Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నా పర్యటనల్లో ప్రజలకు ఇబ్బందులు కలగొద్దు

నా పర్యటనల్లో ప్రజలకు ఇబ్బందులు కలగొద్దు

హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 6: తన పర్యటనల సమయంలో సామాన్య ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా చూడాలని, ప్రజలను గంటలతరబడి రోడ్లపై నిలపవద్దని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి డీజీపీ సీవీ ఆనంద్‌కు సూచించారు.

ముఖ్యమంత్రి బుధవారం దిల్లీ వెళ్తున్న క్రమంలో విమానాశ్రయం సమీపంలో భారీగా వాహనాలు నిలిచిపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కాన్వాయ్ కోసం సాధారణ ప్రజల పనులకు ఆటంకం కలిగించవద్దని, వెళ్లే దారితోపాటు ఎదురుగా వస్తున్న వాహనాలను కూడా ఆపివేసి ప్రజలను ఇబ్బంది పెట్టవద్దంటూ సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల నేపథ్యంలో డీజీపీ ఆనంద్ రాష్ట్రవ్యాప్తంగా పోలీసు కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి కీలక దిశానిర్దేశం చేశారు. ట్రాఫిక్ సమస్యపై ముఖ్యమంత్రి పదేపదే మాట్లాడాల్సి రావడం సమస్య తీవ్రతను తెలియజేస్తోందని, క్షేత్రస్థాయి అధికారులు దీనిని సీరియస్‌గా తీసుకోవాలని ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా ట్రాఫిక్ క్రమబద్ధీకరణను పటిష్టం చేసేందుకు అడిషనల్ డీజీపీ ఆధ్వర్యంలో త్వరలోనే 'ట్రాఫిక్ బ్యూరో' ఏర్పాటు చేస్తున్నామని, విధివిధానాలను రూపొందిస్తున్నామని డీజీపీ వెల్లడించారు. ముఖ్యమంత్రి కాన్వాయ్ వెళ్లే సమయంలో ట్రాఫిక్‌ను పూర్తిగా నిలిపివేయకుండా సింగిల్ లైన్‌గా విభజించి వాహనాలను పంపేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని, వాహనాల రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు ప్రత్యామ్నాయ మార్గాలను ముందుగానే సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఎయిర్‌పోర్టు పరిసర ప్రాంతాల్లో అత్యంత అప్రమత్తంగా ఉండాలన్నారు. రానున్న వర్షాకాలం దృష్ట్యా రోడ్లపై నీరు నిలిచే ప్రాంతాల్లో ట్రాఫిక్ జాం కాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ట్రాఫిక్ అధికారులు క్షేత్రస్థాయిలో ఉండి సత్వర నిర్ణయాలు తీసుకోవాలని, సిబ్బందిలో ఆత్మవిశ్వాసాన్ని నింపాలని డీజీపీ సూచించారు. ఔటర్ రింగ్ రోడ్డుపై అక్రమ పార్కింగ్ లేకుండా చూడాలని, ఐఎస్‌డబ్ల్యూ, సీఎస్‌డబ్ల్యూ విభాగాలతో సమన్వయం చేసుకుంటూ శాంతిభద్రతల విభాగం అధికారులు కూడా ట్రాఫిక్ నియంత్రణలో భాగస్వాములు కావాలని స్పష్టం చేశారు. ఈ వీసీలో హైదరాబాద్ సీపీ వి.సి.సజ్జనార్, సైబరాబాద్ సీపీ ఎం.రమేష్, మల్కాజిగిరి సీపీ బి.సుమతి, ఫ్యూచర్ సిటీ జాయింట్ సీపీ చందనా దీప్తి, రైల్వేలు, రోడ్డు సేఫ్టీ ఐజీపీ రమేష్ నాయుడు, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పోలీస్ కమిషనర్లు, ఐఎస్‌డబ్ల్యూ ఓఎస్డీ కమలాసన్ రెడ్డి, సీఎంఎస్జీ ఎస్పీ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prajatantra News