Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నైపుణ్యాల పేరిట ఉన్నత సాంకేతిక విద్యకు ఉరి!

నైపుణ్యాల పేరిట ఉన్నత సాంకేతిక విద్యకు ఉరి!

రాష్ట్రంలో పాలిటెక్నిక్ విద్యార్థుల ఆందోళనలు రోజురోజుకూ ఉధృతమవుతున్నాయి. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు జాతీయ రహదారిపై బైఠాయించి నిర్వహించిన భారీ ధర్నా, తదనంతర అరెస్టులు రాష్ట్రంలో నెలకొన్న విద్యా సంక్షోభానికి అద్దం పడుతున్నాయి.

కేవలం పటాన్‌చెరులోనే కాకుండా కొత్తగూడెం, రామంతపూర్, వికారాబాద్, నల్గొండ వంటి పలు ప్రాంతాల్లో జాతీయ రహదారుల దిగ్బంధం వరకు ఈ నిరసనలు వెళ్లాయంటే.. విద్యార్థి లోకంలో గూడుకట్టుకున్న అభద్రతాభావం ఎంత తీవ్రంగా ఉందో ప్రభుత్వం గ్రహించాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన జీఓ నంబర్ 97 ఈ వివాదానికి కేంద్ర బిందువుగా మారింది.

ఈ జీఓ ద్వారా కార్మిక, ఉపాధి, శిక్షణ శాఖను 'శక్తి' శాఖగా మారుస్తూ, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలను ప్రతిష్టాత్మక 'యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ' పరిధిలోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. పైకి ఇది నైపుణ్యాభివృద్ధికి సంబంధించిన సంస్కరణగా కనిపిస్తున్నప్పటికీ, దీని వెనుక దాగున్న విద్యాపరమైన మార్పులు విద్యార్థులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తి చేసిన విద్యార్థులు ఈసెట్ ద్వారా నేరుగా బీటెక్ సెకండ్ ఇయర్ లోకి ప్రవేశించే సువర్ణావకాశాన్ని కోల్పోతామని వారు తీవ్రంగా భయపడుతున్నారు. నైపుణ్యాల పేరిట కాలేజీలను ప్రైవేట్ సంస్థల గుత్తాధిపత్యంలోకి నెట్టే ప్రమాదం ఉందని, తద్వారా ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి సంక్షేమ పథకాలు నిలిచిపోయే అవకాశం ఉందని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. సాంకేతిక విద్యా మండలి (ఎస్‌బీఐటీఈటీ) స్వయంప్రతిపత్తి దెబ్బతింటుందని, డిప్లొమా కోర్సులు కేవలం ఐటీఐ తరహా నైపుణ్య శిక్షణలుగా మారిపోయే ప్రమాదం ఉందని వారు వాదిస్తున్నారు. అదీ కాకుండా యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి ఇంకా పూర్తిస్థాయిలో సొంత భవనాలు, నిధులు సమకూరలేదు.

ఈ తరుణంలో సుమారు 60 కి పైగా సుప్రీం, ప్రతిష్టాత్మక ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల స్థలాలను, ల్యాబ్‌లను, నిధులను స్కిల్ యూనివర్సిటీ అవసరాల కోసం ప్రభుత్వం మళ్లించే ప్రయత్నం చేస్తుందనే వాదన బలంగా ఉంది. కొత్తగా స్థాపించిన స్కిల్ యూనివర్సిటీకి అవసరమైన శాశ్వత భవనాలు, ల్యాబ్ వసతులు ఇంకా పూర్తిస్థాయిలో సిద్ధం కాకముందే.. దశాబ్దాల చరిత్ర గల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల మౌలిక సదుపాయాలను, నిధులను దీనికి అనుసంధానం చేయాలని చూడటం ఉన్నతస్థాయి సాంకేతిక విద్యను పక్కదారి పట్టించడమే అవుతుంది. విద్యావ్యవస్థలో ఇంత పెద్ద మార్పు (మేజర్ స్ట్రక్చరల్ రీఫార్మ్) తీసుకువొచ్చేటప్పుడు.. విద్యావేత్తలు, అధ్యాపక సంఘాలు, విద్యార్థి సంఘాలు లేదా ఇండస్ట్రీ నిపుణులతో ముందస్తుగా కూలంకష చర్చలు జరిపి వారి అభిప్రాయాలను తీసుకుని ఉంటే , సముచితమైన పరిష్కారం లభించడానికి వీలుండేది. అట్లా కాకుండా ప్రభుత్వం ఏకపక్షంగా జీఓను జారీచేయడం వివాదానికి కారణమైంది. ఈ పారదర్శకత లోపమే నేడు విద్యార్థుల్లో తీవ్ర అభద్రతాభావాన్ని, ఆగ్రహాన్ని కలుగజేస్తున్నది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏ మార్పు తీసుకురావాలను కున్నా సంబంధిత రంగానికి చెందిన నిపుణులు, మేధావులతో చర్చించి సాధ్యాసాధ్యాలు అంచనాలు వేసి అడుగు ముందుకేసే ఆనవాయితీని గత ప్రభుత్వాలు పాటిస్తూ వొచ్చాయి. కానీ రేవంత్ ప్రభుత్వం ఇందుకు భిన్నంగా వ్యవహరించడంతో, విద్యార్థుల్లో తమ భవిష్యత్తు పట్ల ఆందోళన వ్యక్తం కావడానికి కారణమైంది. ఒక్కమాటలో చెప్పాలంటే ఏకపక్షంగా జీఓ జారీ చేయడమే విద్యార్థుల్లో నమ్మకరాహిత్యానికి కారణం.

