Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
విశ్వనగరంలో వాన పడితే నరకం!!

విశ్వనగరంలో వాన పడితే నరకం!!

హైదరాబాద్ మహానగరం అంతర్జాతీయంగా ఐటీ హబ్‌గా, పెట్టుబడుల స్వర్గధామంగా శరవేగంగా దూసుకుపోతోంది. కానీ, కేవలం ఒక మోస్తరు వర్షం పడితే చాలు, ఈ విశ్వనగరం అసలు రంగు బయటపడుతోంది.

గత కొన్ని రోజులుగా నగరంలో కురుస్తున్న వర్షాలు, పండుగ రద్దీ వెరసి హైదరాబాద్‌ మౌలిక వసతుల డొల్లతనాన్ని, ట్రాఫిక్‌ నిర్వహణ లోపాలను మరోసారి బట్టబయలు చేసాయి . శరవేగంగా విస్తరిస్తున్న జనాభాకు, నగర అభివృద్ధికి అనుగుణంగా శాశ్వత ప్రణాళికలు రూపొందించడంలో పాలకులు, అధికారులు విఫలమవుతున్నారనేది పచ్చి నిజం.నగరంలో ఒక్కో ప్రాంతం ఒక్కో రకమైన మౌలిక వసతుల సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ఆధునిక హైదరాబాద్‌కు గుండెకాయ లాంటి గచ్చిబౌలి, మాదాపూర్ ఐటీ కారిడార్‌లను తీసుకుంటే, ఇక్కడ సమస్యల తీవ్రత మరింత ఎక్కువ. గచ్చిబౌలిలోని ఐఐఐటీ జంక్షన్, ఖాజాగూడ జంక్షన్ వద్ద నిర్మిస్తున్న వ్యూహాత్మక ఫ్లైఓవర్లు, అండర్‌పాస్ ప్రాజెక్టుల (విలువ రూ. 679 కోట్లు) గడువును అధికారికంగా మే 2027 నాటికి పొడిగించారు. దీనివల్ల నిత్యం ఈమార్గంలో ప్రయాణించే 2 లక్షల వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు.

ఈ పొడిగింపు అధికారుల ఉదాసీనతకు అద్దం పడుతోంది. అసలు సమస్య రోడ్ల నిర్మాణం, డ్రైనేజీ వ్యవస్థలో ఉంది. ఒకవైపు అసంపూర్తిగా నిలిచిపోయిన ఫ్లైఓవర్‌ పనులు, మరోవైపు తవ్వేసి వొదిలేసిన డ్రైనేజీ గుంతలు నగరవాసుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. ఒక మోస్తరు వానకే గచ్చిబౌలి జంక్షన్, బయోడైవర్సిటీ పరిసరాలు చెరువులను తలపిస్తున్నాయి. ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్‌ నియంత్రణకు డ్రోన్లు వాడుతున్నామని పోలీస్ శాఖ చెబుతున్నప్పటికీ, అవి తాత్కాలిక ఉపశమనాన్ని మాత్రమే ఇస్తున్నాయి. గంటల తరబడి ఐటీ ఉద్యోగులు ట్రాఫిక్‌లో చిక్కుకుపోవడం వల్ల విలువైన సమయం, మానవ వనరులు వృథా అవుతున్నాయి.
మరోవైపు, నగరంలోనే అతిపెద్ద వాణిజ్య, విద్యా కేంద్రమైన అమీర్‌పేట్, మైత్రీవనం పరిసరాల పరిస్థితి మరింత గందరగోళంగా మారింది.

మెట్రో పిల్లర్ల కింద రోడ్లు ఇరుకుగా మారడం, డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేకపోవడంతో చిన్న పాటి చినుకు పడినా రోడ్లన్నీ జలమయమవుతున్నాయి. దీనికి తోడు ఫుట్‌పాత్‌ల ఆక్రమణల వల్ల కాలినడకన వెళ్లే సాధారణ ప్రజలు, విద్యార్థులు ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని వాహనాల మధ్య నడవాల్సి వొస్తున్నది . ఇక చారిత్రక ప్రాధాన్యత ఉన్న పాతబస్తీలోని చార్మినార్, మదీనా జంక్షన్ వంటి ప్రాంతాల సమస్యలు దశాబ్దాలుగా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉన్నాయి. ఇరుకైన రహదారులు, అస్తవ్యస్తమైన అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ, వీధి వ్యాపారుల రద్దీ వల్ల ఇక్కడ ట్రాఫిక్ ఎప్పుడు స్తంభిస్తుందో ఎవరికీ అర్థం కాదు. చార్మినార్ ప్యాడెస్ట్రియన్ ప్రాజెక్ట్ (సీపీపీ) ఆశించిన ఫలితాలను ఇవ్వడంలో ఇప్పటికీ వెనుకబడే ఉంది.

ప్రస్తుత ఈ దుస్థితికి జీహెచ్‌ఎంసీ (జీహెచ్ ఎంసీ), జలమండలి, ట్రాఫిక్‌ పోలీసుల మధ్య సమన్వయ లోపం ప్రధాన కారణంగా కనిపిస్తున్నది . ఏటా వర్షాకాలానికి ముందే కోట్లాది రూపాయలతో 'నాలా'ల పూడికతీత పనులు చేశామని కాగితాల్లో చూపిస్తున్నా, క్షేత్రస్థాయిలో పరిస్థితి మారడం లేదు. రోడ్లపై చేరిన నీరు త్వరగా కొట్టుకుపోయేందుకు నిర్మించిన క్యాచ్‌పిట్లు చెత్తతో నిండిపోతున్నాయి. నగరంలో చెరువుల ఆక్రమణలు, సహజసిద్ధమైన నీటి ప్రవాహ మార్గాలను (నాలాలను) మూసివేయడం వల్లనే వరద నీరంతా రోడ్లపైకి వొస్తుందన్న పర్యావరణవేత్తల హెచ్చరికలను ప్రభుత్వం ఇప్పటికైనా తీవ్రంగా పరిగణించాలి.హైదరాబాద్‌కు ఇప్పుడు కావాల్సింది రంగుల ప్రకటనలు కాదు, క్షేత్రస్థాయిలో పనిచేసే శాశ్వత మాస్టర్ ప్లాన్. డ్రైనేజీ వ్యవస్థను అంతర్జాతీయ ప్రమాణాలతో ఆధునీకరించాలి. ఫ్లైఓవర్లు, వ్యూహాత్మక రహదారుల (ఎస్ ఆర్‌డీపీ) పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయడానికి గుత్తేదారులపై ఒత్తిడి తేవాలి. మెట్రో రైలు రెండో దశ పనులను వేగవంతం చేసి, ప్రజారవాణా వ్యవస్థను బలోపేతం చేయడం ద్వారానే రోడ్లపై వ్యక్తిగత వాహనాల రద్దీని తగ్గించగలం. హైదరాబాద్‌ బ్రాండ్ ఇమేజ్‌ను కాపాడుకోవాలంటే, ప్రభుత్వం తక్షణమే ఒక సమగ్ర కార్యాచరణతో ముందుకు రావడం అత్యంత అవసరం.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prajatantra News