Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
శాసనసభ నుంచి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌

శాసనసభ నుంచి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌

- కేటీఆర్‌, హరీష్‌ రావు సహా 22 మందిపై వేటు - సభ్యుల సస్పెన్షన్‌కు మంత్రి శ్రీధర్‌బాబు సిఫారసు
- సస్పెన్షన్‌ వేటుకు స్పీకర్‌ ప్రసాద్‌ కుమార్‌ ఆమోదం

- సెషన్‌ మొత్తం సస్పెండ్‌ చేసిన శాసనసభ స్పీకర్‌

హైదారాబాద్‌, ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 9: బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలపై శాసనసభలో సస్పెన్షన్‌ వేటు పడింది. దీంతో ఈ సమావేశాలకు మొత్తంగా వారు దూరంగా ఉండనున్నారు. శాసనసభ సజావుగా కొనసాగకుండా అడ్డుకుంటున్న ఈ సభ్యుల సస్పెన్షన్‌కు శ్రీధర్‌బాబు సిఫారసు చేయగా స్పీకర్‌ అనుమతిస్తూ వేటు వేశారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కేటీఆర్‌, హరీష్‌ రావు, జగదీశ్‌రెడ్డి, గంగుల కమలాకర్‌, అనిల్‌ జాదవ్‌, కౌశిక్‌రెడ్డి, మాధవరం కృష్ణారావు, కోవా లక్ష్మి, మాణిక్‌రావు, చింతా ప్రభాకర్‌, కొత్త ప్రభాకర్‌రెడ్డి, ప్రశాంత్‌ రెడ్డి, మర్రి రాజశేఖర్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, సుధీర్‌రెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, కాలేరు వెంకటేశ్‌, విజేయుడు, కె.సంజయ్‌, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, కేపీ వివేకానందలపై సస్పెన్షన్‌ వేటు పడింది. మూడో రోజు సభ ప్రారంభమైన వెంటనే వి వాంట్‌ జస్టిస్‌ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు సభా కార్యకలాపాలకు అడ్డు తగిలారు. దీంతో వారిని సభ నుంచి సస్పెండ్‌ చేయాలని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు ప్రతిపాదించగా స్పీకర్‌ సస్పెన్షన్‌ వేటు వేస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం స్పీకర్‌ను కలిసేందుకు వెళ్లిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను మార్షల్స్ అడ్డుకున్నారు. సభాపతికి చేయాల్సిన అవమానాలన్నీ బీఆర్‌ఎస్‌ నేతలు చేశారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మండిపడ్డారు. అవమానాలు కొనసాగించే పరిస్థితి మానుకోవాలని కోరుతున్నట్లు తెలిపారు. సభాపతి సూచన చేస్తే వాదన పెట్టుకోకుండా సభ సజావుగా నడిచేలా చూడాలన్నారు. వెల్‌లోకి వచ్చి చేయాల్సిన అవమానాలన్నీ చేసి స్పీకర్‌పై సవాల్‌ విసురుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆత్మగౌరవానికి భంగం కలిగించే ప్రయత్నం చేయొద్దని కోరారు. విభజన తీసుకురావడానికి మరో ప్రయత్నం మంచిది కాదని, సభాపతితోపాటు వారి తల్లిని దూషిస్తే నిరసనలు తెలిపారని అన్నారు. నిన్న నిరసనలో భాగంగా దళిత సంఘాలు ఎర్రవల్లిలోని రోడ్డుపై నడిస్తే అక్కడ పసుపు నీళ్లతో శుద్ధి చేసి అవమానించడమే కాక న్యాయం కావాలంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయం కావాల్సింది బలహీనవర్గాలు, దళిత, గిరిజనులకని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌ చేతుల్లో అవమానానికి గురవుతున్న పేదలకు న్యాయం జరగాలన్నారు. విపక్ష నేతల ఆగడాలు, అవమానాలను ప్రభుత్వం సంయమనంతో భరిస్తోందని చెప్పారు. రాష్ట్రాన్ని విపక్ష నేతలు ఏం చేయాలనుకుంటున్నారని ప్రశ్నించారు. దొరతనం పోకడలను భరించడానికి రాష్ట్రం సిద్ధంగా లేదని భట్టి ఘాటుగా అన్నారు.

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేపై కేసు నమోదు

మహిళా పోలీసుల విధులకు ఆటంకం కలిగించి దుర్భాషలాడి, బెదిరించారన్న ఘటనపై కేటీఆర్‌, హరీష్‌ రావు సహా పలువురు బీఆర్‌ఎస్‌ నాయకులపై సైఫాబాద్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. అసెంబ్లీ గేట్‌ నంబర్‌ 3 వద్ద సోమవారం జరిగిన ఘటనపై మహిళా కానిస్టేబుల్‌ ఫిర్యాదుతో 74, 75(1), 79, 121(1), 130, 132, 296, 351(2), 352 తీ/• 3(5) సెక్షన్ల కింద బీఆర్‌ఎస్‌ నాయకులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మహిళా పోలీసుల విధులకు ఆటంకం కలిగించి దుర్భాషలాడి, బెదిరించారని ఫిర్యాదులో బాధిత పోలీసు సిబ్బంది వెల్లడించారు. మహిళా పోలీసులనుద్దేశించి బీఆర్‌ఎస్‌ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు. మహిళా పోలీసులు అని చూడకుండా తమ ఎదుట టీషర్టులు విప్పి అర్ధనగ్నంగా నిలబడ్డారని ఫిర్యాదులో ఆవేదన వ్యక్తం చేశారు. విధులు నిర్వర్తించకుండా అడ్డుకుని బెదిరించినట్లు వివరించారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ, వీడియోలు, ఫొటోలు, వైద్య రికార్డులు పరిశీలించాలని ఫిర్యాదులో విజ్ఞప్తి చేశారు. మాజీ మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్‌ ప్రవర్తన దురుసుగా ఉందని తెలిపారు. మహిళా పోలీసులను నెట్టడంతో ఇబ్బంది కలిగించారని ఆరోపణలు చేశారు. ఈ ఘటనతో తమకు తీవ్ర మానసిక వేదన, అవమానం కలిగిందని తెలిపారు. ఘటన అనంతరం మహిళా పోలీసులకు హాస్పిటల్‌లో వైద్య చికిత్సలు చేసినట్లు వివరించారు.

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prajatantra News