Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
వీధి కుక్కలను తరలించాల్సిందే

వీధి కుక్కలను తరలించాల్సిందే

- ప్రజల ప్రాణాలతో చెలగాటం వద్దు- ప్రతి జిల్లాలో పూర్తిస్థాయిలో బర్త్ కంట్రోల్
- స్కూళ్లు, కాలేజీలు, బస్టాండ్లలో కుక్కలు లేకుండా చేయాలి
- గతంలో ఇచ్చిన ఆదేశాలను అమలు చేయాల్సిందేనన్న సుప్రీం

న్యూఢిల్లీ, మే 19: వీధి కుక్కల బెడదను రూపుమాపాల్సిందేనని సుప్రీంకోర్టు మరోమారు స్పష్టం చేసింది. ఈ విషయంలో రాజీ లేదని తెలిపింది. ఇది ప్రజల ప్రాణాల భద్రతకు సంబంధించిన అంశగా పేర్కొంది. బహిరంగ ప్రదేశాల్లో వీధి కుక్కలను తొలగించాలంటూ గతంలో జారీ చేసిన ఆదేశాలను ఉపసంహరించాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. గతంలో జారీ చేసిన ఆ ఉత్తర్వులను సవరించాలని చేసిన విజ్ఞప్తిని కూడా తోసిపుచ్చింది. స్కూల్, కాలేజీ, రైల్వే స్టేషన్, బస్టాండ్ తదితర బహిరంగ ప్రదేశాల్లో కుక్కలను తొలగించాలంటూ జంతు ప్రేమికులు దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు మంగళవారం విచారించింది. ఈ సందర్భంగా జంతు సంక్షేమ బోర్డు దాఖలు చేసిన అన్ని పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ సందర్భంగా తన తీర్పులో పలు కీలక అంశాలను ప్రస్తావించింది. వీధి కుక్కల సమస్యను జంతు సంక్షేమ అంశంగా కాకుండా ప్రజల ప్రాణాల భద్రతకు సంబంధించిన అంశంగా పరిగణించాలని పిటిషనర్లకు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా రూపొందించిన నియమావళిని సమర్థవంతంగా అమలు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు సూచించింది. ప్రతి జిల్లాలో కనీసం ఒక పూర్తిస్థాయి యానిమల్ బర్త్ కంట్రోల్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది. జనాభాను దృష్టిలో ఉంచుకుని అవసరమైతే జిల్లాలో ఈ కేంద్రాల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించింది. యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా నిబంధనలు కచ్చితంగా అమలు అయ్యేలా చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. దేశవ్యాప్తంగా యాంటీ రేబిస్ మందులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. రహదారులపై సంచరించే పశువుల సమస్యను పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాకు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. జాతీయ రహదారులపై తిరిగే జంతువుల సమస్యల పర్యవేక్షణ కోసం ప్రత్యేక మానిటరింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఎన్‌హెచఏఐను కోరింది. రేబిస్ బారిన పడిన లేదా మానవుల ప్రాణాలకు ముప్ప్పుగా పరిణమించే ప్రమాదకర కుక్కల విషయంలో చట్టబద్ధంగా అనుమతించిన చర్యలు తీసుకోవచ్చని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా స్పష్టం చేసింది. కోర్టు ఆదేశాల అమలు కోసం విధులు నిర్వహించే ఉద్యోగులకు తగిన రక్షణ కల్పించాలని ప్రభుత్వాలకు సూచించింది. విధులు నిర్వర్తించే క్రమంలో వారిపై బలవంతపు చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది.

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prajatantra News