాజిక అవమానాలు ఇవన్నీ ఆయన కథల్లో ఆవిష్క్రతమవుతాయి. 'పశ్చాద్భూమి'లో పారిశుధ్య కార్మికుల జీవితం ఒక వృత్తికథగా మొదలై, సమాజంలో అస్పృశ్యత ఎంతలోతుగా మనిషి జీవితాన్ని కమ్మేసిందో చూపించే మానవీయ విషాదంగా మారుతుంది. రాంకోటి కుటుంబం మోసే మలాన్ని సమాజం అసహ్యించుకుంటుంది. కానీ అదే మలం ఎరువుగా మారినప్పుడు దానిలో విలువను వెతుకుతుంది. ఈ వైరుధ్యం కథను సామాజిక వాస్తవికత నుంచి తాత్విక స్థాయికి తీసుకెళ్తుంది.

'పిండీకృత శాటి'లో బట్టలు ఉతికే గూగడి జీవితం ఇంకో ప్రపంచాన్ని మన ముందుంచుతుంది. ఇతరుల బట్టలను శుభ్రంచేసే అతని జీవితం మాత్రం మురికితో, ఆకలితో, అవమానంతో నిండివుంటుంది. శ్రమను తక్కువచేసి చూపడం ద్వారా శ్రామికుల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసి, వారి శ్రమ విలువను దోచుకోవడం ఎలా జరుగుతుందో ఇనాక్ సూక్ష్మంగా ఆవిష్కరిస్తారు. 'తలలేనోడు'లో మంగలివృత్తి కథానేపథ్యంగా కనిపించినా, అసలు కథ అధికార దురహంకారానికి, భూమికోసం జరిగే దోపిడీకి, పీడితులలో పెరుగుతున్న కసికి సంబంధించినది. ఇనాక్ రచనాదృష్టి కేవలం కులవివక్షతో ఆగిపోదు. రైతు సంక్షోభం, ఆర్థిక అసమానతలు, ప్రాంతీయ అసమానతలు, నిర్వాసితత్వం వంటి సమకాలీన సమస్యలు కూడా ఆయన కథల్లో ప్రతిఫలిస్తాయి. 'విముక్తి రైతు' ఆత్మహత్యల వెనుక ఉన్న ఈనాటి ఆర్థికవ్యవస్థను ప్రశ్నిస్తుంది. 'పుట్టినూరు'లో అభివృద్ధి పేరుతో ఊరును, భూమిని, జ్ఞాపకాలను కోల్పోయిన నిర్వాసితుడి అంతరంగ వేదన కనిపిస్తుంది. ఒక మనిషి తన భూమిని కోల్పోవడం అంటే కేవలం ఆస్తిని కోల్పోవడం మాత్రమేకాదు తన గతాన్ని, తన గుర్తింపును కోల్పోవడం కూడా అని ఇనాక్ మనకు గుర్తుచేస్తారు.

కవిగా కూడా ఆయన గొంతు విలక్షణ మయిందే. 'నాకు శాంతిలేదు'లో మీరు-వీళ్ళు అనే విభజన ద్వారా సంపన్నులు, పేదల మధ్యనున్న అంతరాన్ని కవిగా ప్రశ్నిస్తాడు. అందరూ కలిసి ఆనందించే సమాజం ఏర్పడేవరకు శాంతిలేదని ప్రకటించే ఇనాక్ కవిగా కేవలం దుఃఖాన్ని మాత్రమే చెప్పడు, మార్పును కోరుకుంటాడు. 'కులం: ధనం'లో కులం, ధనం కలిసి నిర్మించే అసమానతల వ్యవస్థను ధిక్కరిస్తాడు. ఆయన కవిత్వంలో చివరికి పండుగ కూడా ప్రశ్నగానే నిలబడుతుంది. సాహిత్యకారుడిగా ఇనాక్ కి మనిషి పట్ల అపారమైన విశ్వాసం ఉంది. వృత్తి ఏదైనా కావచ్చు, కులం ఏదైనా కావచ్చు, ఎంతటి పేదరికం అయినా కావచ్చు మనిషిపట్ల గౌరవం తగ్గదు. బతుకుకోసం చేసే ప్రతిశ్రమలో సౌందర్యం ఉందని దానికి గౌరవం ఇవ్వాలంటారు. అంతేకాదు విద్యే విముక్తికి మార్గమని పదేపదే చెబుతారు. ఇనాక్ రచనల్లో సాధారణ పాఠకుడికి అర్థమయ్యే భాషనే ఉపయోగించారు. అయితే ఆ భాషలోనూ భావంలోనూ గంభీరత ఉంటుంది. పరిశోధనరంగంలో కూడా విశేషసేవ చేసిన ఆయన- సామాజిక దృక్పథం, చారిత్రక విశ్లేషణ, దళిత సాహిత్య సిద్ధాంతం వంటి అంశాలను ప్రతిపాదించారు. అధ్యాపకుడిగా అనేకమంది పరిశోధకులకు మార్గదర్శకులయ్యారు.

కొలకలూరి ఇనాక్ జీవనరేఖల్ని పరిశీలిస్తే ఆయన 1939 జూలై 1న ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా వేజెండ్ల గ్రామంలో జన్మించారు. తెలుగుసాహిత్యంలో ఎం.ఎ, అనంతరం పరిశోధన చేసి డాక్టరేట్ పొందారు. కొలకలూరి ఇనాక్ ఉద్యోగ జీవితాన్ని అధ్యాపకునిగా ప్రారంభించారు. తెలుగు అధ్యాపకుడిగా అనేకకళాశాలల్లో చేసిన తరువాత నాగార్జున విశ్వవిద్యాలయంలో తెలుగువిభాగంలో ప్రొఫెసర్‌గా పనిచేశారు. విభాగాధిపతిగా, డీన్‌గా వివిధ బాధ్యతల అనంతరం నాగార్జున విశ్వవిద్యాలయం ఉపకులపతిగా నియమితులై విద్యా పరిపాలనలో సేవలందించారు. విద్య ద్వారా సమాజాన్ని మార్చవచ్చన్న విశ్వాసంతో జీవితమంతా బోధనకే అంకితమయ్యారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prajatantra News