"ఇక్కడ మరో రాజకీయ ద్వంద వైఖరి కనిపిస్తోంది. 'కేసీఆర్ ఉనికి లేకుండా చేస్తాం' అని చెప్పిన అధికార నాయకులే ప్రతి రాజకీయ సందర్భంలో కేసీఆర్ పేరును ప్రస్తావించాల్సిన పరిస్థితి ఎందుకు వస్తోంది?
ఒక నాయకుడి ఉనికిని రాజకీయంగా ముగించాలంటే ప్రజల తీర్పుతోనే సాధ్యం. మాటలతో కాదు. కేసీఆర్ అసెంబ్లీకి రావాలా? రావకూడదా? అనేది రాజకీయ నిర్ణయం. కానీ ఆయన రాకపోతే ప్రభుత్వ హామీల అమలుకు ఏదైనా అడ్డంకి ఏర్పడుతుందా? ప్రజా సమస్యలపై చర్చకు ప్రతిపక్ష నాయకుడి హాజరు అవసరమే అయితే, ప్రభుత్వం సభా వేదికపై చర్చకు సిద్ధంగా ఉండాలి. ఆ పార్టీ పక్షాన ఇతర నాయకులు హాజరు అవుతున్నారు కదా! వారితో చర్చ జరపడంతో పాటు వారి ప్రశ్నలకు సమాధానం చెప్పవచ్చు కదా? ప్రతిపక్షాన్ని విమర్శించడం అధికార పార్టీ హక్కు.. కావొచ్చు . కానీ ప్రతిపక్షం అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పడం అధికార పార్టీ బాధ్యత. అధికారంలో ఉన్నవారికి బాధ్యత ఎక్కువ. ఎందుకంటే ప్రజలు ప్రశ్నించేది అధికారాన్నే. రాజకీయ పరిపక్వత అవసరం.."
(జీడిపల్లి రాంరెడ్డి)
ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ 9666680051
తెలంగాణలో గత రెండు మూడు రోజులుగా చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రజాస్వామ్యంలో నిరసనలకు స్థానం ఉంది. ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు ప్రతిపక్షానికి ఉంది. అధికార పార్టీ తన నిర్ణయాలను సమర్థించుకునే హక్కు కూడా ఉంది. కానీ ఆ రాజకీయ విభేదాలు వ్యక్తిగత దూషణలు, పరస్పర సవాళ్లు, అరెస్టులు, ఘర్షణల వరకు వెళ్లినప్పుడు మాత్రం ప్రశ్నించాల్సింది ఒక్కటే-తెలంగాణను ఎటు తీసుకెళ్తున్నారు? అసెంబ్లీ సమావేశాల ప్రారంభానికి ముందు బీఆర్ఎస్ చేపట్టిన 'వెయ్యి రోజుల పాలన-హామీల అమలు ఎక్కడ?' అనే ఆందోళన రాజకీయంగా విమర్శించవచ్చు. నల్ల టీషర్టులు ధరించి అసెంబ్లీకి రావడం కూడా ఒక నిరసన రూపమే. దానికి సమాధానం చెప్పాల్సింది ప్రభుత్వం. కానీ నిరసనకారులను అడ్డుకోవడం, పోలీసులు-ప్రజాప్రతినిధుల మధ్య తోపులాటలు చోటుచేసుకోవడం, ఒక మహిళా శాసనసభ్యురాలితో పోలీసులు వ్యవహరించిన తీరుపై విమర్శలు రావడం పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చింది.
అదే సమయంలో ఎమ్మెల్సీ తాతా మధు చేసిన వ్యాఖ్యలు కూడా సమర్థించదగినవి కావు. సభాపతి పదవికి గౌరవం ఉండాలి. ఏ ప్రజాప్రతినిధి అయినా తన మాటలకు బాధ్యత వహించాల్సిందే. అలాగే బాధ్యతాయుత పదవిలో ఉండి సభ్యుల హక్కులకు భంగం వాటిల్లకుండా కాపాడాల్సిన గురుతర బాధ్యత స్పీకర్‌పై ఉంది.. అసెంబ్లీ ముందు ఎమ్మెల్యే లకు, ఎమ్మెల్సీ లకు అవమానం జరిగితే అది స్పీకర్ కు కూడా శోభ నివ్వదు..అయితే ఒకరి వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్‌హౌస్ ముట్టడికి కొందరు కాంగ్రెస్ నాయకులు పిలుపునివ్వడం సమస్యకు పరిష్కారం ఎలా అవుతుంది? వ్యక్తి చేసిన వ్యాఖ్యకు వ్యక్తిగతంగా రాజకీయ సమాధానం చెప్పవచ్చు. కానీ దానికి ప్రతీకారంగా మరో ప్రాంతంలో ఉద్రిక్తత సృష్టించడం ప్రజాస్వామ్య రాజకీయాలకు ఎలాంటి సందేశం ఇస్తుంది?
