Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పాలమూరు ప్రాజెక్టులు పూర్తి చేయడమే లక్ష్యం

పాలమూరు ప్రాజెక్టులు పూర్తి చేయడమే లక్ష్యం

- యుద్ధప్రాతిపదికన భూసేకరణ పూర్తి చేయాలని ఆదేశం- నిధులకు ఢోకా లేదన్న సీఎం రేవంత్
- ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలతో కీలక భేటీ
- ప్రతిపక్షాల పాదయాత్రల ప్రకటనల వేళ అధికార పక్షం దూకుడు

మహబూబ్ నగర్ ,ప్రజాతంత్ర, మే 19 : ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సాగునీటి ప్రాజెక్టుల సాధనే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేగంగా వేస్తోంది. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి, లక్ష్మారెడ్డి, శ్రీనివాస్ గౌడ్ నేతృత్వంలో ప్రతిపక్ష బీఆర్ఎస్ నాయకులు నర్లాపూర్ నుండి ఉదండాపూర్ వరకు పాదయాత్ర చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో అధికార పక్షం తక్షణమే రంగంలోకి దిగింది. హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభవృద్ధి సంస్థ కార్యాలయం వేదికగా ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన మంత్రులు, అధికారపక్ష ఎమ్మెల్యేలతో అత్యవసర కీలక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతోపాటు జిల్లాలోని ఇతర పెండింగ్ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయడమే ధ్యేయంగా సీఎం ఈ భేటీలో దిశా నిర్దేశం చేశారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పురోగతిపై సీఎం రేవంత్ సుదీర్ఘంగా చర్చించారు. ప్రాజెక్టుకు ప్రధాన అడ్డంకిగా మారిన భూసేకరణ ప్రక్రియను మంత్రులు, ఎమ్మెల్యేలు దగ్గరుండి, యుద్ధప్రాతిపదికన పూర్తి చేయించాలని ఆదేశించారు. భూసేకరణకు సంబంధించి నిధుల కొరత లేకుండా చూస్తామని, పరిహారం చెల్లింపుల్లో ఎలాంటి జాప్యం జరగకుండా వెంటనే నిధులు విడుదలయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. అలాగే జిల్లాలోని ఇతర సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన పెండింగ్ బిల్లులను చెల్లించేందుకు సైతం ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై జిల్లా మంత్రులు నిరంతరం అధికారులతో సమీక్షలు నిర్వహించాలని, పనుల పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అడ్డంకులను తొలగించాలని సూచించారు.

జిల్లా సమస్యలపై సానుకూల స్పందన

ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు సాగునీటి రంగంతోపాటు జిల్లాలో నెలకొన్న ఇతర స్థానిక సమస్యలను, నియోజకవర్గాల వారీగా ఉన్న పెండింగ్ పనులను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. వీటిపై సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. జిల్లా సమస్యల పరిష్కారం, అభివృద్ధి పనుల పురోగతిపై మంత్రుల ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులు తరచూ తనను కలిసి చర్చించాలని సూచించారు. ఈ ఉన్నతస్థాయి భేటీలో రాష్ట్ర మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యేలు కసిరెడ్డి నారాయణరెడ్డి, మధుసూదన్ రెడ్డి, మేఘా రెడ్డి, రాకేశ్ రెడ్డి, వంశీకృష్ణ, వీర్లపల్లి శంకరయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డిలతోపాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

'ప్రజాతంత్ర'లో విశ్లేషణ కథనం.. ప్రతిపక్షాల పాదయాత్రకు కౌంటర్ వ్యూహం?

కొద్ది రోజుల క్రితమే మహబూబ్‌నగర్ జిల్లా ప్రాజెక్టులు, బీఆర్ఎస్ నాయకుల పాదయాత్రల గురించి ప్రజాతంత్ర పత్రికలో విశ్లేషణాత్మక కథనం వచ్చిన సంగతి విదితమే. మాజీ మంత్రులు సాగునీటి ప్రాజెక్టులపై ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఉదండాపూర్ వరకు పాదయాత్రకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రతిపక్షాలు ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేలోపే క్షేత్రస్థాయిలో భూసేకరణను పూర్తి చేసి నిధులు విడుదల చేయడం ద్వారా ప్రాజెక్టులను తామే పరుగులు పెట్టిస్తున్నామని నిరూపించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ వ్యూహాత్మక భేటీ నిర్వహించినట్లు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఏది ఏమైనప్పటికీ సీఎం తాజా ఆదేశాలతో పాలమూరు ప్రాజెక్టుల పనుల్లో కదలిక రానుండటం జిల్లా రైతాంగానికి సానుకూల అంశమేనని చెప్పవచ్చు.

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prajatantra News