Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఉద్యమకారుల గుర్తింపులో పారదర్శకత అవశ్యం

ఉద్యమకారుల గుర్తింపులో పారదర్శకత అవశ్యం

- కమిటీ సమన్వయంతో ముందుకు సాగాలి- టీజేఏసీ పూర్వ చైర్మన్ వెంకటేశ్వర్లు డిమాండ్

నల్లగొండ, ప్రజాతంత్ర, మే 19 : తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కోసం రాష్ట్రప్రభుత్వం ప్రత్యేక ఉద్యమకారుల గుర్తింపు కమిటీ ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తున్నామని ఉమ్మడి నల్లగొండ జిల్లా జేఏసీ పూర్వ చైర్మన్ జి.వెంకటేశ్వర్లు అన్నారు.

ఉమ్మడి నల్లగొండ జిల్లా పూర్వ టీజేఏసీ ఆధ్వర్యంలో ఆనాడు ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్న వివిధ రంగాల ఉద్యమకారులతో రెడ్‌క్రాస్ భవన్‌లో మంగళవారం సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రాష్ట్ర సాధన కోసం తమ జీవితాలను అంకితం చేసి ఉద్యమంలో పాల్గొన్న అసలైన ఉద్యమకారులకు న్యాయం జరిగేలా గుర్తింపు ప్రక్రియ కొనసాగాలని కోరారు. ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన ఉద్యోగ సంఘాలు, కళాకారుల జేఏసీ, సబ్బండ వర్గాల జేఏసీ, కుల సంఘాలు, న్యాయవాదుల జేఏసీ, విద్యార్థి సంఘాల జాక్, మహిళా సంఘాలు, వివిధ జిల్లాలలో ఏర్పడిన ఉద్యమ సంఘాల నుండి విస్తృతస్థాయిలో అభిప్రాయాలు, ప్రతిపాదనలు స్వీకరించాలని సూచించారు. ఉద్యమకారుల గుర్తింపు కమిటీ ప్రతి జిల్లాలో పర్యటిస్తూ ఉద్యమకారులతో ప్రత్యక్షంగా సమావేశాలు నిర్వహించి వారి అభిప్రాయాలను సేకరించాలని కోరారు. ఉద్యమ సమయంలో పౌర సమాజం తరఫున పనిచేసిన మేధావులు, రచయితలు, జర్నలిస్టులు, కళాకారులు, ప్రజా సంఘాల నాయకులు తదితరుల సూచనలు కూడా తీసుకోవాలన్నారు. అన్ని వర్గాల ఉద్యమకారులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. మలి దశ ఉద్యమ కాలంలో ఏర్పడిన తెలంగాణ జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యమాన్ని నడిపిన నాయకులు, కార్యకర్తలు, ప్రజా సంఘాల ప్రతినిధుల సమాచారాన్ని ప్రామాణికంగా పరిగణించాలని ఆయన అభిప్రాయపడ్డారు.

త్యాగాలను గౌరవించాలి : చెరుకు సుధాకర్

ఉద్యమ చరిత్ర, త్యాగాలు, పోరాట స్పూర్తి దృష్ట్యా రాజకీయాలకతీతంగా నిజమైన ఉద్యమకారుల ఎంపిక జరగాల్సిన అవసరం ఉందని ఉద్యమ నాయకుడు డాక్టర్ చెరుకు సుధాకర్ అన్నారు. ఉద్యమకారులను గుర్తించే పని నిజాయతీగా చేపట్టాలన్నారు. 1969 ఉద్యమకారుల కమిటీ ఒకటి ఉన్నదని, ముందుగా నాటి ఉద్యమకారుల వైద్య అవసరాల కోసం రూ.10 కోట్లు ప్రకటించాలని డిమాండ్ చేశారు. అఖిలపక్షాలను పిలిచి అభిప్రాయాలను సేకరించాలన్నారు. ఉద్యమకారులకు ముందుగా ప్రత్యేక గుర్తింపు కార్డులు జారీ చేసి సంక్షేమ పథకాలు అమలు చేయాలని సూచించారు. విద్యార్థి లోకం, విద్యార్థి ఉద్యమకారులు తీవ్రంగా నష్టపోయారని, వారిని ప్రత్యేకంగా గుర్తించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఉద్యమకారుల సంక్షేమం కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయడం, వైద్య సదుపాయాలు, పెన్షన్, విద్య, ఉపాధి అవకాశాలలో ప్రాధాన్యత కల్పించడం వంటి అంశాలను కూడా ప్రభుత్వం పరిశీలించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర సాధనలో ప్రజల త్యాగాలను చరిత్రలో నిలిచే విధంగా గౌరవించడం ప్రభుత్వ బాధ్యత అని అన్నారు. సమావేశంలో ఉద్యమకారులు చక్రహరి రామరాజు, గోలి అమరేందర్ రెడ్డి, బోనగిరి దేవేందర్, వైద్యుల సత్యనారాయణ, అంబటి నాగయ్య, వీరెల్లి చంద్రశేఖర్, ఇందూరి సాగర్, దూసరి కిరణ్ కుమార్, పందుల సైదులు, పన్నాల గోపాల్ రెడ్డి, పెరిక కరణ్ జయరాజు, రమేష్, శ్రవణ్ కుమార్, నల్ల సోమ మల్లయ్య, వెంకట్రామిరెడ్డి, తోట నరసింహచారి, సంతోష్ రెడ్డి, చంద్రారెడ్డి, నరేంద్రబాబు, శ్రీనివాస్ రావు, దాసోజు లలిత, లక్ష్మీనారాయణ, భీమార్జున్ రెడ్డి, హరికృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prajatantra News