Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
స్కూళ్ల వద్ద రద్దీ నివారణకు 'స్టూడెంట్ మొబిలిటీ ప్లాన్'

స్కూళ్ల వద్ద రద్దీ నివారణకు 'స్టూడెంట్ మొబిలిటీ ప్లాన్'

- 500 విద్యా సంస్థలతో సైబరాబాద్ పోలీసుల సమావేశం- పరిష్కార మార్గాలపై చర్చ

=శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, మే 22 : సైబరాబాద్ పరిధిలో పాఠశాలలు, కళాశాలల వద్ద ఉదయం, సాయంత్రం వేళల్లో నిత్యం ఏర్పడుతున్న తీవ్ర ట్రాఫిక్ రద్దీకి శాశ్వత పరిష్కారం చూపేందుకు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్, సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ సంయుక్తంగా స్టూడెంట్ మొబిలిటీ ప్లాన్‌ను రూపొందించాయి.

ఇందులో భాగంగా హైదరాబాద్‌లోని ఈఎస్‌సీఐ సెంటినరీ కన్వెన్షన్ సెంటర్‌లో 500కు పైగా విద్యాసంస్థలకు చెందిన 750 మంది ప్రతినిధులతో శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఆర్టీసీ, సీఎంసీ, ఆర్టీఏ, విద్యాశాఖ అధికారులు, రవాణా ఆపరేటర్లు పాల్గొన్నారు. విద్యార్థుల రవాణా తీరుతెన్నులపై సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు, ఎస్‌సీఎస్‌సీ బృందాలు కలిసి 526 విద్యాసంస్థల్లో క్షేత్రస్థాయి సర్వే చేపట్టాయి. మొత్తం 4.1 లక్షల మంది విద్యార్థుల రాకపోకలను పరిశీలించిన ఈ సర్వేలో కీలక అంశాలు వెలుగు చూశాయి. 80 శాతం విద్యా సంస్థలు బస్సు సౌకర్యం కల్పిస్తున్నప్పటికీ 30 శాతం మంది విద్యార్థులే ఆ సౌకర్యాన్ని వినియోగిస్తున్నారు. ఈ కారణంగా రోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో సుమారు రెండు లక్షల ప్రైవేటు వాహనాలు పాఠశాలల వద్దకు చేరుతున్నాయి. పీక్ సమయంలో 15 నిమిషాల వ్యవధిలోనే రెండు లక్షల వాహనాలు రోడ్డెక్కడం సైబరాబాద్ ఐటీ కారిడార్ రద్దీని మించిపోతోందని అధికారులు గుర్తించారు. సదస్సులో సైబరాబాద్ కమిషనర్ ఎం.రమేష్ మాట్లాడుతూ పిల్లలను పాఠశాలలకు దింపేందుకు, తిరిగి తీసుకెళ్లేందుకు తల్లిదండ్రులు తొందరపడి ప్రమాదకరంగా వాహనాలు నడుపుతున్నారని, దీంతో పలు ప్రమాదాలు, కొన్ని సందర్భాల్లో మరణాలు కూడా సంభవించాయని ఆవేదన వ్యక్తం చేశారు. సమాచార లోపం కారణంగా పిల్లలు పాఠశాలల్లో చిక్కుకుపోవడం, ఉదయం హడావుడిలో పిల్లల ఆరోగ్యం దెబ్బతినడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. ఇది స్వల్పకాలిక ట్రాఫిక్ సమస్య కాదని, దీర్ఘకాలిక పౌర రవాణా సంస్కరణ అవసరమని స్పష్టం చేశారు. ప్రస్తుతం పూర్తిగా వినియోగంలో లేని ప్రభుత్వ, ప్రైవేటు రవాణా సామర్థ్యాన్ని వాడుకుని పూల్డ్ మొబిలిటీని ప్రోత్సహిస్తామని, పాఠశాలలకు వచ్చే అన్ని వాహనాలు నిబంధనలకు లోబడి ఉండేలా చూస్తామని చెప్పారు. అంతేకాక లాస్ట్ మైల్ కనెక్టివిటీలో గిగ్ వర్కర్లు, ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ కార్యకర్తలను భాగస్వామ్యం చేసి విద్యార్థుల భద్రతను మరింత పటిష్ఠం చేయడంతోపాటు వారికి అదనపు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని వెల్లడించారు. శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ నారాయణ అమిత్ మాట్లాడుతూ విద్యార్థి భద్రత పాఠశాల గేటు వద్దే ముగియదని, ఇంటి నుంచి బయలుదేరిన క్షణం నుంచి తిరిగి సురక్షితంగా చేరే వరకు ఉంటుందని పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో మార్పు కోసం కమిషనరేట్‌తో కలిసి పనిచేస్తామని తెలిపారు. ఎస్‌సీఎస్‌సీ సీఈవో నవేద్ ఖాన్ మాట్లాడుతూ రోడ్డుపై వాహనాల సంఖ్యను గణనీయంగా తగ్గిస్తూ విద్యార్థులకు సురక్షితమైన, అందరికీ అందుబాటులో ఉండే రవాణా వ్యవస్థను అందించడమే ఈ ప్రణాళిక ప్రధాన లక్ష్యమని వివరించారు. ఆర్టీసీ డిప్యూటీ ఆర్ఎం అపర్ణ కల్యాణి మాట్లాడుతూ తమ డ్రైవర్లకు నిర్మాణాత్మక శిక్షణ ఇస్తున్నామని, బస్సులన్నీ భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నాయని, విద్యార్థులు ఎక్కడినుంచి ప్రయాణిస్తున్నారో స్పష్టత ఉంటే సమన్వయం మరింత సులభమవుతుందని అభిప్రాయపడ్డారు. మండల విద్యాశాఖ అధికారి రామారావు మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువగా యువత, విద్యార్థులే బలవుతున్నారని, పాఠశాలస్థాయి నుంచే రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. సదస్సులో డీసీపీలు రితిరాజ్, సృజన, శేషాద్రిని రెడ్డి, జోనల్ కమిషనర్ మయాంక్ సింగ్, ఈఎస్‌సీఐ డైరెక్టర్ రామేశ్వరరావు తదితరులు పాల్గొని కమిషనర్ ఆలోచనలకు మద్దతు తెలిపారు. కార్యక్రమం చివర్లో విద్యాసంస్థల ప్రతినిధుల సందేహాలను నివృత్తి చేశారు. రద్దీ, నియమాల అమలు, భద్రత, సౌలభ్యం అనే నాలుగు కీలక అంశాలను ఒకే వేదికపైకి తెచ్చేందుకు రూపొందించిన టెక్నాలజీ ప్లాట్‌ఫామ్‌ను పాఠశాలలు, రవాణా ఆపరేటర్లు, తల్లిదండ్రులు, పౌర అధికారులను అనుసంధానించేలా దశలవారీగా అమలు చేయనున్నట్లు అధికారులు వివరించారు.

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prajatantra News