పాలిటెక్నిక్ కళాశాలల మౌలిక సదుపాయాలను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి అనుసంధానించడం ఉన్నత సాంకేతిక విద్యను నీరుగార్చడం తప్ప మరోటి కాదు. విద్యావ్యవస్థలో ఇంతటి కీలకమైన మార్పులు తెచ్చేటప్పుడు కనీసం విద్యావేత్తలు, అధ్యాపక సంఘాలు, విద్యార్థి సంఘాలతో ముందస్తుగా ఎలాంటి బహిరంగ చర్చలు లేదా అభిప్రాయ సేకరణ జరపకపోవడం ప్రభుత్వ ఏకపక్ష వైఖరిని సూచిస్తున్నది .నైపుణ్యాభివృద్ధిని పెంచాలనే ప్రభుత్వ సంకల్పం మంచిదే అయినప్పటికీ, అది ఉన్న విద్యావ్యవస్థను ధ్వంసం చేసేలా ఉండకూడదు. పారిశ్రామిక అవసరాల కోసం సాంకేతిక డిప్లొమా కోర్సులను కేవలం ఐటీఐ తరహా శిక్షణలుగా మార్చే ప్రయత్నాలను విద్యార్థి లోకం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. ప్రభుత్వం ఇప్పటికైనా పట్టుదలకు పోకుండా క్షేత్రస్థాయి వాస్తవాలను గ్రహించాలి.

తమ భవిష్యత్తు కోసం శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులను పోలీసులు బలవంతంగా ఈడ్చుకెళ్లడం, అరెస్టులు చేయడం ప్రజాస్వామ్య పద్ధతి అనిపించుకోదు. విద్యార్థుల సమస్యలను శాంతిభద్రతల సమస్యగా చూడటం ప్రభుత్వాల వైఫల్యానికి నిదర్శనం. ప్రతిపక్షాలు సైతం ఈ నిరసనలకు మద్దతు తెలుపుతుండటంతో, ఇది క్రమంగా పెద్ద రాజకీయ ఉద్యమంగా మారే ముప్పు పొంచి ఉంది.ప్రభుత్వం 'టాస్క్ ఫోర్స్' కమిటీని వేస్తామని ప్రకటిస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో విద్యార్థులకు నమ్మకం కలగడం లేదు. కేవలం ఒక నివేదికతో సరిపెట్టకుండా, ముందుగా జీఓ 97 పై విద్యాశాఖ ఉన్నతాధికారులు విద్యార్థి జేఏసీ (జేఏసీ) ప్రతినిధులతో ముఖాముఖి చర్చలు జరపాలి. పాలిటెక్నిక్ విద్యార్థుల ఈసెట్ (ఈసీఈటీ) హక్కులకు, వారి ఉన్నత విద్యా అవకాశాలకు ఎలాంటి ధోకా ఉండదని స్పష్టమైన లిఖితపూర్వక హామీ ఇవ్వాలి. సంస్కరణలు విద్యావ్యవస్థను మెరుగుపరచడానికి ఉండాలి కానీ, విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేలా ఉండకూడదు. ప్రభుత్వం ఇప్పటికైనా మొండివైఖరి వీడి, విద్యార్థి లోకానికి న్యాయం చేయాలి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prajatantra News