ప్రభుత్వ బాధ్యత కీలకం
ఇక్కడే ప్రభుత్వ బాధ్యత అత్యంత కీలకం. రాష్ట్రానికి ముఖ్యమంత్రి, హోంమంత్రి రెండూ ఒకే వ్యక్తి వద్ద ఉన్నప్పుడు శాంతిభద్రతల పరిరక్షణలో ప్రభుత్వం మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఎర్రవల్లి వద్ద రెండు వర్గాలు ఎదురెదురుగా నిలిచే పరిస్థితి ఏర్పడే వరకు పరిస్థితిని వెళ్లనివ్వడం ప్రభుత్వ వైఫల్యంగానే చూడాల్సి వస్తుంది. ఒక చిన్న రాజకీయ వివాదం పెద్ద ఘర్షణగా మారితే ప్రాణనష్టం జరిగే ప్రమాదం ఉంది. అలాంటి పరిస్థితి జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు.. ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడిన తర్వాత పోలీసులు పరుగులు పెట్టడం కంటే, ముందుగానే రాజకీయ పార్టీలతో మాట్లాడి సమస్యను చల్లార్చడం ప్రభుత్వ బాధ్యత. ఇంకో విచిత్రమైన పరిణామం ఏమిటంటే-ముట్టడికి పిలుపునిచ్చిన వారిపై చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితిలో, తమ నాయకుడి రక్షణ కోసం అక్కడికి చేరుకున్న బీఆర్ఎస్ కార్యకర్తలను కూడా అరెస్టు చేసి తరలించడం పోలీస్ పక్షపాత చర్యలకు అద్ధం పడుతున్నాయి..
చట్టం అందరికీ సమానంగా వర్తించాలి. ఏ పార్టీ అయినా సరే, ఎవరు శాంతిభద్రతలకు భంగం కలిగిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. కానీ చర్యలు రాజకీయంగా ఒకవైపే కనిపిస్తే ప్రభుత్వ నిష్పాక్షికతపై అనుమానాలు రావడం సహజం. ఇదే సమయంలో సందట్లో సడే మియా లాగా షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చేసిన వ్యాఖ్యలు మరింత దిగజారుడుతనానికి నిదర్శనంగా నిలిచాయి. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్‌పై 'చావు డప్పు' వంటి భాష ఉపయోగించడం రాజకీయ విమర్శ కాదు-రాజకీయ సంస్కారాన్ని దిగజార్చే వ్యాఖ్య. ప్రతిపక్ష నాయకుడిపై ఎంత తీవ్రమైన విమర్శలు చేసినా అభ్యంతరం లేదు. కానీ వ్యక్తిగత మరణాన్ని కోరుకునే స్థాయికి రాజకీయ భాష దిగజారితే దాన్ని సభ్య సమాజం హర్షించదు.ఒకవైపు సభాపతిని అవమానించారని బీఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు అదే అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే ప్రధాన ప్రతిపక్ష నాయకుడిపై అంతకంటే తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తే దానిపై పార్టీ నాయకత్వం ఏం చెబుతుంది? రాజకీయ నైతికతను కేవలం ప్రత్యర్థులకు మాత్రమే వర్తింపజేస్తే ప్రజలు ప్రశ్నించకుండా ఉండరు కదా.
నిజం చెప్పాలంటే తెలంగాణ రాజకీయాలు ప్రస్తుతం అసలు సమస్యల నుంచి దారి మళ్లుతున్నాయి.
రైతుకు విద్యుత్ కావాలి. సాగునీరు కావాలి. విద్యార్థికి ఫీజు రీయింబర్స్‌మెంట్ కావాలి. నిరుద్యోగికి ఉద్యోగ నోటిఫికేషన్ కావాలి. ఉద్యోగులకు పీఆర్సీపై స్పష్టత కావాలి. సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కారం కావాలి. 22-ఏ భూముల అంశంపై ప్రజలకు భరోసా కావాలి. ఎన్నికల సమయంలో ఇచ్చిన 6గ్యారంటీ లు, రైతు, విద్యార్థి, బీసీ, ఎస్సీ, ఎస్టీ తదితర డిక్లరేషన్ లు, 420 హామీలు ఎప్పుడు, ఎలా అమలు చేస్తారో ప్రభుత్వం స్పష్టంగా చెప్పాలి. ఇలాంటి సమస్యలు ఎన్నో ఉండగా, అధికారపక్ష పార్టీ నాయకులు ప్రధాన ప్రతిపక్ష నాయకుని ఫామ్‌హౌస్ వైపు దండయాత్రలు చేయడం వల్ల ప్రజలకు ఒరిగేది ఏమిటి? డప్పులు కొట్టడం వల్ల రైతుల కరెంటు, సాగునీటి సమస్యలు పరిష్కారమవుతుందా? మరే ఇతర సమస్యలు పరిష్కారమవుతాయా? ఫామ్ హౌస్ ముట్టడి ద్వారా ఎం సాధించారు… పోలీసు బలగాలను తరలించడం, నిరసనలు, అరెస్టులు, ఉద్రిక్తతలు సృష్టించడం తప్ప ఒరగబెట్టిందేమీలేదు.
