Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

ఒక మానసిక యాత్ర

తెలుగు సాహిత్యంలో బుచ్చిబాబు రాసిన 'చివరికి మిగిలేది' కేవలం ఒక కథను చెప్పిన నవల మాత్రమే కాదు, అది ఒక మనిషి అంతరంగపు నిశ్శబ్ద చరిత్ర.

బాహ్య ప్రపంచం ఎంత హంగామాగా కోలాహలంగా ఉన్నా, మనసు లోపల జరిగే సంఘర్షణలు మాత్రం నిశ్శబ్దంగానే రగులుతాయి అన్న సత్యాన్ని 'చివరకు మిగిలేది' ఎంతో సున్నితంగా హృద్యంగా చిత్రించింది. 'చివరికి మిగిలేది'లో దయానిధి ప్రయాణం, ఎవరో ఒకవ్యక్తి జీవన ప్రయాణమే కాదు, అంతకంటే ఎక్కువ. అది మానసికయాత్ర. ప్రేమ, అపరాధ భావన, ఒంటరితనం, స్వీయవిమర్శ ఇవన్నీ ఒకే సమయంలో అతని అంతరంగంలో మెల్లగా నీడల్లా పెరుగుతూ పోతూ దర్శనమిస్తాయి. బుచ్చిబాబు దయానిధి పాత్రను తీర్చిదిద్దిన తీరుచూస్తే మనిషి బయట ప్రవర్తన కంటే లోపల జరిగే ఆలోచనలు సంఘర్షణలు ఎంత గాఢంగా ఉంటాయో అర్థమవుతుంది. చివరికి మిగిలేది నవల రీడర్లో ఒక ప్రశ్నను లేవనెత్తుతుంది మనిషి జీవితంలో చివరికి ఏమిమిగులుతుంది. విజయమా, ప్రేమా, లేక అతడు తనతోతానే చేసుకున్న నిశ్శబ్దసంభాషణల జాడలా లేక నీడలా ?

చివరికి దయానిధి గ్రహించింది కూడా బయట ప్రపంచాన్ని జయించడం కంటే, మనసులోని అంధకారాన్ని ఎదుర్కోవడం చాలా కష్టం అని. చివరికి అతను కోల్పోయింది మనుషులను కాదు, తనలోని ప్రశాంతతను. చివరికి మిగిలేది మనకు చెప్పేకథ సున్నితమైనదే కాని కఠినమైన నిజం, జీవితం మొత్తం పరుగెత్తిన తరువాత, మనిషి దగ్గర మిగిలేవి కొన్నిజ్ఞాపకాలు, కొన్ని పశ్చాత్తాపాలు మాత్రమే. ముఖ్యంగా తనతో తానే చేసుకున్న అంతులేని సంభాషణ. బుచ్చిబాబు తీసుకున్న వస్తువులోనూ, ఆ వస్తువును నవలగా మలచిన శిల్పం లోను కొత్తదనం ఉంది. దయానిది అంతరంగమే నవలకు వస్తువు నవలలో బుచ్చిబాబు సృష్టించిన పాత్రలు దయానిధి, కోమలి, అమృతం తమ కలల్ని, కన్నీళ్ళని, గాథల్ని, బాధల్ని మనతో శాశ్వతంగా పంచుకుంటారు. ఎప్పటికీ తరిగిపోని సౌందర్యంతో విలసిల్లే నిలిచిపోయే నవల చివరకు మిగిలేది. ఇందులో కోమలి దయానిధి జీవితంలోకి ఒక సంఘటనగా రాదు, అనుభూతిగా ప్రవేశిస్తుంది. ఆమె ప్రేమలో ఆత్మీయత, కానీ అది ఆప్యాయతకు మించి నిశ్శబ్దమయిన అంకితతత్వం. తనను తాను పూర్తిగా అర్పించుకునే స్వభావం ఆమెది. అదే ఆమెను బాధల్లోకి నెట్టే కారణం కూడా అదే అవుతుంది.

