Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సిరిసిల్ల సిగలో సరికొత్త  మణిహారం

సిరిసిల్ల సిగలో సరికొత్త మణిహారం

- నేతన్నల ఆత్మగౌరవానికి 'జోట' నిలువెత్తు సాక్ష్యం- కలెక్టరేట్ జంక్షన్‌లో ప్రతిష్టాత్మకంగా జోట స్టాచ్యూ
- తుదిదశకు చేరిన సుందరీకరణ పనులు..

త్వరలోనే ప్రారంభం
- నేతన్న జీవన గాథను ఆవిష్కరించే త్రీడీ చిత్రాలు

సిరిసిల్ల టౌన్, ప్రజాతంత్ర జూన్ 3: మగ్గం చప్పుడు వినిపిస్తేనే ఇంట్లో పొయ్యి వెలిగిన రోజులు… నూలు దారాల్లోనే తమ కలలను, కష్టాలను అల్లుకున్న జీవితాలు… చీర నేసే ప్రతి క్షణంలో చెమటను కళగా మార్చిన చేతులు… ఇదే సిరిసిల్ల నేతన్నల గాథ. ప్రపంచానికి అందమైన వస్త్రాలను అందించినా, తమ జీవితాలను మాత్రం ఎన్నో కష్టాల మధ్య గడిపిన నేతన్నల పోరాటానికి ఇప్పుడు శిలారూపం దక్కబోతోంది. చేనేతకు చిరునామాగా నిలిచిన సిరిసిల్ల గర్వకారణమైన నేతన్నల జీవితాన్ని ప్రతిబింబించేలా కలెక్టరేట్ జంక్షన్‌లో ప్రతిష్టాత్మకంగా "జోట" (నాడె) స్టాచ్యూను ఏర్పాటు చేస్తున్నారు. ఇది కేవలం ఒక శిల్పం కాదు… మగ్గంతో మమేకమైన వేలాది కుటుంబాల జీవనగాథకు ప్రతీక. నేతన్న చెమట చుక్కలకు, వారి కళాత్మకతకు, ఆత్మగౌరవానికి ఘన నివాళిగా నిలిచే ఈ నిర్మాణం సిరిసిల్ల చరిత్రలో మరో మైలురాయిగా నిలవనుంది. రూ.3 కోట్ల వ్యయంతో చేపడుతున్న ఈ సుందరీకరణ పనులు తుదిదశకు చేరుకోగా, అతి త్వరలో ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి.

సిరిసిల్ల అంటే చేనేత

వస్త్ర తయారీలో కీలకమైన జోట (నాడె)ను ప్రతీకగా తీసుకుని నిర్మిస్తున్న ఈ స్టాచ్యూ నేతన్నల ఆత్మగౌరవానికి నిలువెత్తు చిహ్నంగా నిలవనుంది. మగ్గంపై జోట కదిలితేనే వస్త్రం రూపుదిద్దుకుంటుంది. అలాంటి జోటను శిల్ప రూపంలో ఆవిష్కరించడం ద్వారా నేతన్న వృత్తికి ప్రత్యేక గుర్తింపు లభించనుంది. కాగా కలెక్టరేట్ జంక్షన్‌ను కేవలం ట్రాఫిక్ కేంద్రంగా కాకుండా, సిరిసిల్ల చేనేత వారసత్వాన్ని ప్రతిబింబించేలా తీర్చిదిద్దుతున్నారు. జంక్షన్ పరిసరాల్లో ఏర్పాటు చేస్తున్న త్రీడీ చిత్రాలు నేతన్న జీవన విధానాన్ని కళ్లకు కట్టినట్లు చూపించనున్నాయి. దూది నుంచి నూలు తయారీ, రంగులు అద్దడం, మగ్గంపై వస్త్ర నేయడం, కండెలు చుట్టడం వంటి ప్రక్రియలను చిత్ర రూపంలో ఆవిష్కరిస్తున్నారు.

అందం వెనుక ఆలోచన

రూ.3 కోట్ల వ్యయంతో చేపడుతున్న ఈ జంక్షన్ సుందరీకరణలో కేవలం అందం మాత్రమే లక్ష్యం కాదు. ఒక పట్టణానికి ప్రత్యేక గుర్తింపును సృష్టించడం కూడా ఇందులో భాగం. పట్టణంలోకి వచ్చే వారికి మొదటి చూపులోనే ఇది నేతన్నల నేల అనే భావన కలిగించేలా రూపకల్పన జరిగింది. ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ చొరవతో ప్రారంభమైన ఈ పనులు, జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో శరవేగంగా సాగి తుది దశకు చేరుకొని అతి త్వరలో ప్రారంభానికి కూడా సిద్ధమయ్యింది. పరిపాలన, ప్రజాప్రతినిధుల సమన్వయంతో ఈ ప్రాజెక్ట్ వేగంగా పూర్తి కావడం విశేషం. ఇప్పటికే పట్టణం నడిబొడ్డున పాత బస్టాండ్ లో ఏర్పాటు చేసిన చేనేత కార్మికుడి విగ్రహాం పట్టణానికే గుర్తుగా నిలువగా, ఈ "జోట"(నాడె) స్టాచ్యూ పట్టణానికే తలమానికంగా మారబోతోంది.

పర్యాటక ఆకర్షణగా మారే అవకాశం

స్థానిక సంస్కృతిని ప్రతిబింబించే ప్రదేశాలపై యువత, పర్యాటకులు ఆసక్తి చూపుతున్న ప్రస్తుత తరుణంలో జోట స్టాచ్యూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచే అవకాశం ఉంది. సెల్ఫీ స్పాట్‌గా మాత్రమే కాకుండా, సిరిసిల్ల చేనేత వారసత్వాన్ని ప్రపంచానికి పరిచయం చేసే కేంద్రంగా మారనుంది. మగ్గం చప్పుడు వినిపించే ఈ నేలపై నేతన్న కష్టాన్ని శిలగా మలిచిన 'జోట' స్టాచ్యూ సిరిసిల్ల గర్వకారణంగా నిలవనుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prajatantra News