ప్రజలకు కావాల్సింది పరిష్కారం. ఇక్కడ మరో రాజకీయ ద్వంద వైఖరి కనిపిస్తోంది. 'కేసీఆర్ ఉనికి లేకుండా చేస్తాం' అని చెప్పిన అధికార నాయకులే ప్రతి రాజకీయ సందర్భంలో కేసీఆర్ పేరును ప్రస్తావించాల్సిన పరిస్థితి ఎందుకు వస్తోంది? ఒక నాయకుడి ఉనికిని రాజకీయంగా ముగించాలంటే ప్రజల తీర్పుతోనే సాధ్యం. మాటలతో కాదు. కేసీఆర్ అసెంబ్లీకి రావాలా? రావకూడదా? అనేది రాజకీయ నిర్ణయం. కానీ ఆయన రాకపోతే ప్రభుత్వ హామీల అమలుకు ఏదైనా అడ్డంకి ఏర్పడుతుందా? ప్రజా సమస్యలపై చర్చకు ప్రతిపక్ష నాయకుడి హాజరు అవసరమే అయితే, ప్రభుత్వం సభా వేదికపై చర్చకు సిద్ధంగా ఉండాలి. ఆ పార్టీ పక్షాన ఇతర నాయకులు హాజరు అవుతున్నారు కదా! వారితో చర్చ జరపడంతో పాటు వారి ప్రశ్నలకు సమాధానం చెప్పవచ్చు కదా? ప్రతిపక్షాన్ని విమర్శించడం అధికార పార్టీ హక్కు.. కావొచ్చు . కానీ ప్రతిపక్షం అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పడం అధికార పార్టీ బాధ్యత. అధికారంలో ఉన్నవారికి బాధ్యత ఎక్కువ. ఎందుకంటే ప్రజలు ప్రశ్నించేది అధికారాన్నే.
రాజకీయ పరిపక్వత అవసరం
అందుకే తెలంగాణకు ఇప్పుడు కావాల్సింది మరింత రాజకీయ కక్ష కాదు-మరింత రాజకీయ పరిపక్వత. ప్రభుత్వం వెంటనే అఖిలపక్షాలతో చర్చించి ఉద్రిక్తతలకు ముగింపు పలకాలి. శాంతిభద్రతల విషయంలో కఠినంగా, కానీ నిష్పాక్షికంగా వ్యవహరించాలి. వెయ్యి రోజుల పాలనపై ప్రశ్నలు వస్తే సమాధానాలు చెప్పాలి. హామీలు అమలు కాలేదంటే కారణాలు వివరించాలి. అమలు చేస్తున్నామని చెబితే గణాంకాలతో ప్రజల ముందు పెట్టాలి. అదే నిజమైన రాజకీయ జవాబుదారీతనం. తెలంగాణ ఉద్యమం మనకు నేర్పిన గొప్ప విషయం-ప్రజల ఆకాంక్షలే రాజకీయాలకు కేంద్రబిందువు కావాలని. ఆ తెలంగాణలో ఇప్పుడు రాజకీయ కక్షలు, వ్యక్తిగత దూషణలు, ఘర్షణలు కేంద్రబిందువుగా మారడం దురదృష్టకరం. అధికార పక్షం గుర్తుంచుకోవాల్సిన చివరి మాట ఒక్కటే! ప్రతిపక్షాన్ని ఎంతగా అణచాలనుకుంటే అంతగా ప్రజల్లో ప్రశ్నలు పెరుగుతాయి. ప్రతిపక్షాన్ని ఎంతగా విమర్శిస్తే అంతగా మీ పాలనకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత పెరుగుతుంది. అందుకే కేసీఆర్‌ను కాదు… ప్రజల ప్రశ్నలను ఎదుర్కోండి. రాజకీయ ప్రత్యర్థులను కాదు… తెలంగాణ సమస్యలను ఓడించండి.

