Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పెట్రో ధరల పెంపు.. ప్రజలపై పిడుగు

పెట్రో ధరల పెంపు.. ప్రజలపై పిడుగు

- ఈ నిర్ణయంతో అనేక రంగాలపై వ్యతిరేక ప్రభావం- ధరల పెంపు దారుణం అంటూ 'ఎక్స్‌'లో సీఎం రేవంత్ పోస్ట్

హైదరాబాద్, ప్రజాతంత్ర, మే16: పెట్రో ధరల పెంపు వల్ల నిత్యావసరాల ధరలు పెరిగి సామాన్యుల పాలిట పిడుగుపాటు అవుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.

నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న పెట్రోల్, డీజిల్ ధరల పెంపు నిర్ణయం ఏమాత్రం సమర్థనీయం కాదని 'ఎక్స్‌' వేదికగా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం అనేక రంగాలపై వ్యతిరేక ప్రభావం చూపుతుందని తెలిపారు. మోదీ ప్రభుత్వ అసమర్థ పాలన, అనాలోచిత విధానాల కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలైందని సీఎం విమర్శించారు. ఆత్మనిర్భర్ కేవలం వోట్లు రాల్చే నినాదమే తప్ప ఫలితాలు తెచ్చిన పాలసీ కాదన్నది తేలిపోయిందని అన్నారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమలు దెబ్బతిన్నాయని, యువత ఉపాధికి గ్యారెంటీ లేని పరిస్థితి దాపురించిందని వ్యాఖ్యానించారు. రైతుల ఆదాయాలు రెట్టింపు చేస్తామన్న హామీ వట్టి మాటగా మిగిలిందన్నారు. గత పదేళ్లుగా రూపాయి విలువ పతనమవుతూ వస్తోందని, ఇప్పుడు ఆ పతనం పరాకాష్ఠకు చేరిందని అన్నారు. ఈ పరిస్థితుల్లో ఇరాన్ - ఇజ్రాయిల్ యుద్దాన్ని సాకుగా చూపి పెట్రోల్, డీజిల్ రేట్లను పెంచడం సామాన్యుల నడ్డి విరచడమే అంటూ విరుచుకుపడ్డారు. ప్రపంచంలో భారత్‌ను మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిపామని ఘనంగా ప్రకటించుకుంటున్న మోదీ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ఎలా సమర్థించుకుంటుందని రేవంత్ ప్రశ్నించారు. ఇటీవల జరిగిన నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంత ఎన్నికలకు ముందు మోదీ ప్రభుత్వం పెట్రోలియం ఉత్పత్తుల ధరలు పెంచం అని పదేపదే ప్రకటించిందని గుర్తు చేశారు. ఫలితాలు వచ్చి పది రోజులు కూడా గడవకముందే రూ.3కు పైగా ధరలు పెంచడం ప్రజల నమ్మకాన్ని వంచించడమేనని అన్నారు. కేవలం ఓట్ల కోసం, ఎన్నికల్లో విజయం కోసం మోదీ అబద్దాలు చెబుతారని ప్రజలు భావిస్తున్నారని, ఇది విశ్వాస ఘాతుకం అవుతుందని అన్నారు. పెంచిన పెట్రోలు, డీజిల్ ధరలను తక్షణం ఉపసంహరించుకోవాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.
-------------------------------------------------------

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prajatantra News