Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పెరుగుతున్న యువ విద్యార్థుల ఆత్మహత్యలు

పెరుగుతున్న యువ విద్యార్థుల ఆత్మహత్యలు

"2020లో ప్రతి 42 నిమిషాలకు ఒక విద్యార్థి చొప్పున ఆత్మహత్యకి పాల్పడనట్టు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) గణాంకాలు చెప్తున్నాయి.

అంటే రోజుకు సగటున 34 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఎన్సీఆర్బీ వారి 'యాక్సిడెంటల్ డెత్ అండ్ సూసైడ్ ఇన్ ఇండియా 2021' నివేదిక ప్రకారం 2020లో నమోదైన 12,526 మరణాలతో పోలిస్తే ఇది 4.5 శాతం అధికం. ఇందులో 864 ఆత్మహత్యలకు "పరీక్షలలో ఫెయిల్" కావడం అనేది ప్రధాన కారణం."

భారతదేశంలోని 140 కోట్ల జనాభాలో 50 శాతానికి పైగా 25 ఏళ్లలోపు యువజనమే ఉన్నారు. ఈ యువశక్తే మన దేశ ప్రయోజనంలో కీలకాంశమని భావిస్తారు. కానీ ఆందోళన కలిగిస్తున్న విషయం ఏమిటంటే ఇటీవలి సంవత్సరాలలో యువత ఆత్మహత్యలు బాగా పెరుగుతున్నాయి. 2025 మార్చిలో ప్రచురించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం ఆత్మహత్యల కారణంగా ప్రతి ఏటా 7,20,000 మందికి పైగా మరణిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా జరిగే ఆత్మహత్యలలో 73 శాతం పేద- అభివృద్ధి చెందుతున్న దేశాలలోనే జరుగుతున్నాయి. అలాగే 15 నుంచి 29 ఏళ్ల మధ్య వయస్కులలో మరణానికి ఆత్మహత్య అనేది మూడవ ప్రధాన కారణమని ఆ నివేదిక సూచిస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం భారతదేశంలో సగటు ఆత్మహత్యల రేటు ప్రతి లక్ష జనాభాకు 10.9గా ఉంది. మరో విషాదం ఏమిటంటే అత్యధిక యువత ఆత్మహత్యల రేటు మనదేశంలోనే నమోదవుతోంది. ఆత్మహత్యలకు కారణాలు బహుముఖమైనవి.. సామాజిక, సాంస్కృతిక, జీవసంబంధ, మానసిక, పర్యావరణం వంటి విషయాలు వీటిని ప్రభావితం చేస్తుంటాయి.

ఆత్మహత్యలను అర్థం చేసుకోవడానికి ఫ్రెంచ్ సామాజికవేత్త ఎమిలే డర్కీమ్ ప్రతిపాదించిన సిద్ధాంతం ఎంతో ప్రాధాన్యత కలిగినది. ఆత్మహత్యలను నాలుగు విస్తృత రకాలుగా డర్కీమ్ గుర్తించారు, అవి: 1. అహంకారపూరితం. 2. పరోపకార ధోరణి. 3. నిస్సహాయత 4. విధిరాత అనుకోవడం. ఈ నాలుగు రకాలను, వాటికి దారితీసే కారణాలను సామాజిక అనుసంధానం, సామాజిక నియంత్రణ అనే రెండు విడి అస్తిత్వాలలో మారుతున్న విలువల ఆధారంగా వివరిస్తారు. ఆయన సిద్ధాంతం ప్రకారం ఒక వ్యక్తికి ఇతరులతో సంబంధాలు దెబ్బతిని, తగినంత సామాజిక మద్దతు కొరవడినప్పుడు అహంతో కూడిన ఆత్మహత్య సంభవిస్తుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prajatantra News