Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
యువతను కబళిస్తున్న 'సైలెంట్ కిల్లర్'

యువతను కబళిస్తున్న 'సైలెంట్ కిల్లర్'

- 30-45 ఏళ్ల వయసులోనే హైబీపీ!- జీవనశైలి ఒత్తిడే ప్రధాన కారణం
- లక్షణాలు లేకుండానే అవయవాలు దెబ్బతినే ప్రమాదం
- ముందస్తు పరీక్షలే రక్షణ
- కేర్ హాస్పిటల్స్ వైద్యుల హెచ్చరిక

హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 16: భారత దేశంలో గుండె సంబంధిత రిస్క్ ప్రొఫైల్లో ఆందోళన కలిగించే మార్పులు కనిపిస్తున్నాయని కేర్ హాస్పిటల్స్ వైద్యులు తెలిపారు. ఒకప్పుడు వృద్ధుల్లో ఎక్కువగా కనిపించే హైపర్ టెన్షన్‌ (రక్తపోటు) ఇప్పుడు 30ల ప్రారంభం నుంచే, 40లలోనే ఎక్కువగా గుర్తిస్తున్న పరిస్థితి నెలకొంటోందని వారు హెచ్చరిస్తున్నారు. వరల్డ్ హైపర్టెన్షన్ డే సందర్భంగా నిపుణులు వెల్లడించిన వివరాల ప్రకారం, పట్టణ ప్రాంతాల్లో ప్రతి నలుగురు పెద్దల్లో ఒకరికి హైబీపీ ఉండే అవకాశం ఉంది. కానీ వీరిలో చాలా మందికి వ్యాధి ఉన్నట్టు తెలియకుండానే తీవ్రమైన దశకు చేరుతున్న కేసులు ఎక్కువగా కనిపిస్తున్నాయని వైద్యులు తెలిపారు. ఇది గుండెపోటు, స్ట్రోక్, కిడ్నీ వ్యాధుల వంటి ప్రాణాంతక సమస్యలకు దారితీస్తోందని వారు హెచ్చరిస్తున్నారు.

యువతలో పెరగడానికి ప్రధాన కారణాలివే

సైలెంట్ కిల్లర్ గా పిలిచే హైపర్ టెన్షన్‌ ఎక్కువ సందర్భాల్లో లక్షణాలు లేకుండానే పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. 40 ఏళ్ల లోపు వయసులో సాధారణ ఆరోగ్య పరీక్షలు చేయించుకునే అలవాటు తక్కువగా ఉండటంతో, దాదాపు సగం మంది తమకు హైబీపీ ఉందన్న విషయాన్ని కూడా గుర్తించలేకపోతున్నారనిపేర్కొన్నారు. పెరుగుతున్న ఒత్తిడి, ఎక్కువ గంటల పాటు కూర్చునే ఉద్యోగ జీవనం, నిద్రలేమి, ఉప్పు అధికంగా ఉన్న ప్రాసెస్డ్ ఆహారం, శారీరక చలనం తగ్గిపోవడం వంటి కారణాలు యువతలో హైబీపీ పెరుగుదలకు ప్రధాన కారణాలుగా వైద్యులు చెబుతున్నారు. చాలా సందర్భాల్లో అలసట లేదా స్ట్రెస్ భావించి నిర్లక్ష్యం చేయడం వల్ల వ్యాధి ఆలస్యంగా
గుర్తించబడుతోందని వారు తెలిపారు.

ఇక ఇది వృద్ధాప్య వ్యాధి కాదు: డాక్టర్ కృష్ణ మోహన్

కేర్ హాస్పిటల్స్ హైటెక్ సిటీ డైరెక్టర్ సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ లాలుకోట కృష్ణ మోహన్ మాట్లాడుతూ హైపర్ టెన్షన్‌ ఇక వృద్ధాప్య వ్యాధి కాదు. ఇప్పుడు అత్యంత చురుకైన వయసులోనే, ముఖ్యంగా కెరీర్ పీక్ దశలో ఉన్నవారిలో ఎక్కువగా కనిపిస్తోంది. అసలు ఆందోళన కలిగించే విషయం దీని 'సైలెంట్ డ్యామేజ్'. గుండె, మెదడు, కిడ్నీలపై దీర్ఘకాలంలో తీవ్ర ప్రభావం చూపుతుంది" అని అన్నారు.
ఆయన ఇంకా మాట్లాడుతూ, "చాలా మందికి ఎలాంటి ముందస్తు లక్షణాలు ఉండవు. సమస్య బయటపడే సమయానికి అవయవాలకు నష్టం జరిగి ఉండే అవకాశం ఉంటుంది. డయాబెటిస్, ఒబెసిటీ, కుటుంబ చరిత్ర, ధూమపానం, అధిక ఒత్తిడి ఉన్నవారు తప్పనిసరిగా క్రమం తప్పకుండా బీపీ చెక్ చేయించుకోవాలి. ఒక సాధారణ బీపీ పరీక్షే జీవితాన్ని మార్చగలదు" అని పేర్కొన్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, నియంత్రణలో లేని హైపర్టెన్షన్ రక్తనాళాలను నెమ్మదిగా దెబ్బతీస్తుంది. ఇది స్ట్రోక్, హార్ట్ ఫెయిల్యూర్, కిడ్నీ ఫెయిల్యూర్, వాస్క్యులర్ వ్యాధుల వంటి ప్రాణాంతక సమస్యలకు ప్రమాదాన్ని పెంచుతుంది. భారతదేశంలో నివారించగల గుండె సంబంధిత మరణాలకు ఇది ప్రధాన
కారణాలలో ఒకటిగా నిలుస్తోంది.

ముందే గుర్తించండి.. వెంటనే నియంత్రించండి

జీవనశైలి మార్పులే మొదటి రక్షణగా ఉండాలని వైద్యులు స్పష్టం చేశారు. క్రమం తప్పని వ్యాయామం, ఉప్పు తగ్గిన ఆహారం, సమతుల్య పోషకాహారం, బరువు నియంత్రణ, తగిన నిద్ర, ఒత్తిడి నిర్వహణ, ధూమపానం- మద్యపానం నివారణ ద్వారా ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించవచ్చని డాక్టర్ లాలుకోట కృష్ణ మోహన్ తెలిపారు. హైపర్ టెన్షన్‌ నివారణ అవగాహనతోనే ప్రారంభమవుతుంది. లక్షణాల కోసం ఎదురుచూడకుండా ప్రతి ఒక్కరూ ముందుగానే పరీక్షలు చేయించుకోవాలి. 30 ఏళ్ల తర్వాత సంవత్సరానికి ఒకసారి బీపీ చెక్ చేయించుకోవడం అలవాటుగా మారాలి అని సూచించారు. ప్రివెంటివ్ కార్డియాక్ కేర్ పై తమ కట్టుబాటును పునరుద్ఘాటిస్తూ కేర్ హాస్పిటల్స్ ముందస్తు గుర్తింపు అవగాహనను విస్తృతంగా పెంచాల్సిన అవసరం ఉందని పేర్కొంది. వరల్డ్ హైపర్ టెన్షన్‌ డే సందర్భంగా వైద్యుల సందేశం ఒక్కటే - ముందే గుర్తించండి, వెంటనే నియం త్రించండి. హైపర్టెన్షన్ హెచ్చరిక ఇవ్వ కపోవచ్చు.. కానీ దాని ప్రభావం మాత్రం అకస్మాత్తుగా రావచ్చు.

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prajatantra News