Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఒక కార్డు.. ఎన్నో సేవలు

ఒక కార్డు.. ఎన్నో సేవలు

- ప్రభుత్వ సేవల్లో పారదర్శకతకే యూనిఫైడ్ కార్డు- సీఎస్ రామకృష్ణారావు

హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 29: ప్రభుత్వ సేవలను మరింత సులభతరం చేయడం, పారదర్శకతను పెంపొందించడం, డిజిటల్ సేవలను ఒకే వేదికపై అందించడమే యూనిఫైడ్ స్మార్ట్ కార్డు ప్రధాన ఉద్దేశమని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు తెలిపారు.

పౌరులకు వివిధ ప్రభుత్వ శాఖల సేవలు ఒకే కార్డుతో అందుబాటులోకి తీసుకురావాలని, వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న స్మార్ట్ కార్డు విధానాన్ని అధ్యయనం చేయాలని సూచించారు. ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో వివిధ శాఖల ఉన్నతాధికారులతో రామకృష్ణారావు శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒకే కార్డు-అన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ది అనే విధానంతో యూనిఫైడ్ వెల్ఫేర్ కార్డును రూపకల్పనకు కార్యాచరణను రూపొందించాలని అధికారులను సీఎస్ ఆదేశించారు. రేషన్, పెన్షన్, మహాలక్ష్మి, తదితర అన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఆ కార్డుకు అనుసంధానించి ప్రజలకు అందించే సేవలను సులభతరం చేయాలని, అలాగే ప్రజల డేటా భద్రత, గోప్యతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. దీనిపై తగు ప్రణాళికను రాబోయే పది రోజుల్లోగా సిద్ధం చేయాలని సీఎస్ సూచించారు. జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు, పెన్షన్ డేటా, ఆరోగ్య ప్రొఫైల్ వంటి సమాచారం కూడా ఈ కార్డుకు అనుసంధానం చేసే అవకాశాలను కూడా పరిశీలించాలన్నారు. సమావేశంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు వికాస్ రాజ్, సబ్యసాచి ఘోష్, ముఖ్య కార్యదర్శులు సందీప్ కుమార్ సుల్తానీయా, శైలజా రామయ్యర్, యోగితారాణా, క్రిస్టినా చొంగ్తు, సిజిజి ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ రవిగుప్తా, కార్యదర్శులు గౌరవ్ ఉప్పల్, రఘునందన్ రావు, సమాచార, పౌరసంబంధాలశాఖ స్పెషల్ కమిషనర్ డాక్టర్ జి.ముకుందరెడ్డి, పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, సంయుక్త కార్యదర్శి (ఐటీఈ అండ్ సీ) అనుదీప్ తదితరులు పాల్గొన్నారు.

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prajatantra News