Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
వ్యవసాయానికి ఉచిత కరెంట్‌  నియంత్రించే ఆలోచనా ?

వ్యవసాయానికి ఉచిత కరెంట్‌ నియంత్రించే ఆలోచనా ?

తెలంగాణ రాజకీయాల్లో వ్యవసాయ విద్యుత్‌ అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్‌ అవసరం లేదని, మూడు గంటల సరఫరా సరిపోతుందని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్‌సీ) ఎదుట రైతు కమిషన్‌ చైర్మన్‌ ఎం.

కోదండరెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ దుమారానికి దారితీశాయి. ఈ వ్యాఖ్యలు కేవలం వ్యక్తిగత అభిప్రాయాలా? లేక ప్రభుత్వ ఆలోచనలకు ప్రతిబింబమా? అనే ప్రశ్నలు రైతు సమాజంలో వినిపిస్తున్నాయి.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు రైతులు విద్యుత్‌ కోతలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రాత్రివేళల్లో ఎప్పుడు కరెంట్‌ వస్తుందో తెలియని పరిస్థితుల్లో పొలాల వద్ద మేల్కొని ఉండేవారు. విద్యుత్‌ షాక్‌లకు, పాముకాట్లకు గురై ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు అనేకం. అలాంటి పరిస్థితుల నుంచి బయటపడేందుకు 24 గంటల ఉచిత విద్యుత్‌ ఒక ప్రధాన డిమాండ్‌గా మారింది. రాష్ట్ర ఏర్పాటు తర్వాత రైతులకు నిరంతర విద్యుత్‌ సరఫరా కల్పించామని గత ప్రభుత్వం ప్రచారం చేసింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు మూడు గంటల విద్యుత్‌ సరిపోతుందనే వ్యాఖ్యలు రైతుల్లో ఆందోళనకు కారణమవుతున్నాయి.

వ్యవసాయం అనేది కేవలం బోరు మోటార్‌ ఆన్‌ చేసి నీరు పెట్టే ప్రక్రియ కాదు. వాతావరణ పరిస్థితులు, భూగర్భ జలాల లభ్యత, పంటల స్వభావం, సాగు విస్తీర్ణం వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా తెలంగాణలోని అనేక ప్రాంతాలు బోరు నీటిపైనే ఆధారపడి సాగు చేస్తున్నాయి. భూగర్భ జలమట్టం లోతుగా ఉన్న ప్రాంతాల్లో నీటిని పైకి తీయడానికి ఎక్కువ సమయం అవసరం అవుతుంది. అలాంటి పరిస్థితుల్లో మూడు గంటల విద్యుత్‌ సరిపోతుందనే వాదనను రైతులు అంగీకరించడం కష్టమే.

ఇంకా ఒక కీలక అంశం ఏమిటంటే, రైతులకు అవసరమైన విద్యుత్‌ పరిమాణాన్ని నిర్ణయించేది కార్యాలయాల్లో కూర్చొని చేసే లెక్కలు కాదు. అది క్షేత్రస్థాయిలోని వాస్తవ పరిస్థితుల ఆధారంగా నిర్ణయించాలి. ఒక రైతు ఎన్ని ఎకరాలు సాగు చేస్తున్నాడు? ఏ పంట వేస్తున్నాడు? నీటి అవసరం ఎంత? అనే అంశాలను పరిగణనలోకి తీసుకోకుండా విద్యుత్‌ వినియోగంపై సాధారణీకరణ చేయడం సరైన విధానం కాదు.

ప్రస్తుతం కాంగ్రెస్‌ ప్రభుత్వంపై రైతు వ్యతిరేక విధానాలు అమలు చేస్తోందన్న విమర్శలు ఇప్పటికే వినిపిస్తున్నాయి. రుణమాఫీ పూర్తి స్థాయిలో అమలు కాలేదని, రైతు భరోసా అమలులో ఆలస్యం జరుగుతోందని, పంటలకు బోనస్‌ విషయంలో స్పష్టత లేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఎరువుల సరఫరా, పంట కొనుగోళ్లలో ఎదురవుతున్న సమస్యలను కూడా ప్రతిపక్షాలు ఎత్తిచూపుతున్నాయి. ఈ నేపథ్యంలో వ్యవసాయ విద్యుత్‌పై వొచ్చిన వ్యాఖ్యలు రైతుల్లో అనుమానాలను మరింత పెంచుతున్నాయి.

రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్‌ కొనసాగించడం వల్ల రాష్ట్ర విద్యుత్‌ సంస్థలపై ఆర్థిక భారం పెరుగుతోందనే వాదన కూడా వినిపిస్తోంది. విద్యుత్‌ సంస్థల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచాలంటే వ్యవసాయ రంగంలో సంస్కరణలు అవసరమని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఆ సంస్కరణల భారం రైతులపై పడకూడదు. విద్యుత్‌ సంస్థల లోటుపాట్లకు రైతులను బాధ్యులను చేయడం కూడా సమంజసం కాదు.

ప్రజాస్వామ్యంలో విధాన మార్పులు చేయాలంటే ప్రజలతో, ముఖ్యంగా ప్రభావిత వర్గాలతో చర్చ జరగాలి. రైతుల జీవితాలను ప్రభావితం చేసే అంశాల్లో ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించాలి. వ్యవసాయ విద్యుత్‌ సరఫరా గంటలను తగ్గించే ఆలోచన ప్రభుత్వం వద్ద లేకపోతే, ఆ విషయాన్ని స్పష్టంగా ప్రకటించాలి. లేకపోతే అనుమానాలు, అపోహలు మరింత పెరిగే అవకాశం ఉంది.

తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయం ఇప్పటికీ కీలక రంగం. రైతు బలంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది. రైతు సంక్షేమాన్ని దెబ్బతీసే ఏ నిర్ణయం అయినా సామాజిక, ఆర్థిక ప్రభావాలను కలిగిస్తుంది. అందువల్ల విద్యుత్‌ సరఫరా వంటి అంశాల్లో ప్రభుత్వం అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలి.

రైతు పొలంలో నిలబడి చూస్తేనే నీటి విలువ తెలుస్తుంది. బోరు మోటార్‌ ఒక్కసారి ఆగిపోతే పంట ఎలా ఎండిపోతుందో రైతుకే తెలుసు. అందుకే వ్యవసాయ విద్యుత్‌పై ఏ నిర్ణయం తీసుకున్నా అది గణాంకాల ఆధారంగా మాత్రమే కాకుండా, రైతు జీవిత వాస్తవాల ఆధారంగా ఉండాలి. తెలంగాణ రైతును మళ్లీ చీకట్ల రోజుల్లోకి నెట్టే పరిస్థితి రాకుండా చూడటం ప్రభుత్వం బాధ్యత. రైతు విశ్వాసాన్ని నిలబెట్టుకోవడమే ఏ ప్రభుత్వానికైనా నిజమైన పరీక్ష..!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prajatantra News