Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మెటా కార్యాలయంపై దాడి గర్హనీయం

మెటా కార్యాలయంపై దాడి గర్హనీయం

- పెట్టుబడిదారుల్లో విశ్వసనీయతను దెబ్బతీసే చర్య- కాంగ్రెస్ మూర్ఖులు చేసిన పని ఇది
- చేసిన తప్పుడు పనిని గొప్పగా చెప్పుకోవడం అవివేకం
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 21: హైదరాబాద్‌లో ఉన్న మెటా కార్యాలయం వద్ద తెలంగాణ యూత్ కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు శుక్రవారం భారీ నిరసన చేపట్టడం, కార్యాలయంపై దాడికి పాల్పడటాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనపై 'ఎక్స్' వేదికగా స్పందించిన ఆయన కాంగ్రెస్ పార్టీ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న జరిగిన ఘటన కార్యాలయ అద్దాలను మాత్రమే ధ్వంసం చేయలేదని, దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్ సంపాదించుకున్న విశ్వసనీయతను, పెట్టుబడిదారుల్లో ఉన్న నమ్మకాన్ని కూడా దెబ్బతీసిందని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా లక్షలాది కుటుంబాలకు ఉపాధి కల్పిస్తున్న హైదరాబాద్ బ్రాండ్ ఒక్క రోజులో ఏర్పడలేదని, అనేక సంవత్సరాలపాటు అనుసరించిన, వ్యాపార అనుకూల విధానాలు, తాము కష్టపడి నిర్మించిన పారిశ్రామిక వాతావరణం ఫలితంగానే హైదరాబాద్ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిందని కేటీఆర్ పేర్కొన్నారు.అనేక ప్రయత్నాల తర్వతా మెటా సంస్థ తన భారతదేశంలోని అతిపెద్ద క్యాంపస్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిందని, నగరంలో సురక్షితమైన, అనుకూలమైన పని వాతావరణం ఉంటుందని తాము హామీ ఇచ్చి భరోసా కల్పించినందుకే మెటా సంస్థ తన అతిపెద్ద కేంద్రం ఏర్పాటుకు హైదరాబాద్‌ను ఎంచుకుందని కేటీఆర్ గుర్తు చేశారు. సోషల్ మీడియా ఖాతాలను మెటా నిలిపివేయడాన్ని నిరసిస్తూ యూత్ కాంగ్రెస్ మూర్ఖులు ఆ కార్యాలయాన్ని ధ్వంసం చేయడం గొప్ప విషయంగా భావించడమే కాక దాన్ని బహిరంగంగా గొప్పగా చెప్పుకోవడం కాంగ్రెస్ పార్టీ తీరుకు నిదర్శనమని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తన మూడేళ్ల పాలనలో మెటా వంటి ఒక్క పెద్ద అంతర్జాతీయ బ్రాండ్‌నైనా హైదరాబాద్‌కు తీసుకురాగలిగిందా అని కేటీఆర్ ప్రశ్నించారు. కంపెనీలను భారత్‌కు తీసుకురావడానికి గూండాయిజమే మార్గమని రాహుల్ గాంధీ భావిస్తున్నారా అని నిలదీశారు. తెలంగాణలో అధికారంలో ఉన్న మీ పార్టీ కూడా ఇదే తరహాలో గూండాయిజం చేస్తూ కంపెనీలను తీసుకొచ్చే కొత్త విధానానికి శ్రీకారం చుట్టారా అని రాహుల్ గాంధీని కేటీఆర్ ప్రశ్నించారు.

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prajatantra News