Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సేంద్రియ ఉత్పత్తులతో ఆరోగ్యం పదిలం

సేంద్రియ ఉత్పత్తులతో ఆరోగ్యం పదిలం

- రైతులు పంట వ్యర్థాలను కాల్చొద్దు- వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల

హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 29 : రాష్ట్రంలో సేంద్రియ వ్యవసాయాన్ని మరింతగా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందంటూ రైతులు ఆర్గానిక్ సాగుకు ముందుకు రావాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు.

హైదరాబాద్‌లోని హెచఎండీఏ గ్రౌండ్స్‌లో శుక్రవారం నిర్వహించిన ఆర్గానిక్ మేళాను ఆయన సందర్శించి ప్రదర్శనలో ఏర్పాటు చేసిన వివిధ సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తుల స్టాల్స్‌ను సందర్శించి రైతులతో ముచ్చటించారు. సేంద్రియ వ్యవసాయం ప్రాధాన్యత, సాగు విధానాలు, ఎదురవుతున్న సవాళ్ల గురించి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ ప్రస్తుతం మనం వినియోగిస్తున్న ఆహార పదార్థాలు రసాయనాల ప్రభావంతో కలుషితమవుతున్నాయని, వాటిని తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయని, క్యాన్సర్ వంటి ప్రమాదకర వ్యాధులకు కూడా ఇది ఒక కారణంగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. అధిక దిగుబడుల కోసం అవసరానికి మించి రసాయన ఎరువులు, పురుగు మందులు వినియోగించడం వల్ల నేల సారం దెబ్బతింటోందంటూ అధికంగా రసాయన ఎరువులు వినియోగించడం ద్వారా భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన భూమిని అందించలేని పరిస్థితి ఏర్పడుతోందని పేర్కొన్నారు. ప్రస్తుతం కార్పొరేట్ హాస్పిటల్స్ వేగంగా విస్తరిస్తుండటానికి ప్రధాన కారణాల్లో ఆహారపు అలవాట్లు, రసాయనాల ప్రభావం కూడా ఒకటని ఆయన అభిప్రాయపడ్డారు. సేంద్రియ వ్యవసాయం ద్వారా నేల ఆరోగ్యం, ప్రజల ఆరోగ్యం రెండూ మెరుగుపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. రైతులు ఉత్పత్తి చేస్తున్న ఆర్గానిక్ ఉత్పత్తులకు విస్తృత ప్రచారం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. సేంద్రియ వ్యవసాయం చేస్తున్న రైతుల నుంచి వినియోగదారులు నేరుగా ఉత్పత్తులను కొనుగోలు చేయాలని సూచించారు. ప్రజలు ఎంత ఎక్కువగా ఆర్గానిక్ ఉత్పత్తులను కొనుగోలు చేస్తే అంత ఎక్కువగా రైతులు సేంద్రియ సాగు వైపు ఆకర్షితులవుతారని, తద్వారా ఆరోగ్యకరమైన వ్యవస్థ ఏర్పడుతుందని తెలిపారు. రైతులు, వినియోగదారులు, ప్రభుత్వం సమన్వయంతో పనిచేస్తేనే సమాజానికి ఆరోగ్యవంతమైన భవిష్యత్తును అందించగలమని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు. అలాగే రైతులు పంట వ్యర్థాలను పొలాల్లో కాల్చకుండా వాటిని సేంద్రియ ఎరువుల తయారీలో వినియోగించాలని సూచించారు. పంట అవశేషాల దహనం వల్ల పర్యావరణ కాలుష్యం పెరగడంతోపాటు నేలలోని సూక్ష్మజీవులు నశిస్తాయని, ఇది భూమి సారంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని మంత్రి తెలిపారు. రైతులు పంట వ్యర్థాలను సద్వినియోగం చేసుకుంటూ సుస్థిర వ్యవసాయ పద్ధతులను అవలంబించాలని పిలుపునిచ్చారు.

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prajatantra News