Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మీ టార్గెట్‌ను మీరే తగ్గించుకుంటారా?

మీ టార్గెట్‌ను మీరే తగ్గించుకుంటారా?

- కొన్ని రోజుల్లో కొనుగోళ్లు పూర్తయ్యాయని ప్రకటిస్తారేమో?- ధాన్యం కొనుగోళ్ల టార్గెట్ తగ్గింపుపై హరీష్‌రావు ఆగ్రహం

హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 29 : ఒకవైపు కోటి 41 లక్షల మెట్రిక్ టన్నుల పంట పండిందని పౌరసరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గొప్పలు చెబుతూ మరోవైపు కొనుగోలు మాత్రం 75 లక్షల మెట్రిక్ టన్నులకే పరిమితం అని చెప్పడంపై బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

చివరి గింజ వరకు కొనుగోలు చేస్తాం అంటూనే మీరు పెట్టుకున్న టార్గెట్‌ను మీరే తగ్గించడం రైతులను మోసం చేయడం కాదా అని నిలదీశారు. దేశంలోనే రికార్డు స్థాయిలో కొనుగోళ్లు చేస్తున్నామని చెప్పే ముందు 2020-21 యాసంగిలో బీఆర్ఎస్ ప్రభుత్వం 92.39 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి దేశ చరిత్రలోనే సరికొత్త రికార్డు సృష్టించిన విషయం గుర్తు పెట్టుకోవాలన్నారు. ధాన్యం కొనుగోళ్లలో పూర్తిగా విఫలమై రైతుల గోసను కప్పిపుచ్చేందుకు మీరు చేస్తున్న అబద్ధాల ప్రచారం దుర్మార్గం అని విమర్శించారు. ఒకవైపు రైతులు రోడ్లు ఎక్కి ధర్నాలు చేస్తుంటే మరోవైపు కొనుగోళ్లు సజావుగా సాగుతున్నాయని చెప్పడం సిగ్గుచేటన్నారు. వరి కుప్పల వద్ద రైతులు ప్రాణాలు కోల్పోయింది అబద్ధమా.. కొనుగోలు కేంద్రాల్లో రోజులు తరబడి రైతులు పడిగాపులు కాసింది అబద్ధమా.. తడిసిన ధాన్యంతో రైతులు నష్టపోయింది అబద్ధమా.. నెలలతరబడి కొనుగోళ్లు ఆలస్యం చేసింది అబద్ధమా.. డబ్బులు ఆలస్యంగా చెల్లించి రైతులను అప్పుల పాలుచేసింది అబద్ధమా అని ఆయన అన్నారు. హైదరాబాద్‌లో కూర్చొని ప్రసంగాలు దంచితే రైతుల గోడు తీరదు.. కొనుగోలు కేంద్రాలకు వెళ్లి రైతులు పడుతున్న కష్టాలు చూడండి.. వాళ్ల కన్నీళ్లు తుడవండి. మాటలు కట్టి పెట్టి కొనుగోళ్ల ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేమండి.. టార్గెట్లు పక్కనపెట్టి చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేయండి అని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నామన్నారు.

ఉచిత కరెంట్ ఎగవేసే పన్నాగం

రైతులకు 24 గంటల కరెంట్ అవసరం లేదు.. మూడు గంటలు చాలని ఈఆర్‌సీ ఎదుట కాంగ్రెస్ నేత, రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై హరీష్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నాయకుడి వ్యాఖ్యలు రేవంత్ ప్రభుత్వ రైతు వ్యతిరేక ముఖాన్ని బట్టబయలు చేశాయన్నారు. అమెరికా వేదికగా రేవంత్ రెడ్డి చెప్పిన మాటలను అమలు చేసే దిశగా కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. పొలం అంటే ఏమిటో.. బోరు ఆగిపోతే పంట ఎలా ఎండిపోతుందో.. రైతు రాత్రింబవళ్లు ఎలా కష్టపడతాడో తెలియని వాళ్లు మాత్రమే మూడు గంటల కరెంట్ చాలని మాట్లాడతారని ఎద్దేవా చేశారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతుకు 24 గంటల నాణ్యమైన ఉచిత కరెంట్ ఇచ్చి వ్యవసాయాన్ని దేశానికి ఆదర్శంగా నిలబెట్టిందని, కాంగ్రెస్ మాత్రం రైతును మళ్లీ చీకట్లలోకి నెట్టే ప్రయత్నం చేస్తోందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రుణ మాఫీని అటకెక్కించారని, రైతు బంధు బంద్ చేశారని, పంట బోనస్ బోగస్ చేశారని మండిపడ్డారు. పంట కొనుగోళ్లు చేయక రైతుల ప్రాణం తీస్తున్నారని విమర్శించారు. ఇవి చాలదన్నట్లు 24 గంటల కరెంట్‌ను ప్రణాళిక ప్రకారం ఖతం పట్టిస్తున్నారని ఆరోపించారు. రైతు డిస్కం వెనుక దాగి ఉన్న కాంగ్రెస్ అసలు కుట్ర ఇదేనా అంటూ అనుమానాలు వ్యక్తం చేశారు. కరెంట్ కోతలతో రైతులకు వాతలు పెట్టాలని చూస్తున్న రేవంత్ కుట్రలను యావత్ రైతాంగం గమనిస్తోందని, రైతు వ్యతిరేక ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పే రోజు దగ్గరలోనే ఉందని జోస్యం చెప్పారు.

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prajatantra News