Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పార్లమెంటరీ విలువలే ప్రధానం

పార్లమెంటరీ విలువలే ప్రధానం

- చట్టసభలను స్తంభింపజేయడం ప్రజలను అగౌరవపరచడమే- తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్, బీఆర్ఎస్ తీరు అప్రజాస్వామికం
- కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
- దిల్లీలో 16 మంది ఎంపీలకు సంసద్ రత్న అవార్డుల ప్రదానం

న్యూదిల్లీ, సెప్టెంబర్ 9: ప్రజాస్వామ్య దేవాలయాలైన చట్టసభల్లో పార్టీల కంటే పార్లమెంటరీ విలువలే ప్రధానమని, ప్రజాప్రతినిధుల ప్రవర్తనలో మార్పు రావాల్సిన అవసరం ఉందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. న్యూఢిల్లీలో ప్రైమ్ పాయింట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన 'సంసద్ రత్న' అవార్డుల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన కీలక ప్రసంగం చేశారు. ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శలు చేయాలి, ప్రశ్నించాలి కానీ చట్టసభలను అడ్డుకోవడం సరికాదు. ఒకప్పటి హుందాతనం లోపించి రాజకీయ విలువలు దిగజారుతుండటం భవిష్యత్ తరాలకు తప్పుడు సందేశం ఇస్తోంది. ఇటీవల తెలంగాణ అసెంబ్లీలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ వ్యవహరించిన తీరు అత్యంత అప్రజాస్వామికంగా ఉందని విమర్శించారు. చొక్కాలు విప్పామని, విప్పించామని సంబరపడటం ప్రజాస్వామ్య వ్యవస్థకే చేటు తెస్తుందని మండిపడ్డారు.

స్పీక్ ఔట్.. లేదా వాకౌట్

ప్రభుత్వ తీరు నచ్చకపోతే సునిశితంగా విమర్శించాలి (స్పీక్ ఔట్), లేదంటే వాకౌట్ చేయాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చెప్పేవారని, కానీ నేటి విపక్షాలు సభలో గందరగోళం సృష్టించడంపైనే దృష్టి పెట్టాయని ఆవేదన వ్యక్తం చేశారు.పార్టీల సిద్ధాంతాలు వేరైనా దేశ ప్రయోజనాల విషయంలో అంతా ఏకతాటిపై నిలబడాలి. ఎన్నికల కమిషన్ వంటి స్వతంత్ర రాజ్యాంగ సంస్థలపై నిరాధార ఆరోపణలు చేసి ప్రజల్లో వాటిపై నమ్మకం పోగొట్టడం సరికాదని హితవు పలికారు.

నా ఎదుగుదల ప్రజాస్వామ్య గొప్పదనమే

సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చిన తాను ఈ స్థాయికి ఎదగడం భారత ప్రజాస్వామ్య గొప్పదనమేనని ఆయన అన్నారు. వాజపేయి, పీవీ నరసింహారావు లాంటి వారి స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చిన తాను.. ఏనాడూ అసెంబ్లీ వెల్‌లోకి అడుగుపెట్టలేదని, సభ జరిగిన ప్రతిరోజూ హాజరయ్యానని గుర్తు చేశారు. కార్యక్రమంలో వివిధ పార్టీలకు చెందిన 16 మంది ఎంపీలకు 'సంసద్ రత్న' అవార్డులను అందజేశారు. ఈ వేడుకలో కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి డాక్టర్ సుకాంత్ మజూందార్, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్, మాజీ మంత్రి హన్సరాజ్ గంగారాం ఆహిర్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు.

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prajatantra News