కోమలి మనసు పైకి తేలికైన పూలరేకుల్లా కనిపించినా, లోపల మాత్రం అర్థంకాని ఆవేదనల భారంతో నిండిపోయి ఉంటుంది. ఆమె ప్రేమలో స్వార్థం లేదు కానీ ఆ స్వార్థరాహిత్యం, ఆమెను మరింత ఒంటరిగా మారుస్తుంది. ఆమె ఎదురుచూపుల్లో ఒక మౌన వేదన ఉంది. దయానిధి చెప్పే సమాధానాల్లో అపరాధభావం ధ్వనిస్తుంది. 'ప్రేమ ఎప్పుడూ ఇద్దరిని కలపదు, కొన్నిసార్లు అది ఇద్దరినీ వారి వారి ఒంటరితనాల్లోకి మరింతగా నెట్టేస్తుంది' అన్న సత్యాన్ని కోమలి ఇక్కడ బయటపెడుతుంది. చివరికి మిగిలేది ఏమిటంటే ఒక అసంపూర్ణ ప్రేమ కథ కాదు ఒక అంతర్లీనమైన మౌనం. బుచ్చిబాబు అనేక సాహితీ ప్రక్రియల్లో రాసినప్పటికీ తను ప్రథమంగా కథకుడు. తెలుగు కథానికను మళ్ళీ మళ్ళీ చదివించేలా రాసిన కథకుడు. ఆయన కథల్లో గొప్ప కవితావేశం, కళాత్మకత, సౌందర్య దృష్టి, మనో విశ్లేషణ కనిపిస్తాయి. దాదాపుగా ఆయన కథలన్నింటిలోనూ ప్రధాన వస్తువు మానవుడి అంతరంగం. నన్ను గురించి కథ వ్రాయవూ అన్న కథలో కుముదం, అరకు లోయలో కూలిన శిఖరంలో మూనా, చివరకు మిగిలేదిలో కోమలి ఈ పాత్రలంటే నాకెంతో ఇష్టం అన్నాడు ఒకసారి బుచ్చిబాబు.

బుచ్చిబాబు అసలు పేరు 'శివరాజు వెంకట సుబ్బారావు'. ఆయన పెట్టుకున్న కలం పేరు 'బుచ్చిబాబు'. 14 జూన్, 1916లో జన్మించిన బుచ్చిబాబు తొలి రోజుల్లో 'సంతోష్ కుమార్' పేరుతో ఆంగ్ల రచనలు చేసారు. 'తన వ్యక్తిత్వాన్ని దిగమింగి అహాన్ని జయించటంలోనే కళాకారుడి పురోగమనం ఉందన్న సూత్రాన్ని నేను స్వీకరిస్తాను' అన్నాడు బుచ్చిబాబు. ఆయన 1941 లో నాగపూర్ విశ్వవిద్యాలయం నుండి ఎం.ఏ. పట్టాపొంది, కొంతకాలం అనంతపురం మరియు విశాఖపట్నం కళాశాలల్లో ఆంగ్ల ఉపన్యాసకుడుగా పనిచేసారు. 1945 నుండి మద్రాసు ఆకాశవాణిలో పనిచేస్తూ, తనదైన శైలిలో ఎన్నో మంచి కార్యక్రమాలకు రూపకల్పన చేశారు. రేడియో నాటకం ఎన్ని రకాలుగా రూపొందించవచ్చో, అన్ని రకాలుగా రూపొందించి శ్రోతల మనసును రంజింప చేశాడు. ఏదో ఒక ఒరవడిలో కొట్టుకుపోవడం కాకుండా ఎప్పుడు ఒక నూతనత్వం కోసం వెతకడం ఆయన నైజం. ఇంకా బుచ్చిబాబు 'నన్ను మార్చిన పుస్తకం', 'నేను మరియు శంకర్ నారాయణ్ నిఘంటువు' వంటి వ్యాసాలు రాశారు. పలు నాటకాలూ రాసారు. ఆయన రాసిన 'మేడమెట్లు', 'నన్ను గూర్చి కథ వ్రాయవూ', కలలో జారిన కన్నేరు, 'నిరంతర త్రయం', 'తీర్పు చేసిన వాడికే శిక్ష', 'జ్ఞాన నేత్రం', 'తడిమంటకి పొడినీళ్లు' మొదలైన కథా సంపుటాల్లోని అనేక కథలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయి. బుచ్చిబాబు కథల్లో కనిపించే మరో లక్షణం మానవ జీవితాన్ని గురించిన అనేక వ్యాఖ్యానాల్ని, సూక్తుల్ని ఆయన పాత్రల నోటివెంట వినిపించడం. బుచ్చిబాబు రాసినకథల్లోనూ ఆయన రాసిన నవలలోనూ ప్రకృతి వర్ణనలు చాలా ఎక్కువగా కవిత్వంలాగా ఉంటాయి. మొత్తంమీద బుచ్చిబాబు ఒక నవల, 80 కి పైగా కథలు, 20 కి పైగా నాటకాలు నాటికలు, ఒక కవితా సంకలనం, 40 కి పైగా సాహిత్య వ్యాసాలు రాసారు. ఆయన 20 సెప్టెంబరు, 1967 న మరణించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prajatantra News